3859* వ రోజు..........           09-Jun-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానేయవలసిందే.

3859* వ నాటి శ్రమదాన సంగతులు! (9-6-26)

               ఈ మంగళవారం నాటి 27 మంది రహదారి శుభ్రతలను గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. తొలి వార్త 4.20 కే 11 మంది అమరస్ధూపం వద్ద సంసిద్ధత. ఆ చోటు నుండి ఉత్తర దక్షిణాలుగా 6.02 నిముషాల దాక శ్రమ క్రమం ఇట్లున్నది:

- N. లంక రోడ్డు తూర్పు డ్రైన్ లో 6+1 = 7 గురి బాగు చేత ప్రధాన చర్య వ్యర్ధాల లోడింగు 6 గురు డిప్పలకెత్తి, డ్రైను గట్టెక్కి అందించుట, 1 అంజయ్య వాటినందుకొని, అనుభవాన్ని రంగరించి, సర్దుట!

- ఈ ముఠాకు మేస్త్రి కస్తూరి శ్రీను నాయకత్వంలో బడి పంతుళ్లూ, నర్సులూ ఆ సంచార చెత్తబండిని 6.00 దాటాక కూడా ఆ 150 గజాల్లో త్రిప్పి, చెత్తను - ముళ్ల మండలతో సహా సేకరిస్తూనే ఉన్నది!

- అమరుల స్థూపం ప్రక్క స్థలం ఎదుట 10 మందిది మరీ కష్టమైన పని. ఎందుకంటే బాగా ఎగుడుదిగుడు చోటు కాబట్టి, ముళ్ళ, జిల్లేళ్ల పొదలుండడం వల్ల కూడ! వాటిని లోతుగా త్రవ్వి గునపాలతో పెళ్లగించి, దుంప నాశన కార్యక్రమం కనుకా,

- 3 సార్లు గట్టి, ప్రయత్నమే చేసినా, వర్షం పెద్దగా పడలేదు గాని, వెర్రిగాలి మాత్రం వీస్తూనే ఉన్నది! ఆ ధాటికి అక్కడున్న 2 తాడి చెట్లు ఎత్తున్న మహాగని మహా వృక్షం రకరకాల నాట్యాలు చేసింది గాని, విరిగి పడలేదు.

- పడమటి దిశగా కోళ్ల ఫారం ఘాటు వాసన మధ్య ఆకుల, బెనర్జీ వంటి నలుగురైదుగురి పని ప్రధానంగా కాగితప్పూల ముళ్ళ చెట్ల - సుందరీకరణమే!

               పాటల శ్రీనూ, మరొక తుది మెరుగుల స్పెషలిస్టూ (Finishers) పడమటి డ్రైన్ గట్టు సుందరీకరణలో నిమగ్నులయారు!

               ఉద్యోగ విధుల సమయం సమీపించిందని ఇద్దరు ఉపాధ్యాయులు – అనిల్ - జాన్స్టన్ లు కాఫీలు త్రాగకుండానే వెళ్లిపోయారు!

               ఇక మిగిలిన పాతిక మందీ రోడ్డు తూర్పున నిలిచి, ఆ ప్రాంతం మారు మ్రోగేట్లుగా మాలెంపాటి అంజయ్య గారి నినాదాలూ, 10 ఏళ్లుగా చెత్త ట్రాక్టరు సర్దే పనిలో మాత్రమే అతడెందుకుంటున్నదీ విన్నారు.

               చెట్ల విద్వంసకుల పట్ల DRK గారి ఆవేదన ఈరోజు కూడ తగ్గలేదు - ఆయన వెంకటాపురం దాక వెళ్లి చెట్లన్నీ భద్రంగా ఉన్నవా అని చూసి వచ్చారు.

               రేపు కూడ మనం కలిసేది అమరవీరుల స్తూపం వద్దనే!

                              అంజయ్యచ్చటే

మురుగు గుంటో - చెత్తబండో - బురద పేరిన కాల్వగట్టో-

నడకుదురు రోడ్డో - కర్మభవనమొ - శ్మశానము ఏదైన గానీ

అధిక కశ్మల మెచట నుండునొ అంజయ్యచ్చట ఉండి తీరును

అతని కష్టము దశాబ్దముగా అంకితము ఈ చల్లపల్లికి!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   09.06.2026