3841* వ రోజు....           22-May-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయక తప్పదు.

ఇది 3841* వ నాటి (22.5.26),  అక్షరాలా 25 గురి శ్రమదానం!

               శ్రమ పరిత్యాగ స్థలం ఈ శుక్రవారంతో సహా -10-12 రోజుల నుండీ కాసానగర - NH 216 - చెక్ పోస్టు ప్రదేశమే! ఈ పూట 4.20 - 5.55 అనగా 95 నిముషాల పాటు వీరిలో అత్యధికులు శ్రమ పండుగ జరుపుకొన్నది కూడ హైవే - కాసానగర కూడలిలోనే! ఏదో 5-6 గురు మాత్రం అ సువిశాల రోడ్డు ఊడ్పులకు పాల్పడ్డారు!

               “ఇదేదో వందలకొద్దీ స్వచ్ఛ కార్యకర్తలు మైళ్ళ కొద్దీ రహదారిని అద్భుతంగా తీర్చిదిద్దినట్లు బిల్డప్ ఇవ్వడం మొదలుపెట్టాడే అని ఎవరూ భావించకుందురు గాక! అట్టి వ్యక్తులున్నచో ఈ క్రింది అంశాలను గుర్తించుకోగలరు :

1) 10 రోజులూ - ముఖ్యంగా నిన్న – 480 సెంటిగ్రేడులు వేడి నమోదవుతున్న సమయంలో ఎవరూ బైట తిరగవద్దని పదేపదే హెచ్చరికల కాలంలో - ఊరికి దూరంగా జరుగుతున్న శ్రమదానమనీ.

2) అది కూడ నాజూకు పనులో, సొంత పనులుకో కాక – సామాజిక, సాముహిక - సుదీర్ఘ కాల కష్టమనీ

3) చాల మంది గ్రామస్తులు హాయిగా A/C ల్లో పరుండి నిద్రిస్తున్న వేకువ సమయమనీ...!

4) “అదుగోరా చెత్తపనుల బ్యాచ్చీ, 30-40-50 మందటా-  చల్లపల్లిని ఉద్ధరించేస్తారటా ... వంటి అవహేళనలను అధిగమించి,

               “వీళ్లురా! సమాజం పట్ల బాధ్యతగల స్వార్ధరహిత కార్యకర్తలు!....”

               అనే గుర్తింపు గల ఒక విలక్షణ స్వచ్ఛ కార్యకర్తల సమూహమనీ...!

               అసలీ వేకువ మెల్లగా వీచింది చల్లగాలి కాదు - మంటగాలి! ఆడా-మగా -చిన్నా-పెద్దా భేదం లేదు - అందరూ చెమటల స్నానం చేశారనీ,

               “సొంత ఊరి పట్ల నిబద్ధత అంటే ఇది కాదా!” అనీ ప్రతి ఒక్కరూ అగీకరించాలి, వీలైనపుడల్లా, స్వచ్ఛ కార్యకర్తలతో కలిసి పోవాలి!

               6.12 కే ముగిసిన నేటి సమావేశం గూడూరు - కోడూరు వారి భీకర స్లోగన్స్ తో మొదలై,

               కార్యకర్త కష్టంతో శుభ్రపడిన - పూలతో కళకళలాడుతున్న జంక్షన్ లోని భారీ వాహనం పొరపాటుకు విరిగిపడిన డివైడర్ ప్రస్తావన కొచ్చి,

               రేపటి శ్రమతో కాసానగర జంక్షన్ సుందరీకరణ పూర్తి కావాలనే అంచనాతో ముగిసింది!

               అందుకే బండి శరత్

స్వచ్ఛ వాలంటీర్లె గానీ - పంచాయతి వర్కర్లె గానీ

తలపు ఒకటే – “స్వచ్ఛ సంస్కృతి వ్యాప్తి చెందక తప్పదిక” అని

అందుకే బండి శరత్ కూడా అద్భుతంగా చేయు వేకువ

సేవ నాలాంటోళ్లకంతా నిజంగా ఆదర్శమే మరి!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   22.05.2026