3902* వ రోజు....           23-Jul-2026

   పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

ప్రత్యక్షంగా చూసితీరవలసిన 3902 * వ శ్రమదానం !

               అది నడకుదురు – బెజవాడ రహదార్ల కూడలి వద్ద చల్లపల్లికి ప్రతిష్టాత్మకమైన N.T.R పార్కు వద్ద గురువారం (23.7.2026) 38 + 21 (చివరి సంఖ్య వెంకటాపురం కష్ట జీవులది !) మంది చేసినది! 4.20 కే మొదలై, క్రమంగా సందడి పెరిగి,6.05 కు ముగిసిన – మొత్తం 50 పనిగంటల శ్రమ అది!

               మరి ఈ 38 మంది నికర కార్యకర్తలలో N.T.R పార్కు నవీనకరణకు నడుంకట్టిన వాకర్స్ ఉన్నారు,పంచాయతి నుండి వచ్చిన అధికారులున్నారు,వీళ్ళ అండతో రెచ్చిపోయి, 3 ట్రాక్టర్ల మట్టిని మోసి,చదును చేసిన – గ్రామ శుభ్ర- సౌందర్యాల కోసం పిచ్చిపట్టినట్లు పనిచేస్తున్న రెగ్యులర్ వాలంటీర్లు సరేసరి! వాళ్ళ వెర్రి ఒక పట్టాన ఆగేదికాదు!     

               { ఈ వేకువ అటు మట్టి డిప్పలు మోస్తూనే సరదాగా ఒక కరుడుకట్టిన పోస్టాఫీసు ఉద్యోగీ రెలెటివ్ గా జూనియర్ అయిన జాస్తీ అనుకొన్న సంభాషణ:

ఒకరు : ఎన్నేళ్ళు శ్రమిస్తున్నా ఇప్పటికీ వీధి శుభ్రతలు పట్టని గ్రామస్తుల కోసం మొండిగా పనిచేస్తున్న స్వచ్చ కార్యకర్తల కంటే వేర్రోళ్ళు౦టారా?

2 వ వారు: వీళ్ళను పట్టుకెళ్ళి పిచ్చాసుపత్రిలో వేశామనుకో- అక్కడ కూడ ఆసుపత్రి ఆవరణను శుభ్రపరుస్తూనే ఉంటారు! }

               స్వచ్చ సుందర చల్లపల్లికి సుదీర్ఘ శ్రమదానంలో ఇలాంటి ఛలోక్తులు ఎప్పుడూ ఉండేవేలెండి!

అసలింతమంది – 1) రోడ్లు ఊడ్చినా-

2) ప్రక్కన మురుగు గుంటను శుభ్రపరచినా –

3)ఊరంతటికీ మంచినీళ్ళ సరఫరా పైపును రెస్క్యూ టీమ్ వారు మన్ను కప్పి,చదును చేసి,రక్షణగా నాపరాళ్ళు పరిచి,భద్రపరచినా-

4)ఒంటికంటిన దుమ్మూ,కారుతున్న చెమటా కలిసి చర్మంపై జిగట ఏర్పడినా-

               - * ఊరంతటికోసం ఒక మంచి పనిచేస్తున్న తృప్తి తప్ప “ గ్రామస్తులకెవరికీ పట్టని ఈ పని మాకు మాత్రమే ఎందుకు?’’ అనుకోకపోవడమే అసలు విశేషం*!    

               సరే చివరికి 6.03 కు కాబోలు D.R.K గారి విజిలు మ్రోగి,కార్యకర్తలు పనులు రేపటికి వాయిదా వేసి, కాఫీలు త్రాగి, వెంకటాపురం నుండి వచ్చిన కూలీలతో బాటు బంకు ఆవరణలో నిలిచి,

               అడపా గురవయ్య గారి నినాదాలనూ,3 సూక్తులనూ విని,ఆలోచనాత్మకమైన D.RK డాక్టరు గారి హితవచనాలను ఆలకించి,రేపటి శ్రమదానం కూడా N.T.R పార్కు వద్దనే అని గ్రహించారు!

             “ వజ్రం దొరికెను ఊరికి’’

ఈ అంబటి వాని కష్టమెంతని వర్ణించగలను

పుర వీధులు - రహదారులు పూర్తిగ ఋణపడెను తనకు

అతని వయసరవైఏడంటే అసలు నమ్మబుద్దికాదు

ఒక మాటలో చెపుతా విను-" వజ్రం దొరికెను ఊరికి’!"

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   23.07.2026