పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం
3907* వ నాటివన్నీ (28.7.2026) మొక్కల,చెట్ల పనులే !
మంగళవారంనాడు శ్రమదాన స్థలం మళ్ళీ NH 216 లో పెదకళ్ళేపల్లి – నాగాయలంకదారుల నడుమకు మారింది. ఇదివరకటి వలె కాక ఈయేడు వానలు తగ్గిపోయినందున – నిన్న పడిన మంచి వర్షాన్ని సద్వినియోగించుకొనేందుకు ఈ పూట పూల మొక్కలు నాటడమే ఈ మార్పు కారణం!
ఐతే నిన్నటి వలెనే ఈ వేకువ కూడ కార్యకర్తల సంఖ్య తగ్గి,24 కే పరిమితమయింది.మూడు రకాల-పసుపు, ఎరుపు తురాయీ,గద్దగోరు మొక్కలన్నీ కలిపి నాటినవేమో 57.అవికూడ ఒక వరుసలో వెంట వెంటనే కాదు – ½ కిలోమీటరు దూరం దాక అక్కడక్కడా!
వాతావరణమేమో పైకి చల్లగా – నంగనాచిలా కనిపిస్తున్నా ఉక్కపోతల పరిస్థితి !ఈ శ్రమదానమేమో ఊరికి 2 కిలోమీటర్ల దూరాన!ఈ కాలంలో చాలామార్లు జరిగేట్లు – ఫోటోగ్రాఫర్ల – మీడియా సమక్షంలో – మేకప్ లు చెదరకుండా – బట్టలు నలగకుండా జరిగే శ్రమదానమైతే ఇది కాదు!
మహిళలు,వృద్దులు,వివిధ వృత్తుల – సామాజిక నేపధ్యాల వ్యక్తులు పుష్కరకాలంగా,ఊరి శుభ్ర – సౌందర్యాలే లక్ష్యంగా చెమటలు చిందిస్తున్న శ్రమయజ్ఞం! ఈ యాజ్ఞికులలో :
- నడుములూ,మోకాళ్ళు ¾ వంతు దెబ్బతిన్నా వచ్చి,ట్రాక్టరెక్కుతున్న ఒక అంజయ్య!
-తాను ఇండియా వచ్చిన పనులు వేరైనా – వేకువనే వచ్చి,పలుగు చేపట్టి శ్రమిస్తున్న ఒక సురేష్ నాదెళ్ళ!
-కర్ర ఊతగా వచ్చి,శక్తిమేర శ్రమిస్తున్న కోడూరూ,వీరసింహా!
-ఈ 57 మొక్కల పాదులు త్రవ్వి మొక్కలు నాటి,కర్రలతో వాటికి ఊతమీయడం మాకొకలెక్కా? అంటున్న కస్తూరి,గంధం,BSNL,షణ్ముఖ వంటి మొండి ఘటాలూ
-నడుముకు బెల్టులు బిగించి,బరువు పనులు చేసుకుపోయే సజ్జా – ఆకుల
-సింగల్ యూజ్ ప్లాస్టిక్ ఏరే వీరశేఖరుడూ ఉన్నారు!
చచ్చిన,దుండగులు పీకేసిన మొక్కల్ని మళ్ళీ మళ్ళీ నాటి పెంచి,NH 216 కు పచ్చదనాన్ని హామీ ఇస్తున్న ట్రస్టు కార్మికులూ ఉంటారు!
ఎందుకోగాని బస్ షెల్టర్ ప్రక్కన బాగా పొడవుగా,సన్నగా,బలహీనంగా పెరిగిపోతున్న పూల చెట్టు గాలికి పడిపోయే ప్రమాదాన్ని పసికట్టి మూడు ప్రక్కలా త్రాళ్ళతో బంధించి రక్షించిన దుర్గా,పద్మావతి వంటి వృక్ష ప్రేమికులున్నారు.
పన్నెండేళ్ళ క్రితం శ్రమదానోద్యమం ప్రారంభించిన తూములూరి లక్ష్మణుల వారే నేటి తుది సమావేశాన్ని నినాదాలతో ప్రారంభించారు!
ఈ కష్టజీవుల పట్టుదలను సమీక్షించి,రేపు కూడ శివరామపురం రోడ్డు దగ్గరి NH 216 బస్ షెల్టర్ వద్దనే కలుద్దామని Dr. ప్రసాదు గారు ప్రతిపాదించారు!
అది మాత్రం సుస్పష్టము
కార్యకర్తలందెవరిని కదిలించిన శ్రమదానము
ఆపేందుకు ఇష్టపడరు - అది మాత్రం సుస్పష్టము
ప్రతి వార్డులొ ప్రతియొక్కరు పాటిస్తే స్వచ్ఛ స్పృహను
అప్పుడైన ఆపెదరా స్వచ్చోద్యమ శ్రమదానము?
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
28.07.2026