3904* వ రోజు....           25-Jul-2026

  పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

3904* కు చేరిన శనివారం నాటి శ్రమ!

               ఇక ఆకష్టం అక్టోబరు మాసాంతానికి 4000 కూ, మరో మూడేళ్ళలో 2029 నాటికి 5000 రోజులకూ చేరుకోగలదు; అప్పటికి ఈ గ్రామ జనాభా 30 వేలు దాటి, ప్రజలకు ఆహ్లాదాల - సౌకర్యాల అవసరం పెరగగలదు; అందువల్ల ఈ గ్రామ సామాజిక బాధ్యులనబడే పిచ్చి కార్యకర్తల బలగం ఇంకా  పెరగవలసిన అవసరం ఉన్నది!

               ఈ ఒకే ఒక్క DRK, ఒక్క పద్మావతీ చాలరు  కనుక యువత నుండి, విద్యార్థుల నుండి వాళ్ల ప్రత్యామ్నాయాలు పుట్టుకురాగలవని ఆశించాలి! అప్పటికైనా చల్లపల్లి ప్రజల్లో గ్రామ సమస్యల పట్ల అవగాహన, పరిష్కరించే ఆలోచన బయల్దేరక పోతుందా? గ్రామ పరిపాలక పంచాయతీ, ఇతర అధికార గణం మరింత చురుకుగా అప్పటి కాలం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతుందా?

               ఆ సమయానికి ఈ శ్రమదాతలంతా ఒక్కొక్కరు ఒక్కో DRK లాగా గ్రామం కోసం నిలబడకపోతారా? అసలప్పటికి ఈ రాష్ట్రమే నిజమైన -స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర- పరిశుభ్ర- సుందరాంధ్రగా మారదా?

               ఒక స్వచ్ఛ కార్యకర్తగా నాకా నమ్మకమున్నది! ప్రతి రోజూ ప్రతి కార్యకర్త పని తీరును గమనిస్తే వచ్చిన నమ్మకమది! ఈ ఉద్యమానికి గ్రామ- గ్రామేతర- పరదేశాలకు వలసదారుల అండదండలను చూస్తుంటే కలిగిన విశ్వాసమది!

ఈ శనివారం వేకువ 4:19 నుండి 6:03 దాక

               1) స్వచ్ఛ కార్యకర్తలు,

               2) NTR పార్కు నడక మిత్రులు,

               3) తాత్కాలిక అతిధి కార్యశీలురు - మొత్తం 37 మంది బళ్ల కొద్దీ మట్టిని పరచి, చదును చేసి, ఐదారు సెంట్ల ఖాళీ స్థలాన్ని వాహనాల పార్కింగుకు సిద్ధం చేసిన 50 పనిగంటల కృషిని చూడగలిగాను.

               పార్కు దగ్గర పనులేగాదు - మంచి నీళ్ళ కర్మాగారమూ, అటుగా చండ్ర వికాస కేంద్రం దాకా ఎంతగా శ్రమించారో చూశాను.

               ఈ మధ్య శ్రమదానం పట్ల శీత కన్నేసిన కోట పద్మ గారు చెప్పి, అందరితో పలికించిన నినాదాలనూ, గ్రామస్తులకామె హెచ్చరికనూ తెలుసుకొన్నాను,

               తరిగోపుల ప్రాంగణం - NH సుందరీకరణ పనులెలా సాగుతున్నదీ DRK గారు వివరిస్తుంటేనూ-

               రేపు వైద్యశిబిర కారణంగా మన శ్రమదానం కస్తూరిబాయి ప్రభుత్వాస్పత్రి వీధికి మారునని ప్రకటిస్తుంటేనూ విన్నాను!

               విజయుడిపై  వ్రాయనేల

విజయుడిపై వ్రాయనేల వినుతిస్తూ పద్యమాల

అతని ఉనికి అవశ్యమే స్వచ్ఛ ఉద్యమానికి

గ్రామ సమాచార మెల్ల కల దాతని గుప్పిట

వందలాది రోగులలో ప్రవహించునతని రక్తము!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   25.07.2026