3901* వ రోజు....           22-Jul-2026

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

40 వ శతకంలోకి గ్రామ సామాజిక శ్రమదానం - @ 3901*

               ఈ బుధవారం (22-7-26) వేకువ ఎందుకో గాని N.T.R పార్క్ దగ్గర పరిశుభ్రతా చర్యలు ఊపందుకొన్నాయి! చేస్తున్నవేమో బురద – మడ్డి పనులు,అర్ధ పరంగా ఎవరికీ ఒక్క పైసా ప్రయోజనంలేనివి,ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా బట్టలూ,శరీరము ఖరాబయ్యే ఈ మురికి పనుల కోసం 38 మందికి ఎందుకంత ఉత్సాహమోమరి!

               గ్రామ ప్రధమ మహిళగా పనిచేసిన పైడిపాముల ఆమెకూ,ఇక్కడ నుండి తిరిగి వెళ్లి శస్త్రచికిత్సలకు దిగవలసిన డాక్టరమ్మకూ సరే,ఇది వ్యసనమనుకొందాం! మిగిలిన పాతికమంది కార్యకర్తలూ ఈ వేకువ దినచర్య మానమన్నా మానలేని అశక్తులనుకొందాం! ఒక్క అరగంటైనా,ఈ స్వచ్ఛ కార్యకర్తల గుంపులో కలిసి పనిచేయాలని వచ్చిన ఒక SBI విశ్రాంత ఉన్నతోద్యోగీ,ఎప్పుడో RTC లో డ్రైవరుగా పనిచేసిన మరో పెద్ద మనిషీ సంగతేమిటి?

               పార్కులో వాకింగ్ చేసుకొనే ఆరేడుగురికి ఈ వీధి పనుల్లో అంత చురుకు దనమేమిటి?రెగ్యులర్ వాలంటీర్లు దిగితే దిగారు మురుగు కాల్వలో పనికి – మురుగు కంపుకు వెనకాడక ఇతరులూ పూనుకోవడమేనా? రికార్డు స్థాయిలో రక్తదాత కస్తూరి విజయుడు మలాటుతో 6 కాంక్రీటు స్తంబాల్ని పగలగొట్టడమూ,అతని సోదరుడు శ్రీనూ,కార్పెంటర్ సతీషూ వాటిని ట్రాక్టర్ లో అనిల్ మాష్టారు కందించడమూ?

               గంటసేపు పరిశీలిస్తే ఎవర్ని చూసినా పనిలో సంతోషించడం తప్ప – “ ఈ పనికిమాలిన దుమ్ము – చెత్తపనుల ఖర్మనాకెందుకు?’’ అనుకోలేదే !

               నేటి 4.20 – 6.05 నడుమ శ్రమదాతల వైఖరి చూస్తుంటే –“ పన్నెండేళ్ళవుతున్నా ఇంకా గ్రామంలో సగంమంది ఈ స్వచ్చ – సుందరోద్యమాన్ని పట్టించుకోలేదే’’ అనే దిగులు మాయమైపోయింది!

               కొందరు వాకర్స్ కాఫీత్రాగి వెళ్ళిపోగా – 33 మంది పాల్గొన్న తుది సభను శేషయ్య మాష్టారు  నినాదాలతో ప్రారంభించగా,మన 4000 రోజుల శ్రమదానంపట్ల షణ్ముఖ శ్రీను గారు వెలిబుచ్చిన అభిప్రాయాలను నేను చదివి వినిపించగా,

               దాచుకోలేని సంతోషాన్ని D.R.K గారు వ్యక్తపరచగా,

               రేపటి వేకువ కూడా N.T.R పార్కు వద్ద బంకులోనే కలవాలని నిర్ణయించగా – నేటి కార్యక్రమం ముగిసినది!

                ఇబ్బడి ముబ్బడిగా చేరరు?

ప్రజోపయుక్త మిది కాదా? పారదర్శకత లేదా?

వైయక్తిక ఆరోగ్యపు వరప్రసాదమా-కాదా?

సాముహిక సందడిగా జరుగుతున్నదా- లేదా?

మరి – ఎందుకని గ్రామస్తులు ఇబ్బడి ముబ్బడిగా చేరరు?

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   22.07.2026