3884* వ రోజు....           05-Jul-2026

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

3884* (ఆదివారం) కూడ 38 మందే!

               అందులో 16+1(ఫోటోగ్రాఫర్) మంది  రాక మాత్రం 4:22 AM కే! వాలంటీర్ల ఈ నాటి కార్యరంగం మరొక మారు రిలయన్స్ స్మార్ట్  నుండి  400 గజాల దూరపు పోలీస్ ఠాణా వీధి దాక! పని విరమణ కాలం 6.04! కాఫీ కబుర్ల సందడి 6.12, తుది సభా సమయం 6.19 వరకు!

               ఐతే –“ఈ 100 నిముషాల వ్యవధిలోనే  ఇంతగా దుకాణాల - గుడుల-హోటళ్ళ –

త్రోపుడుబళ్ళతో  క్రిక్కిరిసిన వీధిలో అంతదూరం ఎలా శుభ్ర పరిచారు?” అంటే-

               మొదటి కారణం కార్యకర్తల ఆదివారపు ఉత్సాహం కావచ్చు,

               రెండవ కారణం బహుశా దుకాణాల వారూ, కొందరు   గృహస్తులూ తక్కువగా చెత్తలు వేయడం కావచ్చు, -

               మరో కారణమూ ఉంటే ఉండవచ్చు - కార్యకర్తలు శుభ్ర పరచింది 100% కాక 80-90 శాతమే కావచ్చు!

                 నేడు రాని ఏ కార్యకర్తలో రేపు ఇందులో కొంతభాగాన్ని మళ్లీ శుభ్ర పరచవచ్చేమో!

                ఈ పూట చెప్పుకోదగిన- ఎవరికైనా మళ్లీ చూడాలనిపించే ఒక చిన్న 1.5 సెంట్లు ఖాళీ స్తలమున్నది – స్తలం చిన్నది గాని అక్కడ  డజనుమంది శ్రమ జాలు వారింది - గడ్డికాని, ప్లాస్టి క్  తుక్కు గాని, పాత గుడ్డలు కాని, నేల చదును కాని ...చాలా పనులు జరిగాయి, డజన్ల డిప్పల వ్యర్ధాలు తొలగిపోయినవి!

                ఎక్కువ మందికి వీధి ఊడ్పుల పనే!

               ఒక డ్రైను వ్యర్దాలు  లాగుతున్న కార్యకర్త “ఛ! మరీ ఇంత కంపా? ఇన్ని  సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లా? అన్నం-టిఫిన్ వ్యర్ధాలా? ప్రక్క షాపుల వాళ్లెలా భరిస్తారో- ఎందుకు క్లీన్ చేసుకోరో...” అనడం వినిపించింది. ఐతే సదరు కార్యకర్త అపనైతే ఆపలేదనుకొండి!

               ఈపూట నినాదాలు వినిపించింది RTC  వాహన చోదకుడైన తోట నాగేశ్వరుల వారు,

               రేపటి పని ఎక్కడ ఆగి మొదలు పెట్టాలనేది మాత్రం చర్చలు జరిగి- చివరికి ముత్యాల చంటి హోటల్ వద్ద అని తేలింది!

               ఈ సాయంత్రం చండ్ర వికాస కేంద్రంలో “మండలి వెంకట కృష్ణారావు” గారి నాటక ప్రదర్శనమున్నది!

            ఒంటి పైన చెమట చుక్క!

అనిల్ మాస్టరంటేనే మర్యాదకు మారుపేరు

ఔద్యోగిక బాధ్యతలకు ఆతడు పెట్టింది పేరు

తన బడి వలే తన ఊరూ దర్శనీయ మయ్యేందుకు

తన కష్టానికి సాక్ష్యం ఒంటి పైన చెమట చుక్క!

- నల్లూరి రామారావు

    రిటైర్డ్ ప్రిన్సిపాల్

 

    05.07.2026