3903* వ రోజు....           24-Jul-2026

  పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

3903* వ నాటి (శుక్రవారం-24-7-26) శ్రమ సమాచారం!

               గ్రామం కోసం సదరు శ్రమ ఒక నాటిదో - ఒక ఏటిడో కాదు - పన్నెండేళ్ల సుదీర్ఘ కాలానిది! తొలి వెయ్యి రోజుల్లోనైతే అది నమ్మశక్యం గాని కష్టతరమే గాని, ఒక్కో వెయ్యి రోజులు గడిచే కొద్దీ ఆ బరువు పనులు కొంత తగ్గడమూ, కార్యకర్తలు మర రంపం, షెడ్డర్ వంటి సాధనాలుపయోగించడమూ వలన - పనుల్లో కొంత వెసులు బాటు దొరికింది!

               ఐతే – ప్రతి రోజూ - అది పండగో, మండే ఎండలో, వణికించే శీతలమో, ఏ గడ్డు పరిస్థితైనా కావచ్చు - కార్యకర్తలు ఈ గంటన్నర సముచిత శ్రమను మానరు! ఈ వేకువ చేసిన పనే గాదు –గ్రామం కోసం ఇంకా చేయవలసినవేమిటి? అనీ చర్చించు కొంటారు.

               ఖర్చులకు డబ్బు కావలసి వస్తే శాంతా బయోటెక్ రెడ్డి గారూ, గురవారెడ్డి - పద్మావతి వంటి వారుంటారు, అనుమతుల మంజురుకు పంచాయతి మొదలు కలెక్టరు దాక అధికారులుంటారు, చెమట చిందించేందుకు స్వచ్ఛ కార్యకర్తలెప్పుడూ సంసిద్ధులే!

               మరి ఊరు రోజురోజుకూ మెరుగుపడకేంచేస్తుంది? ఎన్ని రహదారి వనాలు పెంచినా, తృణప్రాయంగా లక్షలు ఖర్చుతో రహదార్ల గుంటల మరామతులు చేసినా, అనేక రహదార్లను హరితమయం చేసినా అలసిపోని - ఆగిపోని - నిరంతర శ్రమ జరుగుతున్న చల్లపల్లిదే కదా అదృష్టమంటే!

               ఇవాళ్టి శ్రమదానం గురించి క్రొత్తగా చెప్పేదేముంది ? 4.19 కే NTR పార్కు దగ్గర 14 మంది రెడీగా ఉన్నారు, కాసేపటికి వాకర్స్ కొందరూ, ఇతర కార్యకర్తలూ, అతిథి కార్యకర్తలూ వచ్చి కలిశారు.

               NTR పార్కు - బెజవాడ రోడ్డు నడుమ వాహనాల పార్కింగ్ స్థలం రూపురేకలే మార్చేశారు. ఈ పూట రెస్క్యూ టీమ్ వారు బైటకు కనిపిస్తున్న నీళ్ళ పైపును సరిజేశారు, బాగా పాతుకు పోయిన కాంక్రీటు స్తంభాన్ని కూకటి వేరుతో సహా పెకలించి, ఆ గుంటనూ పూడ్చారు.

               ఎవరి శ్రమ ప్రయత్నం వాళ్ళదే- ఉమ్మడి ఆశయం మాత్రం అక్కడ అందమైన- సౌకర్యవంతమైన పార్కింగ్ స్థల రూపకల్పనే!

 మొత్తం 39 మందీ బంకు ఆవరణ లో పిడికిళ్లు బిగించి, లంకే సుభాషిణి ప్రకటించిన ప్రతిజ్ఞలతో ఏకీభవించారు.

రేపటితోఈ NTR పార్కు వద్ద పనులు ముంగిచాలని DRK గారు వెల్లడించారు!

               అతని కొన్ని టాలెంటులు

ట్రస్టు పర్యవేక్షకుడను హోదా మాట వరసకే

రొచ్చుపనులు- పేడ పనులు రోతపుట్ట వతనికి

అతని కొన్ని టాలెంటులు అబ్బురపరచునందరిని

అతడే కస్తూరి శ్రీను అభినందనలతనికే!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   24.07.2026