పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!
వారాంతపు (18.7.2026) 33 మంది శ్రమ సందడి!@ 3897 *
దాని కాలపరిమితి 4.19 – 6.04 AM నడుమ;సందడి చేసిన వాళ్ళు 33 మంది;శ్రమ చప్పుడు వినిపించినది ప్రధానంగా గంగులవారిపాలెం – NH 216 కూడలిలో!
విచిత్రమేమంటే – 3 ఊళ్ళనుండి-మూడేసి కిలోమీటర్ల దూరం నుండి – 33 మంది కార్యకర్తలు పాలుగొన్నారు గాని,చిరుచినుకుల చల్లని హాయిగొలుపు వాతావరణంలో మొక్కలు నాటారు గాని పాతిక గజాలలోపు ఇళ్ళవారు గాని,గంగులవారిపాలెం నుండిగాని ఏ ఒక్కరు పట్టించుకోలేదు!
“ ఏముందిలెద్దూ! పది – పన్నెండేళ్ల నుండి జరుగుతున్న తతంగమే గదా!వేకువ 4.00 – 6.00 మధ్య రోడ్డెక్కుతారు,తమ ఇళ్ళ ముందులాగా ఊడుస్తారు,మొక్కలు నాటుతారు,గంటన్నర తర్వాత వెళ్తారు!
అంతేగదా”! – అని తమపనులకోసం వెళ్ళే – వచ్చే గ్రామస్తులూ,కొంపలారిపోతున్నట్లు 100 కి.మీ మించిన వేగంతో దూసుకుపోయే వాహనదారులూ అనుకొంటారేమో!
ఈ పూట కార్యకర్తల్లో మూడొంతుల మంది పనులు మాత్రం
1) బురద అంటుకొంటున్నా మోకాళ్ళానించి,పాదుల మట్టి బైటకు తోడడమూ,
2)పలుగులతో గుంటలు త్రవ్వడమూ,
3)రక రకాల మొక్కలు పెరిగిన ప్లాస్టిక్ కవర్లు చించి,పాదుల్లో నాటి,తగుమాత్రం నీరుపోయడానికీ పరిమితమైనవి!
మిగిలిన వాళ్ళు –
NH 216 రహదారి ఊడుస్తూ,
అడ్డూ – ఆపూ లేక పెరిగే చెట్ల,పూలమొక్కల కొమ్మల్ని కత్తిరిస్తూ,కొన్ని మొక్కల పాదుల్ని సవరిస్తూ,
షణ్ముఖ శ్రీను ప్లాస్టిక్ వస్తువులు ఏరుతూ ఈహైవే సుందరీకరణకు తమ వంతు కృషి చేసారు.
చివరి పావుగంటలో:
1)మైకు మొరాయింపులో ఇనుపకుతిక రాజుగారి నినాదాలూ,
2)D.R.K గారి సమీక్షా సంగతులూ,
3)అంబటి శంకరరావు గారిఅభిప్రాయ పత్రాన్ని నేను చదవక రేపటికి వాయిదా పడడమూ,
4)అహ్మదాబాద్ లో ఉంటున్న శంకరశాస్త్రి గారు 2 రకాల స్వీట్లను పంచించడమూ,
రేపటి వేకువ శ్రమదాన స్థలం కూడ ఈ NH 216 – బండ్రేవుకోడు వద్దననే నిర్ణయమూ!
ఈ తూము వారు నాల్గింటికె ప్రత్యక్షం
కలెక్టరేట్ లో ఉద్యోగం కానీ ఈ తూము వారు
నాల్గింటికె ప్రత్యక్షం మొదటి ఫోటో తీసేందుకు
అంతేనా – అప్పుడప్పుడావేశం పెరిగి పెరిగి
తూముల్లో దూరి చెత్త తొలగించుట పరిపాటి!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
18.7.2026