3845* వ రోజు....           26-May-2026

 పర్యావరణ ధ్వంసకమయిన – ఏకమాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్కులు ఇకనైనా మానేద్దాం!

కాసానగర్ చెరువు కేంద్రంగానే మరొక శ్రమదానం @3845*

               రోహిణి కార్తె 2 వ నాడు - ఎండలకు రోళ్లు పగిలాయో లేదో గాని, ఆ అననుకూల ఉక్క వాతావరణానికి ఈ పూట 30 మంది కార్యకర్తల బట్టలు చెమటకు తడిసి ముద్ద ఐపోయినవి! ఇంకానయం జ్యోతి, అన్నపూర్ణ, ఉరిమి శాయి గారు సీసాల కొద్దీ అందించిన నీళ్లు త్రాగారు గనుక సరిపోయింది గాని లేకపోతే డీ హైడ్రేషన్ కు గురయ్యే వాళ్లు!

               వీరిలో కొందరైతే నిర్ణీత వేకువ సమయం - 4.30 కన్నా ముందే నాగాయలంక రోడ్డులోకి ప్రవేశించారు! ఆ పిదప కూడ వచ్చిన వాళ్లు వచ్చినట్లు చేతొడుగులేసుకొని, తలదీపాలమర్చుకొని, తమ తమ ఆయుధాలందుకొని, చెరువుకు తూర్పు రహదారి కాలుష్యాల మీద దండెత్తారు!

               చెట్లు కాయల్నీ, నీడనూ, ప్రాణ వాయువునూ అందించండం లేదూ ప్రపంచానికి? గాలి మానవుల సేద తీర్చడం లేదూ? ఇతర పంచ భూతాలు కూడ జీవకోటిని సుఖంగా దీవించడం లేదూ? ఈ స్వచ్ఛ కార్యకర్తలు అంతే - ప్రొద్దున లేవడమాలస్యం - ఏ వీధిని బాగుచేద్దాం, ఏ శ్మశానంలో మన బాధ్యతలు నెరవేరుద్దాం, ఏ రహదార్లను మరింత సౌకర్యవంతంగా మారుద్దాం......అనే ఆలోచనలే - ఆచరణలే!

               లేకపోతే - ఇళ్లకు 3 కిలోమీటర్ల దూరపు నాగాయలంక రోడ్డు డ్రైన్ లో పిచ్చి మొక్కలు తొలగించే పని ఈ ఆకుల వారికీ, మాలెంపాటి - సజ్జా - గంధం - కస్తూరీ, BSNL లాంటి వాళ్ళకవసరమా?

               ఆస్పత్రి ఉద్యోగులు ఆనందంగా రహదారిని ఊడ్చి, దిక్కుమాలిన కాలుష్యాలను డిప్పల్తో ట్రాక్టర్ లో నింపడమా? ఏదో ఒక్కపూట తప్ప అన్నపూర్ణ వంటి గృహిణులు నాగా లేకుండా ఈ మురికి పనులకు పాల్పడడమా? పనులు ముగిశాక ఆ150 గజాల బాటనూ, డ్రైన్ నూ చూసుకొని మురిసిపోవడమా? అసలీ చల్లపల్లి తన వేల సంవత్సరాల చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి శ్రమ సంస్కృ తిని ఎరుగునా?

               చివరికి ఆ కస్తూరి శ్రీను మాత్రం అంత ఉత్సాహంగా స్వచ్ఛ సంస్కృతీ నినాదాలను వల్లించడమేమిటి?

నేటి సమీక్షా సభ విశేషాలు 2 !

1) తీవ్రంగా మారిన ఎండల పట్ల DRK గారి గట్టి హెచ్చరికలూ,

2) చల్లపల్లి శ్రమోద్యమానికొక అదృష్టం మొన్న కొందరు దాతల విరాళాలు! మరో దురదృష్టం ఆ దాతలు తమ పేరుగాని, ఫొటో గాని తెలియగూడదనడం!

               రేపటి మన శ్రమదానం పాగోలు రోడ్డులోని NTR పాఠశాల వద్దకు మారింది!

               వృత్తయితే కాంపౌండరు

వృత్తయితే కాంపౌండరు - వక్కలగడ్డ ఇంటి పేరు

వెంకటేశ్వరుని సేవలు విస్తృతమై చల్లపల్లి

గ్రామమెల్ల బాగుపడి కాంతి వంతముగ మారెనొ

గమనిస్తిని - సామాజిక స్పృహనెంతో మెచ్చితిని!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   26.05.2026