3911* వ రోజు....           01-Aug-2026

  పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!

చాల రోజులు గుర్తుండిపోదగిన శ్రమదానం!- @ 3911*

                శనివారం – ఆగష్టు మాసం తొలి రోజున – వేకువ 4:21 కి 19 మందీ,4:30  ప్రాంతంలో అంతే మందీ- వెరసి 38 మంది చల్లపల్లి గ్రామ హితం కోసం పనిచేసే కార్యకర్తలు 6:20 దాక- అంటే 2 గంటల పాటు జరిపిన ప్రజానందదాయక – NH 216 పారిశుద్ధ్య సుందరీకరణంలో 2-3 ప్రత్యేకతలున్నాయి!

               ఆ మాటకొస్తే-ఏ రోజు కార్యకర్తల కష్టంలో కఠినత్వం లేదు? ప్రత్యేకతలు లేవు? ప్రతి వేకువా పనిగట్టుకొని పని స్థలంలో ఏ మూలన ఏ కార్యకర్త ఎంత దీక్షతో పని చేస్తున్నాడో పరిశీలించే నాకు ప్రతి యొక్కరి ప్రత్యేకతా తెలుసు!

               ఇళ్ళకు 2- మూడేసి కిలోమీటర్లు గడిచి, 3 గ్రామాల నుండి NH 216 పారిశుద్ధ్య సేవలకు ఈ 38 మంది కార్యకర్తలు రావడమే ఒక వింత!

               రహదారికి దక్షిణంగా ఇద్దరు సీనియర్ మగ కార్యకర్తలు గొయ్యి త్రవ్వి, పూల మొక్కలు నాటడం సరేగాని - వాళ్ళకి తీసిపోకుండా గునపంతో నక్కుతో త్రవ్వి, పాదులో మొక్క నాటుతున్న ఇద్దరు నర్సుల (ఇందిరా, విజయ రాణి) కృషి మాత్రం వింత కాదా?

               అసలీ కార్యకర్తలు వాన పడితే ఆగుతున్నారా? ఎండలో వీధి పనులకు భయపడుతారా? ఎప్పుడో ఒకటీ-అరా తప్ప 365 రోజులూ కార్యకర్తల శ్రమదానం మాత్రం విశేషం కాదా?

               శ్మశానాల్లో, మురుగుకాల్వల్లో సేవలందించిన వాళ్ళకు ఈ శనివారం నలభయ్యో-యాభయ్యో మొక్కలు నాటడం ఒక లెక్కా? NH 216 లోని 2 ½ కిలోమీటర్ల చల్లపల్లి ప్రాంతం హరిత శోభతో- పూల సొగసుతో విలసిల్లాలని-నెలల తరబడీ కార్యకర్తలు శ్రమించడం కూడ విశేషమే!

               తక్కిన విశేషాలలా ఉంచి “ జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం’’ వాట్సాప్ లోని ఒక వీడియో చూడండి: నిచ్చెనకు ఆధారం లేకుండానే ఎక్కి-గాల్లో విహరిస్తూ ఒక బలహీనమైన పూలమొక్కను  వాసానికి కట్టేస్తున్న మెండు శ్రీను కనిపించాడా? క్రింద ఆ నిచ్చెనను తడిమట్టిలో నిలిపి, పట్టుకొన్న ప్రసాదులిద్దర్ని కూడా చూశారా? [ నేను 70 ఏళ్ల క్రితం దొమ్మరి కళాకారుల విన్యాసాలను చూశాను. అప్పుడా విన్యాసకారుల పని కేంద్రీకరణకు అండగా డప్పు వాద్యాలుంటే-ఇప్పుడీ సాహసానికి క్రింద నుండి కోడూరు-తదితరుల కేకల ప్రోత్సాహాలు!]

               ఏ శవాన్నో మోసి, రోడ్డు ప్రక్క తడిసి, బరువెక్కిన పరుపును కస్తూరి శ్రీనూ, కేశవ మాష్టారూ, స్వయంగా నేనూ ఎత్తి ట్రాక్టర్ లో వేయడమూ, దాన్ని అంజయ్య సర్దడమూ ఫోటో కవరేజిలో లేదు!

               ఈ పూట నినాదాల్ని గట్టిగా వినిపించినది పోస్టల్-మెండు శ్రీనే! కార్యకర్తల నేటి కష్టాన్ని శ్లాఘించినది D.R.K డాక్టరే!

               రేపటి మన శ్రమస్థలి కూడ 216 వ జాతీయ రహదారిలోని బస్ షెల్టర్ ప్రాంతమే!

                 సంఘటితమొ – సందేశమొ

ఆదర్శము - ఆశ్చర్యము - ఆనందమొ - అభ్యుదయమొ
సంవేదన - సందేశమొ – సదాచరణ సందేశమొ -

ఏదైతేనేం గానీ – స్వచ్చోద్యమ కారులు

పన్నెండేళ్లుగా శ్రామిక పట్టు సడల నీయరు!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

 

   01.08.2026