3847* వ రోజు....           28-May-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయవలసిందే.

       3847* వ నాటి సామూహిక శ్రమ కూడ కాసానగర్ వద్దనే!

సమయం 4.20 AM, గురువారం -28.5.2026, సమూహం తొలిగా 10 మందీ, నెమ్మదిగా 28 మందీ! పని ముగింపు 5.50, కాఫీ + స్వచ్చ కబుర్లూ ముగిసి, తుది సమావేశం జరిగింది 6.12 దాక! 

సమావేశం జరిగిందేమో కాసానగర తటాకంలో! కాసానగర్ నివాసులకు విన్పించేలా తన నినాదాలతో ప్రారంభించినదీ భోగాది వాసు మాష్టారు! సమావేశాన్ని సమీక్షతో ముక్తాయించినది డాక్టర్ DRK ప్రసాదు గారు!....

ఇదీ సూక్ష్మంలో మోక్షంగా ఈనాటి శ్రమ సౌందర్య ప్రస్తావన! వివరాలూ, విశేషాలూ, ప్రస్తావించాలంటే అవి చాలా ఉంటాయి- భిన్న కుటుంబ నేపధ్యాల పాతిక- ముప్పై మంది కార్యకర్తలు గ్రామ సామాజిక సచ్చింతనతో ఊరికి దూరంగా డ్రైను పనులూ, రహదారి ముస్తాబులూ చేస్తున్నప్పుడు –

ఆ పనుల్లోనూ సృజన శీలత బైట పడుతున్నప్పుడు – ఒక్కొక్క తాడీ, ఈత చెట్టును గురవయ్యో- కోడూరు వారో పోటీపడి సుందరీకరిస్తున్నప్పుడు –

సజ్జా, మల్లంపాటి, అనిల్ – జాన్స్టన్లు చెత్త డిప్పలు మోస్తున్నప్పుడు- ఆడ నర్సులు క్రొత్త సిమెంటు బాటను పునః పునః శుభ్రపరుస్తుండగా – బృందావనాదులు లోతు డ్రైన్ లోనూ, అన్నపూర్ణాదులు రోడ్డు మార్జిన్ లోనూ శ్రద్ధగా మట్టి పన్లూ, ప్లాస్టిక్ – గాజు ఎంగిలి సీసాలు ఏరుతుంటే – అంజయ్య తదితరుల ప్రయత్నంతో పొలంలోకి బాటంతా కశ్మల రహితమౌతుంటే .... విశేషాలకేం కొదువ?

ఇక రక్తదాన పరమవీర చక్ర (అనధికార) బిరుదాంకితుడెవరో తెలుసుకదా!

విజయవాడ మణిపాల్ ఆస్పత్రిలో 6000 కౌంటుకు ప్లేట్ లెట్లు దిగజారి, ప్రాణాపాయంలోనున్న వ్యక్తిని తన ప్లేట్ లెట్ల దానంతో బ్రతికించడానికి మండుటెండలో వెళ్లి వచ్చాడొక విజయుడు! ఇతని రక్తదానాల సంఖ్య ఇప్పుడు 80!

ఈ నాగాయలంక రహదారి మరమ్మత్తులూ, చెట్లకు మెరుగులు దిద్దుడూ వంటి పనుల కోసం రేపు కూడ కాసానగర్ చెరువు వద్దనే కలవాలని నిర్ణయించారు!  

                 యుక్తుల కొక మారు పేరు

అసలుకు నారంశెట్టి - కొసరుకు యోగా టీచరు

యోగా మాస్టరంటేనే యుక్తుల కొక మారు పేరు

శ్రమదాన విధానములో చాల ముఖ్య పాత్ర తనది

గ్రామ వీధి కల్మషాలు గులాంగిరీ చేయు తనకి!

- నల్లూరి రామారావు

రిటైర్డ్ ప్రిన్సిపాల్

   28.05.2026