3866* వ రోజు........           16-Jun-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

మంగళవారపు (16.6.26) శ్రమదాన సమాచారం - @3866*

               శ్రమస్థలం మళ్ళీ అవనిగడ్డ వైపుగా ప్రభాకర వడ్లమర వద్దనే! దాతలు 30 మందిగానూ, 6.10 తరువాత వెంకటాపురం కూలీలు 20 మందితో కలిసి మొత్తం 50 మంది కష్టంగానూ లెక్క తేలింది!

               ఇంత మందితో కలిసి – ఇన్ని రోజుల కష్టం ఆ ప్రాంతానికెందుకొచ్చిందనుకొన్నారు? –

1) ప్రయాణికులు అనాలోచితంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు అలవోకగా విసిరేయడం వలన,

2) రైతులు పంట సీజన్ కోసం పిచ్చి చెట్లూ, మంచి చెట్ల కొమ్మల వంటివి డ్రైన్లలోకి త్రోసేయడం వలన,

3) పదేళ్ళుగా కార్యకర్తలు వ్యయప్రయాసలతో నాటి, పెంచిన సుమారు వెయ్యి పూల – నీడ – పండ్ల చెట్ల కొమ్మలు అదుపు తప్పి విచ్చలవిడిగా పెరగడం వాళ్లకు నచ్చనందు వలన,

4) ఇంకా తుఫాను గాలులకు చెట్లూ, ఆకులూ, కొమ్మలలూ విరిగి డ్రైన్ లో పడి మురుగు నీటి నిల్వకు దారి తీసే అవకాశం వలన కూడ!

5) రోడ్డుకు మార్జిన్ల మెరక చాలక అవి విరిగి పడే – ప్రయాణికులు పడిపోయే ప్రమాదాలు తప్పించే ఉద్దేశ్యంతో కూడ!

               మరి ఇన్ని పనులకు నెలకు పైగా రోజుల - మొత్తం సుమారు వెయ్యి మంది కార్యకర్తల - సుమారు 15 వేల పని గంటల - అంతే కాదు – 2 ½  లక్షల డబ్బు ఖర్చుల అవసరం పడింది!

               ఆ అవసరాన్ని పంచాయతీల, ప్రభుత్వాలకన్న ముందే ఈ స్వచ్ఛ కార్యకర్తలూ, “మనకోసం మనం” అనే ట్రస్టూ తీర్చడం జరిగినందువలననే ఈ జాప్యం అనుకోండి!

               కార్యకర్తల ఈనాటి శ్రమ -  డ్రైన్ల తుక్కులూ, ఇతర ఆటంకాలూ తొలగించడం, ఆ ప్రాంతాన్ని ప్లాస్టిక్ రహితం చేయడం, ఊడవడం, చెత్తల్ని ట్రాక్టర్ లో నింపడం వంటివి ఏ రోజైనా ఉండేవే!

               నేటి తుది సమావేశ ప్రతేకత ఏమంటే - అది కూలీల మేస్త్రీ వెంకటేశ్వరమ్మ నినాదాలతోనూ, తాము చేసే కూలి కష్టం ఎందుకు ఇతర కష్టాలకన్న ప్రత్యేకమో వివరించడంతోనూ మొదలు కావడమే!

               నాకు మాత్రం అలా గంటన్నర శ్రమించిన కార్యకర్తలూ, 4 గంటలు శ్రమించబోతున్న వెంకటాపురం కష్టజీవులూ కలిసి, స్వచ్ఛ చల్లపల్లి కోసం ప్రతిజ్ఞలు చేస్తున్న దృశ్యం అద్భుతం అనిపించింది!

               రేపటి వేకువ శ్రమ కోసం కార్యకర్తలు నాగాయలంక రోడ్డులోని స్వచ్ఛ సుందర పబ్లిక్ టాయిలెట్ల ప్రాంతం వద్ద కలుసుకోవలసి ఉంటుంది!

               ఆకాశం తాకడమా?

తమ ఊరికి ఒక్క గంట శ్రమ సమర్పణం అంటే –

గ్రామస్తుల కాహ్లాదం కలిగించు ప్రయత్నమంటె –

హిమాలయం ఎక్కడమా? సముద్రాలు ఈదడమా?

ఆకాశం తాకడమా? అరణ్యాలు దాటడమా?

 - నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   16.06.2026