పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం?
ఒక ప్రక్క వర్షం – అందుకు దీటుగా వీధిలో శ్రమల వర్షం -@ 3876*
ఔను – ఈ శనివారం వేకువ (27.6.2026) నిర్ణీత సమయం కన్నా 11 నిముషాల ముందుగా రిజిస్టారు కార్యాలయం వద్దకు చేరుకున్న 18 మందిని వరుణ దేవుడు మోసగించాడు! పిమ్మట చేరుకొన్న వారితో మొత్తం 33 మందీ వాతావరణం తేటగా ఉన్నందున వరుణిడి పై నమ్మకముంచి, వీధి శుభ్రతలు మొదలు పెట్టారు.
అరగంట తర్వాత సన్న తుంపర ! అది ఆగడమూ, 10 నిముషాలకొక మారు కురవడమూ- మొత్తంగా ఆ గంట సమయంలోనే వర్షం కార్యకర్తలతో ఆటలాడుకొన్నది! ఐనా శ్రమదానం ఆగలేదు.
ఈ పూట పనుల్లో ముఖ్యమైనది SRYSP కళాశాల ప్రవేశ ద్వారం దగ్గరి పనే! గేటుకు తూర్పు పడమర వాన నీళ్లు ప్రవహించే కాలువల్లో పేరుకుపోయిన మట్టి పని అది! ఫోన్ కెమెరా ప్రక్కన పెట్టి తూము వెంకటేశ్వరరావూ, శంకర-వెంకటేశ్వర – విజయులూ ఎంత మట్టిని తీశారో ఫోటోలో ఉంటే చూడండి!
కళాశాల ప్రహరీ వెలుపలి ఉద్యానంలో మొన్న ప్రోగు పడిన వ్యర్థాల గుట్టలకూ, ఈ 2 రోజుల్లో అక్కడ మళ్లీ ప్రత్యక్షమైన ప్లాస్టిక్ తుక్కులకూ ఈ ఉదయం మోక్షం సిద్దించింది. బృందావన-పసుపులేటి – కస్తూరి- మాలెంపాటి-ఇనపకుతిక తదితరుల కష్టంతో అది సాధ్యపడింది!
మరి – మిగిలిన వాలంటీర్ల సంగతి? వాన ఐదారు మార్లు దోబూచులాడిందని ఎవరూ చేతులు ముడుచుకొని, షాపుల వరండాల్లోనో, షెడ్ల వద్దనో ముణగ దీసుకొని కూర్చోలేదు. చాట చీపుర్లు ఈ సన్న వర్షంలో బాగా పనికొచ్చాయి.
కొంచెం తక్కువగానే ఐనా కత్తులకూ పని చెప్పారు- ఆకుల, సజ్జా, తూములూరి, ల్యాబ్ రవి వంటి కార్యకర్తలు. పైడిపాముల సర్పంచీ, రిసెప్షన్ లక్ష్మి వంటి మహిళా కార్యకర్తల ఉత్సాహమూ ఈ చిత్త కాని -చిత్త కార్తె జల్లుల వల్ల తగ్గలేదు!
పాపం – ఈ స్వచ్చ కార్యకర్తల తప్పే ముందిలే! వానలొచ్చినా – ఎండలు కాసినా- మంచు ముంచినా ఈ గ్రామ బాధ్యతలనేవి వాళ్ల రక్తంలో జీర్ణించుకొన్నాక వాళ్లు మాత్రం పనులెందుకు ఆపుతారులే!
నేటి శ్రమదాన ప్రతిజ్ఞా నినాదాలు లక్ష్మీ సెల్వం గారివి, కార్యకర్తలు శ్రమదానాన్ని మించి, మరొక ముఖ్య బాధ్యత మోయాలని విన్నవించినది పలనాటి అన్నపూర్ణ!
వర్షముంటే – 1వ వార్డు హాస్టలు వద్దా-
అది లేకుంటే రిజిస్టార్ ఆఫీసు వద్దా రేపటి వేకువ మన కలయిక!
అనగ ననగ సంగీతము
“అనగ ననగ సంగీతము అతిశయిల్లుచుండుననీ
తినగ తినగ వేపపూవు తియ్యగనే మారుననీ”
వేమన వాక్రుచ్చినట్లు స్వచ్చోద్యమకారుల గత
పుష్కర సమయపు సేవలు ఫలప్రదములగుచున్నవి!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
27.06.2026