3867* వ రోజు ....           17-Jun-2026

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

4000 రోజులకు 133 అడుగుల దూరంలో!

               అనగా ఈ బుధవారానికి (17.06.2026) 3867* నాళ్ళ స్వచ్ఛ బాధ్యతలు! చల్లపల్లి గ్రామ సమాజపరమైన ఆ కర్తవ్యాలు ఏదో లాంచనంగానూ, బుర్రలుపయోగించకుండానూ, Absent minded గానూ చేసుకుపోతున్నవికావు!

               గ్రామ భవితవ్యం పట్ల పూర్తి అవగాహనతోనూ, మంచి ప్రణాళికాబద్ధంగానూ, పారదర్శకంగానూ, దైహిక శ్రమ పూరితంగానూ, జరుగుతున్నవని చెప్పగలను!

               కొందరికవి రొడ్డకొట్టుడుగా, రొటీన్ గా - రోజూ ఆ 30-40-50 మంది కార్యకర్తలే - మైకులోంచి ఆ పాటలే - ఆ రోడ్ల మార్జిన్ల గడ్డి చెక్కుడే - మొక్కల సుందరీకరణలే - కాకపోతే అప్పుడప్పుడు రోడ్ల గుంటల పూడికలే - చివరగా ఆ ప్రతిజ్ఞలే – అదే DRK డాక్టరు గారి ముక్తాయింపులే..... అనిపిస్తే దానికి ఎవరేం చేయగలరు?

               కాకపోతే - వందల మార్లు విన్నవించినట్లుగా –

“అయ్యా! 11 ఏళ్ళ తరువాతనైనా - మన ఊరి మేలు కోసం అప్పుడప్పుడైనా వచ్చి, స్వచ్ఛ కార్యకర్తలుగా మారండి నాయనా ! గ్రామసేవా రుచి మరగండి బాబులూ!” అని మాత్రం బ్రతిమాలగలం!

               స్వచ్ఛ కార్యకర్తల ఈ రహదారి బాధ్యతల్ని స్వార్థంతో గ్రుడ్డిగా చేసుకుపోతున్నవని ఎవరూ భావించకుందురు గాక - అని మనవి!

               రోజుటి లాగే ఈ వాలంటీర్లు చెట్ల కొమ్మల ట్రిమ్మింగ్ మిషన్లను ఆడించారు, రెండో మూడో గోతాల మద్యం -నీళ్ల సీసాలు – సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు ఏరారు, రహదారిని ఊడ్చారు, చెత్త డిప్పలు మోశారు, ట్రాక్టరు నిండుగా చెత్తను నింపారు.... అలా చివరికి సుమారు 40 రోజుల నాగాయలంక రహదారి పటిష్ట – పరిశుభ్ర – సుందరీకరణను ముగించారు!

               వాళ్లు 4.18 కే ఊరు దాటి, ప్రభాకర వడ్లమర వద్ద పనులు మొదలెట్టి 6.05 కు పనులు ముగించేంతలో వెంటపురం కూలీలు వచ్చేశారు. ఈ మొత్తం 52 మందీ సీనియర్ మోస్ట్ కార్యకర్త తూములూరి లక్ష్మణరావుననుసరించి ప్రతిజ్ఞలు పూనారు. DRK గారి గ్రామహిత వచనాలు విన్నారు.

               జర్నలిస్టు వృత్తికారుడు, క్రొత్త శివరామపురీయుడు బాల దుర్గా రాం ప్రసాద్ గారు తన తల్లితండ్రుల వివాహ వార్షికోత్సవ జ్ఞాపకంగా 1000/- “మనకోసం మనం” ట్రస్టుకు 14.06.2026 న జమ చేసినందుకు ధన్యవాదములు.

               రేపటి వేకువ కూడ N. లంక బాటలోని పబ్లిక్ టాయిలెట్ల వద్దనే కలుసుకోవాలని నిర్ణయించారు!

               శ్రమదానోద్యమ జాతర!

ఉన్న ఊరె కాక ఇరుగు పొరుగూళ్ళకు వ్యాపించిన

హరిత సుందరీకరణల అభ్యాసము రాష్ట్రములో

ఎవరు చేసి చూపగలరు ఈ శ్రమదానోద్యమ జాతర!

అందుకె ఈ శ్రమ వేడుక ఆరాధ్యము అని చెప్పుట!

 - నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   17.06.2026