3906* వ రోజు....           27-Jul-2026

  పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

గాలి + వానలో బెజవాడ రోడ్డులో 3906* వ శ్రమదానం?

               ఊరికి దూరమైనందు వలనా, 2 ½  గంటల పాటు ఎడతెగని వర్ష కారణంగానూ, ఈ సోమవారపు శ్రమదాతల సంఖ్య తగ్గింది గాని వారి ఉత్సాహం తగ్గకపోగా పెరిగిందనిపించింది. అసలే రాక రాక వచ్చిన - ఈ సీజన్ లో చెప్పుకోదగిన 2 వ పెద్ద వర్షమిది - రైతుల సంతోషదాయకమైన వానలో ఆనందంగా తడుస్తూ.....

               డ్రైనుకు అడ్డుపడుతున్న ప్లాస్టిక్ తుక్కుల్ని కస్తూరి సోదరులు ఏ మాత్రం చీదరించుకోకుండ ఒడ్డుకు చేరుస్తుంటే –

               బృందావన - నరసింహ - నందేటి కార్యకర్తలు డ్రైన్లో పడేసిన తాటి చెట్టును త్రాడు గట్టి, బురదకు పట్టుతప్పుతున్న కాళ్లు నిలద్రొక్కుకుంటూ బలాత్కరించి బైటకు లాగుతుంటే.....

               హాస్పిటల్ A/C, ఫ్యాన్ల వద్ద పని చేసే కృష్ణకుమారి - విజయరాణుల నర్సు ద్వయం వానలో నిలువునా తడుస్తూ రహదారిని శుభ్రపరుస్తుంటే....

               గ్రామ సచివాలయం బైట డ్రైను గట్టు బాగుచేస్తున్న కోడూరు పెద్దాయన రోజుటికన్న ఎక్కువగా కేకలు పెడుతూ పనిచేస్తుంటే...

               30 ఏళ్ళ క్రితం ఊరొదిలి అమెరికా వెళ్లి, ఆ దేశపౌరుడైనా సరే - చల్లపల్లిపైన మమకారం తగ్గని నాదెళ్ల సురేశ్ బురద - నీళ్లలో వీధి పారిశుద్ధ్యం నిర్వహిస్తుంటే....

               ఒక ‘ఆకుల’ కార్యకర్త ఎనలేని శ్రమ - అది వానో, బురదో - ఎక్కడ అవసరమైతే అక్కడికి ప్రవహిస్తుంటే....

               వచ్చే - పోయే గ్రామస్తులు “అరె! పాపం ఊరి మంచి కోరి ఈ అమాయక కార్యకర్తలు పన్నెండేళ్ల నుండి ఇంతగా శ్రమిస్తున్నది మన అందరి కోసమే గదా! మనం కూడ తలా ఒక చెయ్యేద్దాం” అనుకోక వెళిపోతుంటే...

               వాన వల్ల పని చురుకుగా సాగక 6.15 దాక స్వచ్ఛ కార్యకర్తలు పనులు విరమించకపోగా....

               చెత్త లోడింగు కూడ కాస్త ఆలస్యం కాగా.....

               6:20 ప్రాంతంలో అమెరికా పౌరుడు నాదెళ్ల సురేశ్ అర్ధవంతమైన గ్రామాభ్యుదయదాయకమైన నినాదాలు చేయగా....

               వానతో భూమి చల్లబడి, మొక్కలు నాటుటకు అదనని DRK

               రేపటి మన వేకువ శ్రమదానం NH 216 వెంకటాపురం క్రాస్ రోడ్ వద్ద గల బస్సు షెల్టర్ వద్ద  అని ప్రకటించగా –

               నేటి శ్రమదానం సంపూర్ణమయింది

               నల్లూరి శ్రీను ఇతగాడే

రోగి జాతకం ఆతని రక్తంలో కనిపెట్టుట

విశ్లేషణ పూర్వకముగ వైద్యునకు అందించుట

వేకువ స్వచ్ఛంద సేవ వినమ్రముగ పాటించుట

అలవోకగ జరిపే నల్లూరి శ్రీను ఇతగాడట!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   27.07.2026