పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయవలసిందే.
3854* వ నాటి (గురువారం – 4.6.26) 27 గురి సార్ధక శ్రమ!
4.20-5.58AM ల నడిమి సదరు కష్టం కూడ కాసానగర తటాక తూర్పు రహదారి కి చెందినదే! ఆ మాటకొస్తే – 2 వారాలకు పైగా, ప్రణాళికాబద్ధంగా కార్యకర్తలు చెల్లిస్తున్న పొరుగు గ్రామ బాధ్యతలూ, నిన్న ఉదయం 9:00 - నిప్పులు చెరిగే ఎండలోనూ రాత్రి 9:00 వరకు ఆ రహదారి పనులే!
అసలు నిన్న ఉదయం 6.30 కే ఆ పాంత్రపు రోడ్డు వంకపెట్టజాలని విధంగా ముచ్చటగా కనిపించింది. కాని, ట్రస్టు కార్మిక పర్యవేక్షక కస్తూరి శ్రీను JCB తోనూ 5 అద్దె ట్రాక్టర్లతోనూ అక్కడి రోడ్డు పడమటి మార్టిన్ ను పటిష్టపరచడానికి తయారుకావడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది!
ముందుగా ఎక్కడెక్కడి నుండో 40 తాటి దూలాలు తెచ్చి, రోడ్డుకు 1½ గజాల దూరంగా పేర్చి,
JCB త్రవ్వి అందిస్తున్న మట్టిని చెరువు నుండి ట్రాక్టర్లతో తెచ్చి ఆ ఖాళీలో నింపి, చదును చేసి,
కార్యకర్తలు 2 మాసాలుగా పడుతున్న యాక్సిడెంట్ల భయం తొలగేట్లుగా బరంతు వేయడం వల్ల
ఆ తడి మన్ను అంటుకొని, రోడ్డంతా పిడచలు కట్టి, అసహ్యంగా కనిపిస్తే –
మళ్లీ 20 మంది కార్యకర్తలు రోడ్డు శుభ్రతకు పూనుకోవలసి వచ్చింది! అందువల్ల ఈ పూట చీపుళ్ళకన్న గోకుడు పారలూ, చెక్కుడు పారలూ, రైల్వే పారలే ఎక్కువగా పనికి దిగాయి! ఊడ్పుల బరబరలు బదులు చెక్కుడు గరగరలే కనిపించాయి!
2 లక్షల ఖర్చుతో సిమెంటు రోడ్డు నిర్మాణమూ,
30-40 వేల ఖర్చుతో నిన్నటి రోడ్డు మరామత్తులూ ఈ స్వచ్ఛ కార్యకర్తలకవసరమా? అసలిదేమన్నా ఆహ్లాదకర డిసెంబరు - జనవరి మాసాల చల్లని వాతారణమా?
సామాజిక బాధ్యత పేరిట ఇంత ఉక్కపోతలో – ఇంత శ్రమదానం వీళ్లుకాక ఇంకా దేశంలో ఎక్కడైనా ఎవరైనా చేస్తారా?
BSNL నరసింహుల వారు నినాదాల పిదప చెప్పినట్లు - ఎక్కడెక్కడి నుండో ఈ శ్రమదాన పక్షులు చల్లపల్లికి వలస వచ్చి, ఆ ఊరి శుభ్ర, సుందరీకరణకు దిగి, అది తమ అదృష్టంగా మురిసి పోతుంటాయి!
రేపటి వేకువ కూడ ఇదే N. లంక బాటలోనే ఈ పక్షులు వేకువ 4:30 కు మళ్ళీ వాలబోతున్నాయి!
వింతగాదది
పౌరశాస్త్రం బోధపరిచే వ్యక్తి వేముల శ్రీను గారికి
పాఠమును బోధించి ఆగక పౌర బాధ్యతలిట్లు చూపుట
కత్తి గొర్రులు చేతబట్టీ కశ్మలాలను చెండు చుండుట
వింతగాదది చల్లపల్లి వినుత శ్రమదానముల మహిమట!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
04.06.2026