3990* వ రోజు....           21-Jul-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

అక్షరాలా ఇది 3900* వ విడత సామూహిక శ్రమదానం!

               మంగళవారం (21-7-26) నాటి సమాచారమిది. బెజవాడ రోడ్డులోని NTR పార్క్ ఎదుట - 4.20 AM. కే స్వచ్ఛ కార్యకర్తలు చేరుకొన్నారు. NH216 మీద పూల- నీడ మొక్కలు నాటే పనుల్ని వాయిదా వేసి, ఇక్కడికొచ్చిన కారణమిది:

               బెజవాడ రోడ్డుకూ పార్కుకూ మధ్య గల డ్రైన్ను పూడ్చి ఆ నాలుగైదు సెంట్ల జాగాను చదును చేసి, పూల మొక్కలు నాటి, పార్కులో నడిచే వారి వాహనాల నిలుపుదలకు అనువుగా మార్చాలనే సంకల్పం.

               ఐతే ఈ 2 రోడ్ల కూడలి వ్యాపారకేంద్రమై పోవడం వలన చిరు వ్యాపారుల ఆక్రమణల బెడదొకటున్నది, ఆ విషయంలో పార్కు నిర్వహణ చూసుకొనే రత్నగిరి, కాంట్రాక్టరు కృష్ణారావు, బంకు పూర్ణ, న్యూట్రి ఫీడ్స్ శ్రీధర్ వంటి వారు అప్రమత్తంగానే ఉన్నారట! 

నేనక్కడికి వెళ్లి గంటసేపు చూసిన దృశ్యమిది:

               అది ఏ ఒక్కరి సొంత పనో కాదు – గ్రామమంతటికీ పనికొచ్చేది - అక్కడ తడి మట్టి డిప్పలకెత్తి మోస్తున్నది కూలీలూ కాదు – అన్ని సామాజిక వర్గాలకు చెందిన స్త్రీ - పురుష కార్యకర్తలు! వాళ్ళతో కలిసిపోయి బట్టలు చెమటతో తడిసి, ఇక ఈ పూటకు వాకింగ్ అవసరం లేని పార్కు నడక మిత్రులు!

               అంతలో ఒక బరువైన చెట్టు పడిపోగా - దాన్ని మోసుకొచ్చి, శ్రమ తెలియకుండా “ఎత్తర చెట్టును హైలెస్సా” అని అరుస్తూ ట్రాక్టర్లోకి ఎక్కించిన కస్తూరి శ్రీను, పాటల శ్రీను, బృందావన, నరసింహాది 6 గురు స్వచ్ఛ కార్యకర్తలు!

               ఆ దృశ్యాల్ని చూస్తున్న నాకు టైమ్ తెలిసిందా? శ్రమిస్తున్న వాళ్లకు అలసట కలిగిందా? డాక్టరు DRK గారి విజిలు మ్రోగితే గాని – 6:04 అయిందని గుర్తుకురాలేదు!

               నేటి చివరి సమావేశాన్ని తోట కృష్ణారావు గారు నినాదాలతో మొదలెట్టారు! డాక్టరు గారు రోజుటిలాగా కాక – వేకువ 4.00 మొదలు సాయంత్రం 6.00 దాకా ఏయే సమయాల్లో చల్లపల్లి మెరుగుదలకోసం ఎవరెవరు ఎలా శ్రమిస్తున్నారో పూసగ్రుచ్చినట్లు చెప్పారు! ఒక ఆంధ్ర - తమిళ పెద్ద మనషి చల్లపల్లి శ్రమదానం గురించి తెలుసుకొని, ఎంత ఆశ్చర్యపడ్డారో వివరించారు.

               రేపటి వేకువ శ్రమదానం కూడ ఈ బెజవాడ రోడ్డులోనే జరుగునట!

               శ్రీమతి గంధం లక్ష్మణ

ఏ పనిముట్టయిన పట్టు - ఏ పనికీ వెనుకాడదు

డ్రైను గట్టు, చెరువు గట్టు, ట్రాక్టరెక్కి చెత్త త్రొక్కు

అసలామెకు తెలియని పని శ్రమదానములో లేదు

శ్రీమతి గంధం లక్ష్మణ లేని నాడు పెద్ద లోటు!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   21.07.2026