3852* వ రోజు.......           02-Jun-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయవలసిందే.

28 మంది నెరవేర్చిన రహదారి బాధ్యతలు - @3852*

               అవి 2.6.26 మంగళవారం నాటివి; వారి ఇళ్ల ఎదుట వీధిలో జరిపినవి కావు – ఇళ్లకూ ఊరికీ దూరంగా నాగాయలంక మార్గంలోనివి; రోజూ 30-40 మంది కాసానగర్ ప్రాంతంలో 3 వారాలకు పైగా చెమటోడుస్తున్నవి; ప్రభుత్వమో - DRK డాక్టరో అదేశిస్తేనో -  బ్రతిమాలితేనో – ప్రలోభపెడితేనో జరుగుతున్నవి కావు - కంటికి కనిపించని బ్రహ్మపదార్థమైన సమాజం కోసం స్వయం ప్రేరితులు చేస్తున్న సుదీర్ఘ శ్రమదానమది!

               3 రోజులుగా సామూహిక శ్రమదానం రుచి మరిగిన – ఏలూరుకు చెందిన – 3rd B.Tech విద్యార్థిని నిహారిక చెప్పినట్లు – ఇంతటి పచ్చదనాల - సహజ వాయువుల మధ్య - ఇందరితో కలిసి, సొంతానికి కాక – ప్రజాహ్లాద నిమిత్తం జరిగే ఒక సుదీర్ఘ శ్రమదానంలో పాల్గొనడం ఎంత మంచి విషయం!

               ఈ శ్రమదాతల్లో ఏ ఒక్కరూ ఆ100 నిముషాల సమయంలో

- కులమత ప్రాంత భేదాల రొచ్చులో పడలేదు,

- ఒళ్లు దాచుకొని, తమాషా చూడలేదు,

- అవసరమైతే డ్రైనులో దిగి, చెత్త ఊడ్చి, ప్లాస్టిక్ లు ఏరి, ఎంగిలి విస్తర్లు ఎత్తారు,

- తాడి మట్టలు మోశారు, ఎంగిలి బిర్యానీ పొట్లాలు ఏరడమే తమ కర్తవ్యమనుకొన్నారు,

- పని వల్ల ఒంట్లో నీరు ఆవిరైపోతుంటే సీసాల కొద్దీ నీరు త్రాగారు, అందరూ సమన్వయంతో పనులు చేసి, మరొక 50 గజాల్లో చెట్ల సుందరకరణతో సహా అనుకొన్న పనులు ముగించారు! ఈ క్రమంలో

1) ఫొటోలు తీసుకొని సరిపెట్టక తూము వెంకటేశ్వరుల వారు బాగా బరువైన - బారైన గడ కత్తితో తాటాకులు కోస్తూ మట్టి సుద్ద ఎడుమ కంటిపై పడి, కళ్ళజోడు విరిగినా, మళ్లీ అదే పని కొనసాగించారు!

2) అకుల దుర్గాప్రసాదు గారి బండి పడిపోయినా, కాలు దెబ్బతిననందుకు అందరూ సంతోషించారు!

               “ఇదేమీ A/C రూంలో లాప్ టాప్ ముందు పని కాదు కదా – శరీర కష్టం స్ఫురింపజేసే వీధి పనిలో అలాంటివి తప్పవులే” అని సరిపెట్టుకొన్నారు!

               B.Tech. అమ్మాయి నిహారిక ధైర్యంగా తన అనుభవాన్ని చెప్పడాన్ని DRK గారు మెచ్చుకొన్నారు!

               రేపటి వేకువ మళ్ళీ ఈ N. లంక రహదారి సేవలకే అంకితమవ్వాలని నిర్ణయించారు!

               ఔద్యోగిక వర్గములో!

RTC బస్ చోదకుడైన తోట నాగేశ్వర

వినయ వివేకాత్మమగు స్వచ్ఛ కృషిని గమనిస్తిని

అతని ఉనికి తప్పదు ప్రతి ఆదివార సేవలలో

అతని దీక్ష ఆదర్శము ఔద్యోగిక వర్గములో!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   02.06.2026