3895* వ రోజు....           16-Jul-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

               బైపాస్ మార్గంలోనే ముగిసిన 5రోజుల శ్రమ సందేశం-@3895*

               12-7 నుండి 16-7(గురువారం) దాక- సుమారు అర కిలోమీటరు రోడ్డుకూ, కొసరుగా ప్రక్క వీధి భాగాలకూ,2-3 ఖాళీ స్థలాలకూ- టోటల్ గా సుమారు 220 మందీ-మొత్తంగా 240  పనిగంటల గ్రామ బాధ్యతలు విజయవంతంగా ముగిసినట్లే!

               కమ్యూనిష్టు వీధి చివర ఒక్క రోజు శుభ్ర పరచాలని – గ్రామ ప్రధాన కేంద్రం వద్ద చేస్తున్న పనులాపి, వచ్చిన స్వచ్చ సైనికుల నిర్వాకం ఇది! దీన్ని ఎవరైనా క్రమశిక్షణ రాహిత్యమనో-సరైన ప్లానింగ్ లేని శ్రమ దానమనో భావించనక్కర లేదు! (కార్యకర్తల్లో కొందరి గ్రామ సేవాతిశయం అనుకొందాం! కళ్ళేదుట ఒక ప్రధాన వీధి కాలుష్యాలు మిగిలిపోతే –వాటిని వదిలేసి మరో వీధికి పోలేని దౌర్బల్యమనీ అనవచ్చు)

               ఈ ఉదయం పరిస్తితే చూడండి-4:19-6:06 కాలాల నడుమ 26 మంది పనులు ముగించి,కాఫీలు సేవించి తుది సభను తీర్చి ఉంటే– ఐదారుగురు మాత్రం-మళ్లీ రేపటి  దాక ఎందుకని- 6:30 దాక శ్రమను కొనసాగించారు!

               నేటి శ్రమదానంలో కొన్ని విశేషాలు:

               1) ద్వితీయ విఘ్నం లేకుండా దోనేపూడి నాగేశ్వరరావు గారి శ్రమదానం! (తన వీధిలో సిమెంటు రోడ్డు వేసి, బైపాస్ కు కలపక వదిలేస్తే ఈయనే అది పూర్తి చేసినట్లు తెలిసింది!) తృతీయ- చతుర్ధ-పంచమాది విఘ్నాలూ ఉండబోవట

               2) మాలెంపాటి అంజయ్య గారూ, అంబటి శంకరుల వారు లోతైన మాన్ పోల్ లో దిగి, శుభ్ర పరచడం,

               3)వేగంగా డిప్పలతో పరుగులాంటి నడకతో వెళ్తున్న నిరంజన్, భరత్ ల నుండి నేను చాకచక్యంగా తప్పుకోవడం,

               4)అనుకోకుండా బడికి సెలవైనందున జాన్ స్టన్, అనిల్ టీచర్ల ద్వయం తుది సభ దాక ఉండి, నినాదాలు ప్రకటించడం,

               5) శుభ్రంగా, స్వచ్చ సుందరంగా రూపొందిన బైపాస్ వీధిని చూసుకుని కార్యకర్తలు,DRK మహాశయుడూ అలౌకికానందం పొందడం,

               6) యువ కార్యకర్తలు పనిలో ఉండగానే – సభ ముగియడం,

               చివరి గమనిక : 5 రోజుల తర్వాత మళ్లీ రేపు  ఈ గ్రామ సామాజిక శ్రమ వేడుక తిరిగి సెంటర్ కు మారడం!

                 ఉరిమి సాయి అవగాహన

  ఉరిమి సాయి అవగాహన ఒక్కింతగ ప్రత్యేకం

   రోడ్ల ప్రక్క చెట్లు నాటు ఉద్దేశము సుస్పష్టం

  ట్రస్టుకు పదునైదు వేల దానమెంతొ ప్రయోజనం

  అప్పుడప్పుడతడు చేయు శ్రమదానం ఆదర్శం!

- నల్లూరి రామారావు

    రిటైర్డ్ ప్రిన్సిపాల్

    16.07.2026