3880* వ రోజు....           01-Jul-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

క్రొత్త నెల (July – 2026) ప్రారంభ దినపు వీధి శ్రమలు - @ 3880*

 సదరు గ్రామ బాధ్యతా చర్యలు 29 మందివి; వాటి కాలం వేకువ 4.21 – 6.08 ల నడుమ ; వీధి శుభ్రతా చర్యలు వ్యాపించినది శ్రావ్య కృష్ణ ఆస్పత్రి – రిలయన్స్ రిటైల్ దుకాణాల మధ్య. 

- ముందుగా నేను పేర్కొనదగిన, చెప్పుకోదగిన దృశ్యం కర్మల  భవనాంతర్గతం! అంతకు ముందు ఎందరెన్ని విధాలుగా కష్టించినా- బాణావత్ రమేశ్, నందేటి శ్రీను, గంధం లక్ష్మణ, నాగ లక్ష్మీ చతుష్టయం -  ఫైనల్ టచ్ లు ఇచ్చేయడం వలన – డాక్టర్ విద్యాలత గారి  విరాళంతో రూపుదిద్దుకొన్న ఆ ప్రదేశం ఎంత అందంగా కనిపిస్తున్నదో వీలైనంత తొందరగా గ్రామ సౌందర్య  దిదృక్షా పరులు చూడగలరు!

ఆకుల దుర్గా ప్రసాద కార్యకర్త గంటకు పైగా గడ్డి కోత యంత్రంతో కుస్తీ పట్టి చిన రాజా గారి ఇంటి ముందున్న తోటను శుభ్ర పరిచారు.

గ్రామ వీధి సౌందర్యాన్ని  ఇష్ట పడే ఎవరైనా ఈ బుధవారపు శుభోదయాన చూసి, మెచ్చదగిన మరో దృశ్యం -  అటు రిలయన్స్ దుకాణపు, ఇటు జూనియర్ కళాశాల ప్రాంతపు సువిశాల, హరిత, సుందరీకృత బందరు వీధే! దాని నేటి అందానికి కారణం.

 కనీసం 15 మంది కార్యకర్తలు –

1) ప్లాస్టిక్ వస్తువులు ఏరి,

2) డ్రైను వ్యర్థాలు తొలగించి,

3) దుమ్మంతా చీపుళ్ళతో ఊడ్చే సేందుకు దాదాపు పాతిక పని గంటలు శ్రమించడమే!

-ఐతే ఏ కొద్ది మందోతప్ప - ఎందరు గ్రామస్తులు- కనీసం ఆ వార్డు వారు పాల్గొనక పోతే పోయిరి – వచ్చి చూసి, ఏ ఊరికైనా  ఆదర్శంగా నిలువదగిన  200 ల గజాల ఈ వీధి సుందర దృశ్యాన్ని ఆస్వాదించరులెండి!

దొంగతనాల నిపుణుల్నీ, సంఘ విద్రోహక చతురుల్నీ  “ కర్మ వీరులు” అనడం కాదు – పదీ – పన్నెండేళ్ళు వీధుల్నీ – శ్మశానాల్ని- రహదారుల్ని, పబ్లిక్ ప్రదేశాల్ని తీర్చిదిద్దడానికి నిస్వార్థంగా కష్టపడుతున్న ఇలాంటి వాళ్లనే అనాలి “నిత్య కర్మిష్టులు” అని!

తప్పని పరిస్థితుల్లో 6.00 కాక ముందే వెళ్ళిపోయిన DRK గారికి “డాక్టర్స్ డే” శుభాకాంక్షలు చెప్పిన, గ్రామ శ్రమదానం వల్ల తనలో మంచి మార్పులు వచ్చినట్లు ప్రకటించిన వీర శేఖరుడు (c/o చందమామ APTS) నేటి నినాదకారుడు!

రేపటి మన శ్రమదానం"ట్విల్స్" వస్త్ర దుకాణం వద్ద నుండి మొదలగునని నిర్ణయం!

               రావాలని పీకుతున్నా

మనసంతా స్వచ్ఛ శ్రమదానమునందున్నా కొందరు

వాయిదాల మీద చాల వాయిదాలు వేస్తురు

రావాలని పీకుతున్నా రాజాలరు ముందుకు

బద్ధకమా - మొగమాటమ కారణములు అందుకు?

నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   01.07.2026