3896* వ రోజు....           17-Jul-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

               ఊరి వెలుపలికి తరలిపోయిన శుక్రవారపు శ్రమదానం-@3896*

               17.07.26 వ వేకువ కార్యకర్తల శ్రమ స్థలమే కాదు- వారి కష్టం యొక్క స్వరూపం కూడ మారింది. అందుకు  కారణం–ఎన్నాళ్లో వేచిన వరుణుడి దయ మంచి వర్షంగా మారడం! 3 రోడ్ల ముఖ్య కూడలి నుండి మొదలు పెట్టి, విజయవాడ బాట శుభ్ర సౌందర్యాలను పునర్నవీకరించాలని తలపెట్టిన కార్యకర్తలు మారిన వాతావరణాన్ని బట్టి NH216 కి వెళ్లారు.

               వర్షమైతే వేకువ 4.00 కూడ ఒక మారు కార్యకర్తల్ని పరామర్సించింది. వాళ్ళు కోరుకున్నదీ అదే- ఎప్పటి నుండో పెండింగులో ఉంచిన హైవే మీద మొక్కలు నాటేందుకు పడవలసింది ఇలాంటి వర్షమే కదా!

               నేను కొంత ఆలస్యంగా రహదారి మీద గంగులవారిపాలెం ప్రక్కన  బండ్రేపు కోడు వంతెన వద్దకు చేరుకొనే సమయానికే స్వచ్ఛ కార్యకర్తలు బాటకు ఉత్తరంగా ముందుగా పాదులు త్రవ్వి,  ట్రాక్టర్ లో తెచ్చిన మొక్కల్ని మాలెంపాటి అంజయ్య గారు అందిస్తుండగా – కృష్ణకుమారి, వెంకటేశ్వరమ్మలు అందుకొని, మోసి, చేరవేస్తుండగా-

               4 రోజుల తర్వాత పునరాగమించిన మల్లంపాటి ప్రేమ్ ఆనందుల వంటి వారు నాటేస్తున్నారు. ఈ వేకువ శ్రమదానంలో 90% పని  మొక్కల ప్రతిష్టాపనే! అదీ అనుకొన్నంత సులభంగా జరుగ లేదు, పని చోటేమో రోడ్డు ఉత్తరాన ఏటవాలు ప్రదేశం-నిన్నా, ఈ వేకువా వానకు కాళ్లు నిలవక జారుతున్న పరిస్థితి!

               ఈ వేళ పెట్టిన మొక్కలకు కర్రలు పాతి కంప కట్టే పని మిగిలిపోయింది. ఈ ముఖ్యకార్యం కాక చెత్తసేకరణ, ప్లాస్టిక్ సామాన్లు ఏరుట, వంతెన గోడల్ని శుభ్ర పరచుట వంటి పనులు కూడ జరిగాయి!

               త్వరలోనే 4,000 పని దినాలకు పయనిస్తున్న 12 ఏళ్ల సామాజిక కార్యక్రమం పైన కార్యకర్తల వ్రాతపూర్వక అభిప్రాయ సేకరణలో భాగంగా-

               నిన్న వ్రాసియిచ్చిన  వీరశేఖరుని పత్రాన్ని నేను చదివి వినిపించగా.. షణ్ముఖ  శ్రీనివాసు గారు నినాదాలలొనర్పగా, DRK గారు కార్యకర్తల కష్టాన్ని సమీక్షించగా,    

               రేపు మొక్కలు నాటే శ్రమదానం ఈ గంగులువారిపాలెం దగ్గరి NH 216 వద్దనే జరపాలని నిర్ణయించారు!

               అదొక వరమే చల్లపల్లికి

   ఒక్క అంజయ్యైన చాలడ మురుగు కాల్వల సిల్టు తోడగ?

   సీతరామయ్యొకడి చాలడ చెత్త బండ్లను సర్దు పనికి?

   తూములూరి నిశ్సబ్దంగా తుక్కు లెన్నో లాగ లేడా?

   అన్నపూర్ణ  శ్రమ విధానం అదొక వరమే చల్లపల్లికి!

- నల్లూరి రామారావు

    రిటైర్డ్ ప్రిన్సిపాల్

    17.07.2026