3878* వ రోజు....           29-Jun-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం?

జూన్ – 2026  చివరి సోమవారం నాటి స్వచ్చతా ప్రయత్నం - @ 3878*

అందుకు పూనుకొన్నది 30 మంది!  ఆ ప్రాంతం మళ్లీ బందరు రోడ్డు  నందలి అమరావతి రాజ భవనాని కటూ ఇటుగానే ! వాళ్లు  ఆ నాల్గు రోడ్ల కూడలికి చేరుకొన్నది 4.20 కే !  1 గంటా 42 నిముషాల పిదప పనులాపింది 6.05 కే!  

తూర్పుగా శ్రావ్య కృష్ణ ఆస్పత్రీ, సిమెంటు ఒరలు దుకాణం వరకూ పడమరగా దంత వైద్య శాల మేరా, దక్షిణపు మున్సబ్ వీధి కొంతా ఈనాటి శ్రమలు సోకి మరింతగా మెరుగు పడినవి.

వీధి  ఉద్యానాల  నుండి మొక్కల సుందరీకరణ వలన అర కొరగా ట్రాక్టరు వ్యర్థాలు వస్తే,

ఇద్దరో ముగ్గురో సజ్జావీధి కాలుష్యాల మీద చీపుళ్లు ప్రయోగిస్తే , 100 రోజుల్నాడు వైజయంతీ ప్రహరీ బారునా అంతగా శుభ్ర పరచినా ఇటీవలి వర్షాలకు వచ్చిన వ్యర్థాలను  పెరిగుతున్న గడ్డిని ఏడెనిమిది మంది కార్యకర్తలు తొలగిస్తుండగా,

ఒక వీర శేఖరుడు 2 రకాల గోనె సంచులతో  ఆ 2-3 వందల. గజాల జాగాల్లో తిరుగాడుతూ 2 రకాల సీసాలను వాటిలో నింపుతుండగా, అంత పెద్ద గురవయ్య, విన్నకోట టైలరు, కస్తూరి విజయుడు, శంకరుడు, మెండు శ్రీనుడు... పారలతో జమీందారీ భవనం వద్ద గడ్డిచెక్కి, పిచ్చి

కలుపు లేరి, ఆరోగ్యకరమైన పోటీతో అద్దంలా మార్చుచుండగా,

 మరోవంక ట్రస్టు కార్మిక పర్యవేక్షక  శ్రీను, బృందావన, నరసింహ, లక్ష్మ ణాదుల లోడింగు పనులు ముమ్మరించుచుండగా,

ప్రేమానందుడు రానందు వల్ల కత్తుల - దంతెల పనులను ప్రసాదుల ద్వయమే పూర్తిగావిస్తుండగా,

ఈ దృశ్యాలన్నిటినీ తూము కార్యకర్త కెమేరాలో బంధించుచుంటే-  అసలీ గంటన్నర పాటు ఎవ్వరినీ వదలకుండ మశకంబులందరిని కుట్టు చుండగా....

6.00 తరువాత DRK గారి విజిలు మ్రోగనే మోగింది!

వెంటనే సందేటి శ్రీను సమర్పిత కాఫీ పానీయములు ముగించి, 30 మందీ అర్థ వలయంగా నిలిచి, అశ్వినీ కుమార వైద్యుడు ప్రకటిస్తున్న గ్రామ స్వచ్చ- శుభ్ర- సౌందర్య  ప్రతిజ్ఞలను పునరుద్ఘాటించి,

తన ఈశాన్య భారత పర్యటనానుభవాలను DRK వైద్యుల వారు వివరించి,

 రేపటి శ్రమదానం సైతం ఈ బందరు రోడ్డుకు చెందిన ఇదే మునసబు గారి వీధి వద్దనుండే జరుగునని ప్రకటించి, నేటి కార్యక్రమాన్ని ముగించిరి.

               శిరసా అంజలించెద వినమ్రంగా!

సదుద్దేశము ఎవరి నైజమొ - సమాజ బాధ్యతలెవరి కిష్టమొ -

సమష్టిలోనే వ్యక్తి సుఖమను సత్య వాక్యము నెవరు నమ్మిరొ –

అందుకొరకు సుదీర్ఘ కాలము అంకితులుగా నిలిచిరెవ్వరొ

అట్టి శ్రమదాతలకు శిరసా అంజలించెద వినమ్రంగా!

నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   29.06.2026