3905* వ రోజు....           26-Jul-2026

  పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

ఆదివారం(26-7-26) నాటి 3905*వ శ్రమ వేడుక! 

               శ్రమ “వేడుక” అనడం ఎందుకంటే- అది చేసే 25+8 మందిలో ఏ ఒక్కరి కోసమో కాదు- 28 వేల ప్రజల ఆహ్లాద వినోదాల కోసం! డబ్బు కోసమో- కీర్తి కోసమో ఐతే ఈ గ్రామ  శుభ్ర – సౌందర్యాలు ఇలా ఉండేవి కాదు! ఒక మంచి ఆశయంతో- కొందరు మంచి ఆలోచనా పరులు 3905* రోజులగా చేస్తున్న శ్రమదాన యజ్ఞం కనుక, ఉసూరుమంటూ కాక – హుషారుగానూ, కష్ట తర వీధి పారిశుద్ధ్యాన్ని ఇష్టపూర్వకంగా చేస్తున్నందు వల్లే ఇది వేడుక!

               అందువల్ల నియమిత కాలమైన 4:30 కి కాదు - 4:20 కే  16 మంది బెజవాడ రోడ్డులోని ప్రభుత్వాసుపత్రి వద్ద చేరుకొన్నారు! ఇంకొద్ది సేపటిలోనే మిగిలిన వారు తోడయ్యారు. ఇక అక్కడ నుండి నారాయణ రావు నగర్ వీధిలో సందడే సందడి!

               వాళ్ళు రోడ్డును ఊడ్చారా, తామే నాటి పెంచిన చెట్లను సుందరీకరించారా, సింగిల్ యూజ్ దిక్కుమాలిన ప్లాస్టిక్ సామాన్లను  ఏరారా, జాస్తి ప్రసాదు, బృందావన, అడపా , కస్తూరి సోదరాదులు మురుగు కాల్వ పనులు చేశారా, అంజయ్య, ఆస్పత్రి సిబ్బంది, గ్రామ సర్పంచి వంటి వారు ఏ పనికి  అవసరమైతే అక్కడికి  ప్రత్యక్షమయ్యారా... అని ఇలాంటి ప్రశ్నలు అడగకండి!

               ఈ శ్రమ  దాతలున్నదే  గ్రామంలో ఎక్కడ – ఏ అవసరమొచ్చినా తమ కష్టాన్ని – ధనాన్ని-కాలాన్ని దానం చేయడానికి!

               ఇదే గనుక నీరస- నిర్బంధ  శ్రమ దానమైతే – మురికి పనుల సమయంలో కూనిరాగాలెందుకు? కొందరి ఛలోక్తులూ, వాటికి  మిగిలిన వారి దరహాసాలు ఉండేవా? హుషారెక్కువైన కోడూరు వాని కేకలుండేవా?

               అసలీ శ్రమదానం బలవంతపు బ్రాహ్మణ్యమే ఐతే – 12 ఏళ్ళు- నాలుగైదు లక్షల పనిగంటల కార్యకర్తల కష్టం చల్లపల్లికి లభించేదా?

               ఈ వీధిని శుభ్ర పరిచిన 25 మంది కాక, సుమారు 8-10 మంది దీనికి ఉత్తరపు ప్రక్కన విజయా కాన్వెంటులో గోపాళం వారి వైద్య శిబిరంలో ప్రజారోగ్య  సాధనకు పాటుబడుతున్నారు! స్వచ్చోద్యమానిది పన్నెండేళ్ళ వయసైతే – వైద్య శిబిరం 24 ఏళ్ళ నాటిది!

               6:04 నిమిషాలకు  శిబిరం పనులు ముమ్మరంగా జరుగుతుండగా తూము వారి ఈల మ్రోగడంతో స్వచ్ఛ కార్యకర్తలు పనులు ముగించారు.

               కాకపోతే – లోడింగు వాళ్ళు మాత్రం మరో 5-6 నిముషాలు తమ పనిలో ఉన్నారు. ఇక – అప్పుడు 10 నిముషాలు కాఫీ- సరదా కబుర్ల సమయం!

               తన ఆరోగ్యాన్ని బాగా కుదుట బరుచుకొన్న గోళ్ళ వెంకట రత్నం గారు ఈ పూట పునరంకితులైనందున – 2 x3 మార్లు ప్రతిజ్ఞాత్మాక  నినాదాలు పలికి, ఈ సుధీర్ఘ శ్రమదానంలో ధ్యాన మండలి వారి పాత్రను గుర్తు చేసారు!

               రేపటి వేకువ శ్రమ దానం విజయవాడ రోడ్డులోని విజయా కాన్వెంటు వద్ద ప్రారంభమని కార్యకర్తల నిర్ణయం!   

           నాకు అప్పీయక తప్పదు

‘ఆకుల’ పని చూస్తుంటే అసూయ నాలో జనించు

అందు పదో వంతైనా అమలు చేయలేనందుకు

అతని నిబద్ధత చూస్తే అది మాటల కందదు

ఆ చురుకు దనం కాస్త నాకు అప్పీయక తప్పదు!         

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   26.07.2026