3874* వ రోజు....           25-Jun-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?

ట్రైనీ కలెక్టరు గారే నినాదాలు చెప్పిన వేళ @3874*

               ఆ కలెక్టరు గారు మధ్య భారతీయురాలు, 3 నెలల క్రిందట మచిలీపట్నం వచ్చిన నమ్రతా అగర్వాల్ గారు నిన్న డంపింగ్ యార్డ్, చెత్త సంపద కేంద్రం, శ్మశానాల సందర్శన తరువాత -

               ఈ గ్రామం స్వచ్ఛ - శుభ్ర - సుందరంగా మారడానికి ప్రధానకారకులైన ఈ గురువారం (25.6.26) నాటి స్వచ్ఛ కార్యకర్తలు కార్యక్షేత్రంలో ఎలా పనిచేస్తున్నదీ చూడాలని వేకువనే SRYSP. కళాశాల వద్దకు వచ్చారు. పని జరుగుతున్న 150 గజాల బందరు రోడ్డులోని వాలంటీర్ల శ్రమదానం తీరును ఆకళించుకొన్నారు!

               6.20 సమయంలో ఆ ప్రాచీన కళాశాల ప్రవేశద్వారం వద్ద 51 మంది కార్యకర్తలు+ఇతరులతో కలిసి, నిలబడి “జై స్వచ్ఛ చల్లపల్లి” అని ముమ్మారు నినదించారు.

               దేశంలో ప్రతి గ్రామం ప్రతి వార్డులో ఇలాంటి సన్నివేశాలను చూడాలని ఉన్నదనీ, ఈ కార్యకర్తల శ్రమదానం సమాజానికి గర్వకారణమనీ ప్రకటించారు! “చల్లపల్లిలో ఏం జరుగుతోంది?”... అనే పుస్తకాన్ని అందుకొన్నారు.

               అంతకు ముందు 4.20 కే 16 గురు కార్యకర్తలూ, తదుపరి 20 మందీ - అనగా మొత్తం 36 గురు -

1) కళాశాల ప్రహరీ బారునా ఉద్యానంలో శ్రమిస్తూనే ఉన్నారు.

2) ఇటు రిజిస్ట్రారు కార్యాలయము, సిమెంటు ఒరల దుకాణమూ, అటు రవి గారి ల్యాబ్ దాక ఊడుస్తూ, డ్రైన్ మరామతులు - చేస్తూ, ప్లాస్టిక్ లు ఏరేస్తూ, దుకాణాల నడుమ దాగిన వ్యర్ధాల్ని ప్రోగేస్తూ, గంటన్నరపాటు - 6.05 కు విజిలు మ్రోగే దాక రకరకాల శ్రమలు చేశారు.

3) 6 వ నంబరు పంట కాల్వ వద్ద కూడ కొందరు కనిపించారు.

4) యువ కలెక్టరమ్మ గారు వచ్చేప్పటికే ఏడెనమండుగురు చెత్త లోడింగ్ పనిలో ఉన్నారు.

               ఇందరు శ్రమదాతల సామూహిక శ్రమను కళ్ళారా చూస్తే కలెక్టర్ లే కాదు – దేశ కాల పరిస్థితుల్ని అవగాహన చేసుకొనే ఎవరైనా ఆశ్చర్యపడరా మరి!

               రేపటి బందరు రహదారి సుందరీకరణకు రిజిస్ట్రారు కార్యాలయ ప్రవేశం వద్ద కలవాలని నిర్ణయం!

               చేజారక నిలుచుగాక!

ఎందరికో స్ఫూర్తి పంచు - ఎందరెందరొ పర్యటించు –

దుర్గంధం పరిహరించు పచ్చదనం విస్తరించు - 

శ్రమదానం నిరంతరం సంభవించు గ్రామములో

జీవించే అదృష్టము చేజారక నిలుచుగాక!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   25.06.2026