పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!
నేటి (3-7-26 – శుక్రవారం) వేకువ తొలి స్వచ్ఛ వీరులు 11 మంది - @3882*
వర్షాగమనం వలన వారెంచుకొన్న వీధి 1 వ వార్డులో ప్రభుత్వ విద్యార్థినీ వసతి గృహ ప్రదేశం! ఆ సమయం 4:20, పని విరమణ కాలం 6.05AM.
ఇక నెరవేరిన బాధ్యతలంటారా – వాటికేనాడూ లోటు లేదు - ఇంతకన్న పెళపెళార్భటుల - ఉరుముల-మెరుపుల - వర్షాల నెన్నిటిని చూసిందో ఈ శ్రమదానోద్యమం! ఒకరికొకరు తోడైనపుడు - చేస్తున్నది ప్రజాహ్లాద సంబంధమైన సత్కార్యమైనపుడు వాళ్ల శక్తియుక్తులు ఎంతగా గుణకారములౌతాయో, భయ - బిడియ - సంకోచాలెక్కడికి ఎగిరిపోతాయో స్వచ్ఛ కార్యకర్తలకు అనుభవైకవేద్యమే!
ఇవాళ్టి ప్రాభాతిక వీధి సేవా మూర్తులు 23 మందే - వాళ్ల సేవా విస్తరణ సుమారు 150 గజాల వీధి భాగాలే - కాని ఆ 100 నిముషాలలో ఎంత సందడి, ఎంత పట్టుదల, 6.20 కి సమావేశ సమయానికి ఎంత సంతృప్తి, రేపటి బాధ్యతల పట్ల ఎంత ముందు చూపు వంటివి గదా ఎవరైనా గ్రహించవలసింది!
ఈ సామూహిక శ్రమకాలంలో 70 + ఏళ్ల వారిలో చురుకుదనం పుట్టుకొస్తుంది, ఈ వయసులోనూ “కృష్ణా - రామా” అని సరిపెట్టుకోకుండా, ఎందుకూ కొరగాని కబుర్ల కాలక్షేపం కాక, బద్ధకాలూ -క్రుంగుబాటులూ – ఒంటరితనాలూ వదలి - తమకు ఆరోగ్యమూ, ప్రజలకాహ్లాదమూ అగు మంచి పనులకు పూనుకోవడం గదా ఏఊరి వాళ్లకైనా కావలసినది!
ఈ పూట 23 మందీ వచ్చారు, చేతొడుగుల్నీ తమ అభిమాన పనిముట్లనూ ధరించారు, వీధిని ఊడ్చారు, రోడ్డు ప్రక్కన గడ్డిని చెక్కారు, కావలసిన చోటు చెట్లను మరింత పొందికగా మార్చారు, షెడ్దర్ లో వేసేవి కాక - ఇతర ప్రోగుబడిన వ్యర్ధాల లోడింగూ చేశారు,
చెట్లకెగబ్రాకుతున్న పిచ్చి తీగల్ని ఒక ప్రసాదూ, అందం లోపిస్తున్న కొమ్మల్ని మరో ప్రసాదూ తొలగించారు, అంతిమంగా ఆ 150 గజాల వీధిని తృప్తిగా చూసుకొన్నారు,
కోడూరుకు బదులు అడపా వారి నినాదాలకు బదులిచ్చి, DRK గారి శ్రమదాన విశ్లేషణ విని,
షరామామూలుగానే వర్షాన్ని కనిపెట్టుకొని రేపు రిలయన్స్ స్మార్ట్ వద్దనో - ఈ బైపాస్ వీధిలోనో కలవాలని నిశ్చయించారు!
గునపంతో త్రవ్విననూ
గొడ్డలితో పనిచేసిననూ - గునపంతో త్రవ్విననూ
చెత్త పనలు మోసిననూ - చెత్తబండి సర్దిననూ
ఆర్భాటం కనుపించదు - అతని బరువు పనులందున
వ్యాయామోపాధ్యాయ క్రమశిక్షకుడీ బెనర్జీ!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
03.07.2026