పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?
వేకువ వర్షానంతర శ్రమ స్థలం మార్పిడి - @3875*
శుక్రవారం (26.6.26) వేకువ శ్రమ జరగవలసింది బందరు మార్గంలోని రిజిస్టార్ కార్యాలయం వద్దనే గాని, 3:00 కు కురిసిన వర్గం 4.00 కి అగింది గాని - వర్షం శీలాన్ని శంకించిన కార్యకర్తలు 1 వ వార్డులోనే బాలికల వసతి గృహం ప్రాంతానికి వెళ్ళారు.
వేకువ 4.19 నుండి 5.58 నిముషాల దాక – హాస్టల్ మొదలు బందరు రహదారి వైపుగా 28 మంది శ్రమదానం నిర్విరామమే! ఆ ప్రాంతంలో ఇతర పిచ్చి చెట్లూ, గడ్డీ, ప్లాస్టిక్ తుక్కులూ సరే – ముళ్ళ చెట్ల కొమ్మలు వీధిని దురాక్రమించాయని కత్తుల కార్యకర్తలు వాటిని శిక్షించే పనికి దిగారు.
మెండు శ్రీను, అన్నపూర్ణల చీపుళ్ల వీర విహారం చేసి, చర్చి దాటే దాక వీధి శుభ్రతకు పాల్పడ్డారు.
సాఫీగా సాగుతున్న శ్రమదానంలో కొద్దిపాటి అపశ్రుతులేమంటే – ముళ్లమండల్ని త్రొక్కుతూ అంజయ్య గారికి ముళ్లు గీరుకుపోవడం, ట్రస్టు కార్మిక పర్యవేక్షక కస్తూరి శ్రీను చేతిని నిమ్మ ముళ్లు కాటేయడం,
ఇలాంటివి అంతకు ముందు ఎన్ని మార్లు జరిగినా ఆ ఇద్దరూ మర్నాడు రావడం మానలేదు!
ఈ 28 మంది శ్రమదాతలలో ఎవరు చీపుళ్లు పట్టారూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు ఏరే వీరశేఖరుడికి ఈపూట ఏ మాత్రం గిట్టుబాటయిందీ, 5.58 కి పని విరమణ విజిల్ మ్రోగినా, మోతుకూరి సీతారామయ్య - గురవయ్యలు మరో 10 నిముషాలు ఎందుకు పని విరమించలేదూ, గుంటన్నర శ్రమానంతరం కార్యకర్తల చెమట - జిడ్డు ముఖాల్లో ఆ సంతృప్తేమిటీ..... వంటివి తీరికగా చర్చించదగిన సంగతులట!
నేనేం వైద్యుడిని కాను గాని, స్వానుభవం ఒకటున్నది – “రాత్రంతా తీవ్రంగా జ్వరం, ఒళ్లు నొప్పులు, నిద్రలేమి, బిగుసుకుపోయిన తొడ కండరాలతో అసలీ పూట శ్రమస్థలికి వెళ్ళలేననుకొన్నా - ఐతే ఒక్కో కార్యకర్త శ్రమ గుర్తొచ్చి, ఒక మంచి సామూహిక శ్రమ సందడిని ఊహించుకొని, అరగంటపాటు 16 మందిని గురించి పద్యాలు వ్రాశాక నా శరీరం కాస్త శక్తి పుంజుకొన్న మాట నిజం!
బ్రతిమాలినా భోగాది శాంతి చెప్పనందువల్ల నినాదాలు గర్జించడం మాలెంపాటి వాని వంతయింది!
వుడత్తు వారి హార్లిక్స్ బిస్కెట్ పొట్లాల పంపకం సందర్భంలో ఈ పంపకాన్ని చాలా కాలం కొనసాగించిన వుడత్తు రామారావు గారు అనివార్యంగా అందరికీ గుర్తొచ్చారు.
షరామామూలుగానే రేపటి వేకువ శ్రమదానం –
వర్షం లేనిచో రిజిస్ట్రారు కార్యాలయం నుండీ,
ఉంటే బాలికల హాస్టలు నుండీ ప్రారంభమవుతుంది!
వెన్నతొ పెట్టిన విద్యలు!
పర్యావరణపు భద్రత, పచ్చందన నిర్వహణము,
రహదారుల మరామత్తు రోడ్ల గుంట పూడ్చివేత
మురుగుల సక్రమ కదలిక, ముఖ్య వీధి బాగుచేత
స్వచ్చోద్యమ కారులకు వెన్నతొ పెట్టిన విద్యలు!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
26.06.2026