3856* వ రోజు.......           06-Jun-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయవలసిందే.

3856* వ (శనివారం - 6.6.26) శ్రమదానం ఇలా ఉన్నది!
               అదేమో నాగాయలంక మార్గస్థ – అమరస్తూపం సమీపంలోనే 4:21 కే - 20 మంది కార్యకర్తలతో మొదలై
, 5:55 కు విజళ్లు మ్రోగినా 6:05 కు ముగిసింది! ఇద్దరు క్రొత్త వారు –

1) రాజమహేంద్రి నుండి 67 ఏళ్ల ఫార్మసిస్టు, అశ్వని వైద్యశాల డా. అశ్వని కుమార్ మామ గారూ శ్రీ గోపాలకృష్ణ

2) కూరపాటి శ్రీకాంత్ ల ప్రవేశంతో ఆసక్తికరంగా మారింది.

               వీళ్ళందరికీ 21 మంది తోడై, ఆ రహదారి 150 గజాల భాగం కళకళలాడింది - దేశంలో మరెక్కడా ఇంత సుదీర్ఘ కాలంగా, శ్రద్ధగా, గ్రామ సమాజ శ్రేయస్కరంగా శ్రమదానం జరగదన్నట్లు!

               ఈ 43 మందీ వైద్య, బోధనా, వ్యవసాయ, వ్యాపారాది రంగాలకు చెందిన వివిధ వయస్కులు! 5 గ్రామాలకు చెందిన వాళ్లు! కొందరైతే మరీ లబ్ద ప్రతిష్ఠులు కూడ! ఐతే అందరిదీ ఒకటే లక్ష్యం - ఎలాగైన సామాజిక ఋణభారాన్ని తగ్గించుకోవాలని! పనిలో పనిగా - ఏరోజుకారోజు ఈ సామూహిక శ్రమానందంతో, శరీర కష్టంతో తమ ఆరోగ్యాలు నిలుపుకోవాలని!

               అందువలన ఈ జీతం భత్యం లేని గ్రామ సేవలు చాల విలువైనవి అనాలి. ఇవేమీ ఫొటోలకు ఫోజుల కష్టాలు కావనీ, నాజూకు సేవలు అసలే కావనీ, గునపాలతో - కత్తులతో - పారలతో ఈత ముళ్ళున్న డ్రైన్ల పనులనీ గ్రహించాలి! పైసా ఆశించని - కేవలం మనః తృప్తి కోసం జరగడం వల్లనే పుష్కరకాలంగా ఈ అద్భుతం సాధ్యపడిందని కూడ అర్థం చేసుకోవాలి!

కార్యకర్తల నేటి పనుల ఫలితంగా -

1) అణచి పెట్టి త్రొక్కితే ట్రాక్టర్ నిండిన వ్యర్ధాలూ,

2) గురవయ్య మాస్టారి చేతికి కత్తి గాటూ,

3) 150 గజాల రోడ్డు పరిశుభ్రతా,

4) 3 గోతాల ప్లాస్టిక్, గాజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు

5) తలా చారెడు చెమటలూ - ఇంకా ఇవి కాక

6) ఆకుల దుర్గా ప్రసాదు గారు రూపొందించిన చెక్క కుర్చీ.... ఏర్పడ్డాయి!

               ముందుగా వల్లభనేని కుమార్ - స్నేహల నినాద ప్రకటనా,

               తరువాత గోపాలకృష్ణ గారు కార్యకర్తలకు ఆరోగ్య – దేహదారుఢ్య సూక్తుల చక్కటి ఉపన్యాసమూ, చల్లపల్లికి వారు బహూకరించిన 28 ఏళ్ల వయసున్న 10 అంగుళాల మొక్కా...,

               ఎప్పటిలాగే ఈ సామూహిక శ్రమ వేడుక పట్ల DRK గారి ఆనందమూ.... ఇవీ నేటి తుది సభా విశేషాలు!

               రేపు మనం కలువవలసింది అమరస్తూపం వద్ద!

               రాయపాటి వారి కోడలు

వీధి శ్రామిక మెంత కఠినమొ - స్వచ్ఛ సాధనమెంత భారమొ-

దుమ్ము - ధూళీ, ఎంగిలాకులు తొలగ ఊడ్చుట కష్ట సాధ్యమొ –

తెలియకా? శ్రమదానమున కేతెంచుచుండే ఉపాధ్యాయిని

రాయపాటి వారి కోడలు రమా గారికి తెలుసు తెలుసది!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   06.06.2026