3855* వ రోజు.......           05-Jun-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయవలసిందే.

మరొక సంతృప్తికర రహదారి శ్రమదానం - @3855*

               దాని సమయం 4.22-5.55 AM. శ్రమకు కేటాయించుకొన్న స్థలం నాగాయలంక రహదారి భాగమే! శ్రమించింది 30+1 మందీ(+1 అంటే గంధం వేంకటేశ్వర నామధేయుడు!)

               ప్రాంతం చల్లపల్లి పరిధిలోనిదైతేకావచ్చు గాని, ఊరికీ, కార్యకర్తల నివాసాలకీ దూరం, పెదప్రోలుకు చెందిన కాసానగరుకు చేరువలో!

               మరి ఆ గంటన్నర కాలంలో ఈ శుక్రవారం(5.6.26) వేకువ ఏం జరిగిందంటారా? 11 ½

ఏళ్ళ నుండి ఏం జరిగిందో ఈ పూటా అంతే! మొన్న JCB, 2 అద్దె ట్రాక్టర్ల సాయంతో చెరువు మట్టిని రోడ్డు బరంతు వేసి, నిన్న దాన్ని సక్రమంగా సర్దినా, కొందరు కార్యకర్తలకు బెంగ పట్టుకొన్నదట – వర్షాలకు ఆ మన్ను కారిపోతుందని! అందుకని దుర్గా ప్రసాదు అనే ఒక (తాపీ) మేస్త్రి ఆధ్వర్యంలో 12 మంది పారలు, డిప్పలతో, మన్ను మోసి, చదును చేస్తుంటే - ఇద్దరు చీపుర్ల వారు ఫైనల్ గా ఊడుస్తుంటే – కార్యకర్తల రోడ్డు భద్రత గురించి DRK గారు జాగ్రత్తపడుతుండగా - చెరువు బారునా ఇప్పుడా రోడ్డు మార్జిన్ ఎలాఉందో చెప్పండి!

               అచ్చటికి చల్లపల్లి వైపుగా రోడ్డుకు ప్రక్కలా మిగిలిన కార్యకర్తల శుభ్ర సుందరీకరణ షరామామూలే! డ్రైన్ లో కొందరూ, బాట అంచుల్లో కొందరూ పనిచేసుకుపోతూనే ఉన్నారు! వాళ్ళు స్వయంస్ఫూర్తి మంతులు! పరస్పర స్ఫూర్తి ప్రదాతలు! ఆలోచించ గల వారెవ్వరికైనా స్వచ్ఛ కార్యకర్తల ఈ ప్రతి దిన సామాజిక బాధ్యతలు స్ఫూర్తిని రగిల్చేవే!

               అదేంటోగాని - ఈ వాలంటీర్లకు ఇతర రహదార్ల కన్న ఈ నాగాయలంక రోడ్డు మీద పక్షపాత ప్రేమేమో అనిపిస్తున్నది! లేకపోతే - నిండా కిలోమీటరైనా లేని ఈ ప్రాంతానికిన్ని రోజుల శ్రమలా?

               6.10 కి నేటి నినాదకర్త కస్తూరి శ్రీను ప్రతిజ్ఞలతో బాటు మొన్న 11 గంటల మట్టి పనుల్ని - అందుగ్గాను 34 వేల ఖర్చునూ వివరించగా,

               “అయ్యో! ఇలా 30 మంది కాక నూటికొక్కరు చొప్పన - రోజూ 250 మంది శ్రమదానం చేస్తే ఈ గ్రామమింకా ఎంత ఉంటుందో” అని DRK గారు అత్యాశపడ్డారు!

               88 ఏళ్ల నాటి కరువుకాల్వ త్రవ్వకంలో రోజూ 3000 మంది ఐచ్చికంగా శ్రమదానం చేయడమూ, అందులో గుంటూరు బాపనయ్య తెగింపూ ప్రస్తావనకొచ్చాయి.

               రేపటి వేకువ కూడ ఇక్కడే కలిసి, అమరుల స్తూపం దిశగా శ్రమించాలని నిర్ణయించారు!

               గోళ్ళ వెంకట రత్ననాముడు

ధ్యాన మండలి యందు ముఖ్యుడు గోళ్ళ వెంకట రత్ననాముడు

కొత్తపాలెములో జనించీ, చల్లపల్లికి వలస వచ్చీ

ఊరి బాగుకు నడుముకట్టీ ఉద్యమించుట మంచి ముచ్చట

అతని బాటన నడచినప్పుడు అన్ని ఊళ్లూ బాగుపడు గద?

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   05.06.2026