పర్యావరణ ధ్వంసకమయిన – ఏకమాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్కులు ఇకనైనా మానేద్దాం!
శ్లాఘనీయమైన శ్రమ - సమయ – అర్ధదాన దృశ్యాలు - @3846*
ఆ 3 రకాల త్యాగాలు మే – 27 – బుధవారానివి! 29+6=(35) గురివి. వాటి వేదిక పాగోలు పరిధిలోని NTR పాఠశాల మొదలు సదర గ్రామ ఆరంభం దాక!
“ఇందులో వింతేమీ? క్రొత్తేమీ?” అనుకొంటున్నారేమో! “స్వచ్ఛ కార్యకర్తల ఈ సంక్లిష్ట శ్రమ యజ్ఞం 13 ఏళ్లుగా జరుగుతున్నదే కదా! ఈ బుధవారం నీవు క్రొత్తగా చేప్పేదీ, మేం వినేదీ ఏముంటుంది?” అని కూడ పొరబడకండి! నేటి క్రొత్తందనాలు ఇవి :
A) చల్లపల్లి పుర ప్రముఖుడూ, ఆర్య వైశ్య వంశ సంజాతుడూ ఐన ఉరిమి శాయి గారు తన 70 వ పుట్టిన రోజును సకుటుంబంగా వేకువనే వచ్చి, పాగోలు రోడ్డులోనే సామాజిక శ్రమదాతల నడుమ జరుపుకోవడం!
B) అది కూడ సాదాసీదాగా కాక (6+6+2) పచ్చ తురాయి, ఎర్ర తురాయి, పొన్న పూల మొక్కల్ని నాటి, స్వచ్ఛ కార్యకర్తల నోళ్లు తీపి చేసి, స్వచ్చోద్యమ ఖర్చులకై 15,000/- (+2000 మొక్కల నిమిత్తం) విరాళ మందించడం!
C) ఇక ప్రాత అలవాటును కొనసాగిస్తూ లంకే సుభాషిణి మేడమ్ కార్యకర్తలకు దోసకాయలు పంచడం!
పొలంలో జరిగిన కార్యకర్తల నేటి తుది సమావేశంలో ఉరిమి శాయి గారి కుమారుడు ప్రవీణ్ నూ, BSNL నరసింహుడున్నూ సంయుక్తంగా నినాదాలు ప్రకటించడం!
ఇవి కాక మిగిలిన శ్రమ చేష్టలు – రోడ్డు మార్జిన్ గడ్డీ, పిచ్చి మొక్కల తొలగింపూ, కొన్ని చెట్ల సుందరీకరణమూ, చెత్తల – ప్లాస్టిక్ సామాన్ల సేకరణమూ షరామామూలుగానే!
ఈ 30 కి పైగా కార్యకర్తల శ్రమ పట్లా, పాగోలు రహదారి అందచందాల పట్లా, అందుకు పాగోలు జనుల సహకారం పట్లా DRK గారి ఆనందం కూడ యధాతథమే!
“చల్లపల్లిలోని 28 వేల మంది ప్రజలూ, పెద్దలూ ఇలాంటి ఫంక్షన్లను శ్రమజీవుల సమక్షంలో, ఇలా విభిన్నంగా, సామాజిక ప్రయోజనకరంగా హరితాత్మకంగా జరుపుకొంటే ఎంత బాంగుండునో గదా!” అని కొందరు స్వచ్ఛ కార్యకర్తలనుకొంటుండగా విన్నాను!
రేపటి మన శ్రమదాన ప్రదేశం కాసానగరం చెరువు వద్ద!
సతీష్ ప్రథమ లక్షణము!
స్వస్త గ్రామ సాధనె ఈ సాధనాల సతీష్ లక్ష్యము
గ్రామ కళాత్మకత కాతని సహకారము ఆదర్శము
రహదారని - శ్మశానమనీ - రాత్రీ పగలని చూడక
స్వచ్ఛ శ్రమ విన్యాసమె సతీష్ ప్రథమ లక్షణము!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
26.05.2026