3881* వ రోజు....           02-Jul-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

జులై -2, గురువారం నాటి 31 మంది వీధి బాధ్యతలు - @3881*

బాధ్యులలో డజను మంది 4.20 కే భగత్  సింగ్  గారి ఆస్పత్రి వద్ద హాజరు. అక్కడి నుండి తూర్పు రామాలయం దాకనూ, కొసరుగా భారత లక్ష్మి (పాతపేరు) వడ్ల మర వీధిలో కొంత భాగమున్నూ నేడు శుభ్రపడిన చోటులు.

చోటులనగా - 2 ఆస్పత్రులున్నవి, హోటళ్ళున్నవి, రకరకాల దుకాణాలున్నూ, ఏ మాత్రం దాపరికం లేని బహిరంగ మద్యం దుకాణాలున్నూ కలవు, జోరుగా నడవక- కాస్త కుంటుతున్న మురుగు కాల్వా ఉన్న ది, మరి - ఈ 30 మంది కార్యకర్తలే ఇన్నిటిని చూసుకోవాలి!

200 గజాల వీధిని ఊడుస్తున్న 10 మందిని చూద్దును గదా వాళ్ల  చీపుళ్లతో లేస్తున్న ధూళి గాలికి వాళ్ల ముఖాలనే కొట్టడం కనిపించింది.

బందరు వీధి దక్షిణపు డ్రైను కడ ఒంగి చెత్తా చెదారాలనూ, ప్రాత చెప్పుల్నీ ఏరుతున్న

1) సజ్జా ప్రసాద - 2) ప్రేమానంద - 3)వేముల, 4) మెండు శ్రీనుల్నీ, వాళ్ల పని మెలకువలనూ గ్రహించాను.

నిన్న ఏరేసినా సరే - మళ్లీ రిలయన్స్ మాల్, ఫర్నీచర్ షాపుల, మద్యం షాపుల ప్రాంతంలో 2 గోతాల ప్లాస్టిక్ వ్యర్థాలను మళ్లీ ప్రోగేస్తున్న షణ్ముఖ – వీర శేఖరులకు నేనూ కొంత సహకరించాను!

కొడవళ్లతో గడ్డి చెక్కే పాటల శ్రీనూ, అడపా వంటి వాళ్లనూ, ఉద్యానంలో మరను మ్రోగిస్తూ గడ్డి నిర్మూలన చేస్తున్న ఆకుల దుర్గా పనుల్నీ చూడగలిగాను!

వ్యర్థాల  లోడింగు బ్యాచ్ చురుకుదనాన్నీ కనిపెట్టాను. ఐతే- తమ ఇళ్ళ- దుకాణ ప్రాంతంలో ఇంత శ్రమ జరుగుతున్నా- ఒక్కరంటే ఒక్కరైనా ఎందుకు ఈ శ్రమదానంలోకి రారో తెలుసుకోలేకపోయాను.

రోజులూ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కొందరు గ్రామస్తులకూ, కొన్ని ప్రజా సంఘాలకూ ఊళ్లో ఏ సమస్య వచ్చినా స్వచ్చకార్యకర్తలే గుర్తుకురావడం పెరిగిపోతున్నదని కొందరంటున్నారు!

బాణావతు రమేశ్ నినాదాలతో మొదలైన నేటి సమావేశంలో:

పేటేరు గ్రామంలో నిన్న జరిగిన డా. హేమశ్రీ గారి వివాహ హరిత వేడుకను DRK గారు ప్రస్తావించారు.

వధువు గతంలో స్వచ్చ చల్లపల్లితో అనుబంధం కలవారేనట!

రేపటి వీధి సుందరీకరణ రిలయన్స్ దుకాణం వద్ద మొదలు కానున్నది !

         బిర్రబిగిసి కూర్చుంటే

సదాచార సంపన్నులె - శ్రోతియులే చొరవతో

పేడ తీసి, మట్టి పిసుకు వీధి సేవలకు దిగితే

బిడియస్తులు ఇప్పటికీ బిర్రబిగిసి కూర్చుంటే

స్వచ్ఛోద్యమ చల్లపల్లి వింతలలో వింతే!

నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   02.07.2026