పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?
సోమవారం (15.6.26) కూడ....@3865*
మళ్లీ అవనిగడ్డ రహదారిలోని ఉరిమి ప్రభాకర్ రైసు మిల్లు ప్రాంతానికే కార్యకర్తల శ్రమ సమర్పితం. 6.00 కు వెంకటాపురం నుండి వచ్చిన 19 మంది పనివారలు కాక స్వచ్ఛ కార్యకర్తలే 28 మంది! (అందులో 13 మంది పని పార్రంభోత్సవమైతే 4.21 కే!)
అంటే - ఒక గ్రామం శుభ్ర సుందరంగా, గ్రామస్తులు ఆహ్లాదంగా ఉండాలని ఊరికి దూరంగా 46 మంది వేకువ 4.20 నుండి 10.00 దాక పాటుబడున్న విషయం ఎంతగా ఆకర్షణీయమో - ఆదర్శమో - స్పూర్తి మంతమో ప్రజలెప్పుడు పట్టించుకొంటారు?
రోజూ 28 వేల మందిని చెత్తపనులకు రమ్మనడం లేదు - అందులో ½ % (150) మంది కలిసి వచ్చినా ఈ చల్లపల్లిలో ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో అని Dr. దాసరి రామకృష్ణాదుల ఆశ!
మూతబడిన పెద్ద రైసుమిల్లు బారునా రామదండులా వివిధ వయస్సుల కార్యకర్తలే! కొందరిది అక్కడి మినీ గార్డెన్ సుందరీకరణం, మరి కొందరిది ఆ ప్రాంతాన్ని ప్లాస్టిక్ రహితంగావించే ప్రయత్నం, ఊడ్చేవాళ్లు, చెట్లను ట్రిమ్ చేసేవాళ్లు, గడ్డి కత్తిరింపుల వాళ్ళు, రోడ్డు పడమర డ్రైన్లో దిగి, భుజాల పైభాగమే కనిపించే వాళ్ళు, ఆ గంటన్నరపాటు బహుళ ప్రయోజనకరమైన శ్రమదానం సందడే!
6.00 కు విజిల్ మ్రోగినప్పుడు కొద్దిమంది అయిష్టంగా పనులాపారు. చేసిన మంచి పనులకు సంతోషిస్తూ, కాఫీల కబుర్లాడుతూ, 6.20 కి సమావేశమయ్యారు! ఆ మీటింగును కొర్రపాటి వీరసింహుల వారు నినాదాలతో ప్రారంభించారు!
అంతే గాదు - స్వచ్ఛోద్యమ ఖర్చులకు తమకుటుంబం తరపున సంవత్సరం క్రితం స్వర్గస్తురాలైన రావెళ్ల వెంకట సుబ్బమ్మ గారి జ్ఞాపకార్థం 20,000/- లు ఇచ్చారు, బిస్కట్ల పొట్లాలు పంచారు.
అసలు టాంజానియా నుండి నలుగురూ, ఇక్కడి ఇద్దరూ - సకుటుంబంగా వచ్చి, చీపుళ్లు పట్టి, గ్రామ స్వచ్ఛ - శుభ్ర చర్యలకు దిగడమే అరుదనుకొంటే - వినూత్నంగా ఆలోచించి, గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు ప్రోత్సాహమీయడమొకటి! (ఈ కొర్రపాటి ఫామిలీకి ఇలాంటివి క్రొత్తేమీ కాదు. టీ షర్టుల, టోపీల ప్రాత్సాహకాలు గతంలోనూ చేశారు!)
అది అలా ఉండగా, కోమలా నగర్ కు చెందిన అంబటి రామలక్ష్మి గారు పనిగట్టుకుని ఆసుపత్రికి వచ్చి 5 వేల రూపాయలను స్వచ్ఛోద్యమ ఖర్చుల నిమిత్తం డా. డి. ఆర్.కె గారికి ఇచ్చి ఆశ్చర్యపరిచారు.
రేపటి వేకువ ఇదే అవనిగడ్డ బాటలో ఆగి, శ్రమదానం బహుశా గ్రామ ప్రవేశం జరుపవచ్చనుకొంటాను!
ఒక్కరైన రా తగదా!
శ్రమించుటకు కాకున్నా సరదాగా రావచ్చునె
ప్రతి వేకువ రాకున్నా రావచ్చునె అప్పుడప్పుడు
తమ ఊళ్లో – తమ కోసం శ్రమ వేడుక జరుగునపుడు
కుటుంబమంతరాకున్నా ఒక్కరైన రా తగదా!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
15.06.2026