3885* వ రోజు....           06-Jul-2026

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

28 మంది కష్టంతో బందరురోడ్డు శుభ్రత! -@3885* -

               గ్రామ శుభ్ర సౌందర్య  కంకణ  ధారులు 28 మందిలో 16 మందీ 4:30 కు కాదు -4:19కే చంటి హోటల్ దగ్గర వచ్చి వాలారు..

               చెప్పుకోదగ్గ ఆక్రమణలు లేని ఆవీధిభాగం చాల వరకు నిన్న కార్యకర్తలు ఊడ్చి బాగుచేసినదే నేను ముందే అనుమానించినట్లే  కొందరు స్వచ్ఛ  శుభ్రతా స్పెషలిస్టులకు అదిచాలలేదు. పై గా ఈ 24 గంటలలో ఆప్రాంతంలో వచ్చి పడిన దుమ్మూ- ఇసుకా - ప్లాస్టిక్ దుర్మార్గాలూ కనిపిస్తే స్వచ్చ కార్యకర్తలు ఊరు కొంటారా?

               ఎవరి పనిముట్లు వాళ్లవి, ఎవరి ఊడ్పులు వాళ్లవి, రోడ్డు అంచు ల్లో పేరుకుపోయి, గట్టిపడిన ఇసుక, దుమ్ము మిశ్రమాన్ని పారలతో కదిలించే వాళ్ళు కొందరైతే- మురుగు కాల్వల నుండి తుక్కును లాగే కార్యకర్తలు కొందరు.

               చెత్త, పిచ్చి మొక్కలు, కొమ్మలు కాక ఈపూట కేవలం దుమ్మూ, ఇసుకా ట్రాక్టర్ లోకి  ఎత్తబడినవి. అవి ఏ వీధిలో ఏరోడ్డు అంచూకూ  బరంతుగా మారినవో నేను చూడలేదు!

               కార్యకర్తల ఇతర శ్రమ విన్యాసాల సంగతి ప్రక్కన పెట్టి, అందులో అన్నిటికన్న నన్ను ఆకర్షించిన దృశ్యం - చంటి హోటల్ ఎదురుగా రోడ్డుకు ఉత్తరపు డ్రైను బాగు చేస్తున్న పనే! అక్కడి ఇళ్ళవారు గాని, షాపుల వారు గాని అక్కడ నిలబడి ఆ 40 నిముషాల-10 మంది కష్టాన్నీ, ముక్కులదర గొట్టే ఘాటు కంపునూ చూస్తే, పీలిస్తే గాని తెలియని దృశ్యం !

               అసల దెంత రద్దీ ప్రాంతం? వందల మంది టిఫిన్ల, కొబ్బరి  బొండాల, ఇతర వస్తువుల కొనుగోళ్ళ కేంద్రం ఎంత శుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండాలి? స్వచ్ఛ కార్యకర్తల సాహసం తరువాత 6.AMకు గాని, చెప్పుకో దగ్గంత శుభ్రంగా అది కనిపించింది!

               అప్పటి దాక ' ఐదారుగు రందిస్తున్న దుమ్ముడిప్పల్ని  ట్రాక్టర్లో సర్దిన పద్మావతి అస్పత్రి ల్యాబ్ టెక్నిషియన్ నల్లూరి  శ్రీను ఈపూట తుది సభా నినాద ప్రవర్తకుడు!

DRK ప్రసాదుగారి-

1) 1974 నాటి గుంటూరు మెడికోల బ్యాచ్ -70 ఏళ్ల జ్ఞాపిక గా విజయవాడలో జరుపుకొన్న పునః     కలయిక (రియూనియన్) విశేషాల

 2)  NTR పార్క్ వెలుపల వాహన, నిలుపుదల ప్రదేశ వివరాల ప్రస్తావనా, రేపటి కార్యకర్తల వేకువ కలయిక పోలీస్ స్టేషన్ వీధి వద్ద అనే ప్రకటనలతో నేటి శ్రమదానం పూర్తి !

            అతని చెమట ధార

అప్పుడపుడు వస్తేనేం కళ్లజోళ్ల వీర

శ్రమ సమయములో ఆరదు అతని చెమట ధార

కార్యకర్తలకు ఆతని కళ్లజోళ్ల సాయం

కంటి ఉచిత పరీక్షలూ కలవు దాని కదనం!

- నల్లూరి రామారావు

    రిటైర్డ్ ప్రిన్సిపాల్

 

    06.07.2026