పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!
3890* వ నాటి (11.7.2026) గ్రామ బాధ్యతలు 44 మందివి!
ఏమైనా వారాంతపు శ్రమోత్యాహం వేరుగానే ఉంటుంది. ఏడెనిమిదేళ్ళ బాలికలు (వేల్పూరి దంపతుల సంతతి) సైతం వీధి వ్యర్ధాలేరుతుంటే-పెద్ద డాక్టరమ్మా- డాక్టరయ్యా చీపుళ్ళందుకొంటే-తమ ఇళ్ళ- షాపుల ముందు 40 మంది కార్యకర్తలు వెదకి వెదకి కాలుష్యాలను అంతమొందిస్తుంటే మా బోటి కొందరికా సందడి కనువిందు –వీనుల విందు చేస్తుంటే … *అసలిలాంటి సన్నివేశాలు చల్లపల్లి లో తప్ప దేశంలో ఎక్కడైన కనిపిస్తాయా?*
ఈ పూట సుమారు 20 మంది శ్రమదాన ముహూర్తం మరీ 4.21కే! బందరు వీధిలోని బహు రద్దీ ప్రదేశమైన ATM కేంద్రం నుండి శ్రమ దాన రధం నెమ్మదిగా సాగుతూ, కాలుష్య సాంద్రతను బట్టి, గణేష్ ప్రెస్, పెట్రోలు బంకు, చిన్న కార్ల స్టాండు వంటి కొన్ని చోట్ల ఆగుతూ, 6.00 దాటే సరికి 3 రోడ్ల గ్రామ ప్రధాన కూడలి వద్ద యాత్ర పూర్తి చేసుకొన్నది!
ఈ శనివారపు ఉదయాన గంట సేపు ఈ శ్రమదాన సంరంభం లో నేను గమనించిన కొన్ని ముఖ్య ఘట్టాలు:
A) అతి భారీ ఫ్లెక్సిల వెనుక వంగి, దూరి, దుమ్మూ బూజూ ముఖానికంటుకొంటున్నా సరే-వంటికీ,బట్టలకూ దుమ్ము కొట్టుకుంటున్నా లెక్క చేయక ఒకప్పటి కూచిపుడి హోటల్ వద్ద పల్నాటి అన్నపూర్ణ సాహసం
B) సగం మందిని దగ్గర గా పరిశీలించగా-“అరె! ఈ పాత చెప్పుల కొట్టు వద్ద నేను ఊడవడమేంటి?” అని గాని
-“అయ్యో ! నా బట్టలకు చెమట, దుమ్ము అన్తుకొంటున్నవే” అని గాని,
-“స్వర్ణ గ్రామం అనే బోర్డు క్రింద,టాయిలెట్ల ప్రక్కన మేం శుభ్రం చెయడమేంటి” అని గాని ఏ ఒక్కరూ అనుకోకపోవడం!
C)4000* రోజుల శ్రమ వైభవం గురించి, తమ అభిప్రాయాలు వ్రాసి ఇవ్వాలని కార్యకర్తల్ని నేను అభ్యర్ధించడం!
D) నెల వారీ స్వచ్చోద్యమ ఖర్చుల కోసం ఒక అమెరికా పౌరుడు –నల్లూరి సూర్యవర్ధన్ తరపున నేను 10,000 /- Dr.DRK గారికి సమర్పించడం!
E)ఆహ్మదాబాద్ లో ఉన్న ప్రాతూరి శంకరుల వారు కార్యకర్తలకు తీపి కాజాలను పంపడం!
F) రేపటి శ్రమదానం బైపాస్ వీధిలోని కమ్యూనిస్టు బజారు వద్దనని Dr.DRK గారు ప్రకటించడం!
సామాజిక బాధ్యతగా
ఇతడు కేశవ మహారాజు-ఇవిగో వివరమ్ములు
కాసానగరమె ఆతని కనిపెంచిన ఊరు
జీవికకై టీచరుగా చేయు నిమ్మగడ్డలో
సామాజిక బాధ్యతగా స్వచ్చ చల్లపల్లి లో
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
11.07.2026