పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!
నేటి పనిదినం 3888* వది! పనివారు 29 మంది(గురువారం 9-7-2026)
పని రోజులు అలా అలా పెరిగిపోతున్నవి; పనిగంటలైతే వేగంగా పెరిగి 5 లక్షలకు చేరువౌతున్నది; వీధులు సరే- చుట్టూ రహదారులు సరే- సంతృప్తికరంగా, హరిత సుందరంగా అనుభవించే వాళ్ళకు ఆహ్లాదమయంగా అనిపిస్తున్నవి గాని-
28 వేల జనాభాతో పెద్ద పంచాయతిగా ఉన్న ఈ చరితాత్మక గ్రామంలో ఎందరు తమ ఊరి కోసం కాస్త సమయాన్ని శ్రమనూ వెచ్చించేందుకు సంసిద్ధులు? మహా ఐతే-200 మంది! మళ్ళీ చూస్తే వాళ్ళలో చల్లపల్లి కార్యకర్తలా అంటే అదీ కాదు-రామానగర, మంగళా-శివరాం-వెంకటాపురాది పొరుగూళ్ళ కార్యకర్తలూ అందులో ఉంటారు!
ఈ ఉదయం 6.15 కు బందరు రోడ్డు లోని ATM కేంద్రం వద్ద జరిగిన మీటింగును తన నినాదాలతో ప్రారంభించిన కూలీ మేస్త్రి వెంకటేశ్వరరావు 4 కిలోమీటర్ల దూరపు వెంకటాపురీయుడే! “ఇంత దూరం-ఇంత చీకట్లో చల్లపల్లి వచ్చి, నీకీ ఉచిత సేవలెందుకు ?” అని అడిగితే
“ఏదో ఇద్దరు తప్ప – మా ఉళ్ళో ఇలాంటి సంఘ సేవలకెవరూ ముందుకు రావడం లేదండి – మీ అందరితో కలిసి, ఈ మంచి పని చేస్తున్నప్పటి తృప్తివేరండి-!” అని చెప్పుకొచ్చాడు! ఇతనిది గదా - సామాజిక స్పృహంటే-! ఎందరు విద్యాధికుల లో ఈ అలోచనలున్నవో చెప్పండి!
ఈ వేకువ కొందరు కార్యకర్తలు పరిశీలించినప్పుడు –“ATM తదితర వీధి మార్జిన్ల దురాక్రమణల విషయంలో చాల ఇబ్బంది పడుతున్నారని,
వెంకటేశ్వర ఆలయం ప్రక్కన ఇన్ని చెత్తలూ, మూత్ర దుర్గంధాలూ ఉండడమేమిటనీ. ఈ ఫ్లెక్సీల బెడద స్వచ్ఛ – సుందర చల్లపల్లి కి తప్పదా? అనీ బాధ పడడం గ్రహించాను!
గ్రంధాయల వీధిలో పేరుకు పోయిన వ్యర్ధాల్ని, మట్టి గుట్టల్ని 15 మంది ఎంతగా శ్రమిస్తే ఆ వీధి శుభ్రపడిందో గ్రహించాను!
“వీధి దురాక్రమణల - ఫ్లెక్సీల - బెడదను గురించి Dr.DRK గారి ఆవేదన ఇంకెంత కాలం ఉండునో” అని విచారించాను !
కొన్నాళ్ల కిందట సతీ సమేతంగా ఆసుపత్రిలో 5000 /- రూపాయలు రోజు వారీ శ్రమదాన ఖర్చులకు ఇచ్చిన అంబటి బసవ శంకరరావు గారు - అనుకోకుండా ఈ ఉదయం 520/- రూపాయలు విరాళం అందించారు.
కెనరా బ్యాంకు వద్ద నుండి రేపటి శ్రమదానం మొదలవుతుందని తెలుసుకున్నాను!
సజ్జన అభిభాషణ!
తాత్కాలిక సేవలైతె తర్క వితర్కములెందుకు?
అందరి కాచరణీయము అనే గదా చల్లపల్లి
శ్రమదానోద్యమము గూర్చి సజ్జన అభిభాషణ!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
08.07.2026