3868* వ రోజు....           18-Jun-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

3868* వ నాటి శ్రమదాన రీతులు! (18-6-26)

               గురువారం వేకువ మొత్తం కార్యకర్తలు 28 మందైతే – అందులో సగం మంది ఎన్నింటికి లేచి, అవనిగడ్డ రోడ్డులోని బండ్రేవుకోడు మురుగు కాల్వ వంతెన వద్దకు ఎన్నింటికి వచ్చి కూర్చున్నారో గానీ - 6.05 దాక శ్రమిస్తూనే ఉన్నారు!

               ఇక - చివరగా కాఫీల వ్యాను కడకు చేరుకొన్న చెట్ల సుందరీకర్తల – సజ్జా, ఆకుల ప్రసాదుల పని విరమణకాలం మాత్రం 6.15. ఈ వేకువ కార్యకర్తల పని సమయపు వాట్సప్ చిత్రాలనొకమారు చూడండి – అందులో -

1) గుబురు ఎత్తు చెట్టు మీద మరరంపంతో కరెంటు తీగలకంటుకొన్న కొమ్మలు తప్పిస్తున్నదెవరు?

2) మురుగుకాల్వ వంతెనకు దక్షిణంగా డ్రైను వాలులో పనిచేసుకుపోతున్న 68 ఏళ్ల, 67 ఏళ్ల విశ్రాంతోపాధ్యాయుడూ, LIC మాజీ ఉన్నతోద్యోగులు ఎవరు?

3) బాగా అలవాటైన చెత్త బండి సర్దే పనిచేస్తున్న అంజయ్య గారు కనిపిసున్నారు గాని, లోతు డ్రైనులోని పెద్ద తాటాకుల గుట్టను – తుక్కురాలి తల, ముఖం నిండా పడుతున్నా చకచకా పనిచేస్తున్న ముగ్గురు టీచర్లెవరు? ట్రస్టు ఉద్యోగ పర్యవేక్షకుడతడేనా?

4) సదరు గుట్ట అట్టడుగున అరుదైన పొడవైన - లావైన – ప్రామాదికమైన రక్తపింజరు ఫొటోలో కనిపిస్తున్నదా?

5) అన్నపూర్ణ, ఆస్పత్రి నర్సులూ ఈ చల్లని వేళ అంతగా చెమటలు క్రక్కనేల?

6) కర్రపోటుతో కుంటుతూ వచ్చి, వంతెన గోడ మీద కూర్చొని, కార్యకర్తల ఫొటోలూ, వీడియోలూ తీస్తున్న 78 ఏళ్ల మనిషి ఎవరు?

7) తాను 3 నెలలు ఈ శ్రమ సందడికి దూరమౌతున్నందున కార్యకర్తల వద్ద వీడ్కోలు పొంది, నినాదాలు పలికి, కేకులు పంచే ఆ 87 ఏళ్ల వృద్ధ వైద్యుని సంగతేమి?

8) 6.10 తరువాత వెంకటాపురం నుండి వచ్చి, గ్రామ సుందరీకరణకై శ్రమిస్తున్న 20 మంది కూలీల సమాచారమేమి?

9) రేపటి వేకువ కూడ మళ్లీ అవనగడ్డ రూటులోని పబ్లిక్ టాయిలెట్ల వద్ద కలుసుకోవాలనే గదా – DRK గారి ప్రకటన?

               స్వచ్చోద్యమ అనుభూతులు!

సంయమనము కొన్ని చోట్ల - సాహసములు కొన్ని మార్లు

సాఫీ పని నడుమ నడుమ - సంచలనములప్పుడపుడు

అన్నిరోజులానందములన్నియెడల ఐకమత్య

మవె మా దశ వసంత స్వచ్చోద్యమ అనుభూతులు!

 - నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   18.06.2026