3889* వ రోజు....           10-Jul-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

బందరు రోడ్డు – బంకు ప్రాంతంలో నేటి (10.07.2026) సేవలు -@3889*!

               అవి సేవలు కావచ్చు- బాధ్యతలు  కావచ్చు! 26+3 మందివి.(ఈ +3 సంఖ్య చుట్టం చూపుగా చివరి 20 నిముషాల్లో వెళ్ళిన నాబోటి వాళ్ళది!)

               వేకువ 4.21 కే కార్యకర్తలు వీధి  కాలుష్యాల మీద కాలు దువ్వినది ATM కేంద్రం వద్ద! పనులు సాగింది అక్కడి నుండి ఇండియన్ బ్యాంకు దాక!

               నేటి రకరకాల రోడ్డు పనుల్లో బాగా గుర్తుండిపోయేది మాత్రం కెనరా బ్యాంకు ముందున్న 3-4 సెంట్ల స్థలం పరిశుభ్రతే! బ్యాంకుతోనూ, అక్కడి దుకాణాలతోనూ  పనిబడి వచ్చిన వాళ్ళలో కొద్ది మందికి అనిపిస్తుందేమో – “అరె! ఇక్కడి  నిన్నటి చెత్తా- చెదారం, ప్లాస్టిక్ లూ, దుమ్మూ - ఇసుకా, పండ్ల తొక్కలూ ఏమైపోయినవి? “అని! వారిలో బహుశా కొందరు-“ఆహా! ఊరి రోడ్లన్నీ  ఇంత శుభ్రంగా ఉంటే ఎంత బాగుండును?” అని!

               మరి వాళ్ళ ఆలోచనలు అంతటితో  అగిపోతే ఎలా? “ఈ మార్పుకు కారకులెవరు? 12 ఏళ్ళుగా వాళ్ళెందుకీ చెత్త -దుమ్ము-బురద పనులు చేస్తున్నారు? అని కూడ రావాలిగదా ఆలోచన?

               ఆ కాస్త జాగాలోనే, ఆ ప్రక్క ఉత్తరపు మొండి బజారులోనే 12 మంది కార్యకర్తలు డ్రైను బాగుచేసి లాగిన తుక్కు గుట్టా, ట్రాక్టరు సగం నిండిన దుమ్మూ- ఇసుక కనిపించాయి!

               వీధి ఊడ్పులు సరే- 6.00 వేళ బందరు వీధి చూసుకొని, కార్యకర్తల సంతోషం సరే- గణేష్  ప్రెస్ దగ్గర- సచివాలయం దక్షిణపు సందులో రూపొందుతున్న మినీ డంపు సంగతి? రావలసింది అక్కడి వారిలో స్వచ్ఛ-శుభ్ర- సౌందర్య స్పృహా? లేక పంచాయతి వారి పర్యవేక్షణా?

               ఈ కార్యకర్తల్లో ఏ ఒక్కరూ తమ సొంతానికేమీ ఆశించరనీ, తాము లక్షల గంటలు  శ్రమించి, మెరుగులు దిద్దిన చోట్ల గలీజులు వేయకుంటే చాలుననే గదా వారి కోరిక?

               6.01 కి విజిల్ మ్రోగే సరికే- లోడింగు కూడ పూర్తి కాగా, తమ చీపుళ్లో  దంతెలో మోసుకుంటూ తిరిగి ATM ల వద్దకు చేరుకుంటున్న కార్యకర్తలను చూస్తే- ఒక చల్లపల్లి పౌరుడుగా గర్వం కలిగింది!

               పెదప్రోలు గ్రామస్తులైన Dr. మండవ సాయి గారు గతంలో శ్రమదాన ఉద్యమ ఖర్చులకు 50,000/- రూపాయలు ఇచ్చినది కాక ఈ రోజు మరల 30,000/- రూపాయల  సహకారం అందించినందుకు కార్యకర్తలందరి తరుపున దన్యవాదములు  

               తన నినాదాలతో నేటి స్వచ్ఛ సభా ప్రారంభకులు అడపా గురవయ్య నేటి  గ్రామ సేవకుల కష్టాన్ని అభినందించి,

               రేపటి పనులు సైతం ATM , 3 రోడ్ల సెంటర్ల నడుమనే జరుగునని నిర్దేశించినది Dr. DRK గారు!

            చక్కని దిశ చూపులే!

ప్రతి కుటుంబ మీవిధముగ పది మొక్కలు నాటితే-

ఇంటికొక్కరైన వచ్చి, ఈ సంస్కృతి నిలిపితే-

స్వచ్చోద్యమ ఆశయమును చక్కగ పాటించితే –

చల్లపల్లి దేశానికి చక్కని దిశ చూపులే!

 - నల్లూరి రామారావు

    రిటైర్డ్ ప్రిన్సిపాల్

    10.07.2026