పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?
శుక్రవారం వేకువ రహదారి కర్తవ్యములు - @3869*
అనగా 19.6.26 తేదీకి చెందినవి, గ్రామం పట్ల శ్రద్ధాసక్తులూ, కొన్ని మానవ విలువలూ కలిగిన 28 మందివి, (గ్రామ జనాభా 28 వేలట) లక్షల కొద్దీ వ్యయంతోనూ, వేల గంటల మేధో – శారీరక శ్రమ గత 40 నాళ్లకు పైగా జరుగుచున్నవి, కార్యకర్తల సుదీర్ఘ సమయ కష్టం ఎక్కడెక్కడి వాళ్ళనో కదిలిస్తున్నా చల్లపల్లి జనంలో 30-40% మందికి సోకనివి!
వృద్ధాప్య అశక్తత వలన శ్రమదానం విరమించిన దాసరి, రావూరి, కోనేరు, తుమ్మల వంటి 85-95 వయస్కులు రాలేనందుకు చింతిస్తున్న స్వగ్రామ బాధ్యతలవి!
మంగళాపురం, శివరామపురం మూలాల రావెళ్ల శివరామకృష్ణయ్య గారు విజయవాడలో ఉంటూ – ఆరోగ్య పరామర్శకు వెళ్లిన మల్లంపాటి ప్రేమానందుని ద్వారా - తన పుట్టినరోజు (24-6-26) గుర్తుగా స్వచ్చోద్యమ ఖర్చులకై ‘మనకోసం మనం’ ట్రస్టుకు 10,000/- పంపడం కూడ సామాజిక బాధ్యతే మరి!
దెబ్బతిన్న కాలు తో ఒక శాస్త్రి గారు కుంటుకుంటూ పని చోటైన N.లంక బాటలోని పబ్లిక్ టాయిలెట్ల వద్దకు రావడమూ అంతే!
ఈ స్వచ్ఛ కార్యకర్తల పనులు అక్కడ 4.20 కే మొదలై, చాల వరకు 6.05 దాకా, ఒకరిద్దరివి మాత్రం 6.15 దాకా జరుగుతూనే ఉన్నవి. అందులో ఒక పని మురుగుకాల్వ వంతెన ప్రక్కన ఏడెనమండుగురు డంపింగ్ యార్టు మధ్యగా చేస్తున్నది. ఇది చిల్లలవాగు గట్టు డంపింగ్ అనుకొనేరు - ఎప్పటికప్పుడు కార్యకర్తలూ, పంచాయతి వారూ శుభ్రపరుస్తున్నా మళ్లీమళ్ళీ తయారయే మినీ డంపన్న మాట!
నేటితో కిలోమీటరు పైగా ఉన్న నాగాయలంక రోడ్డు ఇరు ప్రక్కలా చెట్ల సుందరీకరణం ముగిసింది. మనిషి తలకు చక్కగా క్షౌరం చేసినట్లు రహదారి అంచుల గడ్డీ, పిచ్చి మొక్కలూ లేకుండ దారి ఎలా కనిపిస్తుందో గ్రామస్తులంతా గమనించాలి.
నేటి తుది సభలో విశేషాలు :
1) ప్రేమానందం గారి నినాదాలు;
2) పల్నాటి అన్నపూర్ణ గారి స్వీట్ల పంపకమూ,
3) సబ్బినేని బోసు గారి భార్యగారి ఆదివారం నాటి సంస్మరణమూ,
4) రేపటి గ్రామ వీధి పనుల కోసం పాగోలు - చల్లపల్లి వీధి జంక్షన్ లో కలవాలనే నిర్ణయమూ.
చెమట వల్ల వచ్చినవే!
బాగుపడిన రుద్రభూమి, ప్రవహించే మురుగు కాల్వ,
దుమ్ము - ధూళి లేని వీధి, శుభ్రమైన టాయిలెట్లు,
పచ్చదనపు చెట్ల వరుస -- పిచ్చి వాళ్లు అనదగు ఈ
స్వచ్ఛ కార్యకర్తల చిరు చెమట వల్ల వచ్చినవే!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
19.06.2026