పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!
మళ్లీ 216 వ జాతీయ రహదారికే 37 గురి సేవలు!@ 3912*
ఆదివారం-2.7. 2026 వ తేదీన- వేకువ సుఖ నిద్రా సమయాన్ని త్యాగం చేసి , ఇళ్లకు దూరంగా రహదారి బాధ్యతలకు పూనుకొన్న కార్యకర్తలకు విసుగు లేదు. 33 వేల చెట్లు నాటి పెంచి - వాటిలో కొన్నిటి బ్రతుకులు అర్ధాంతరంగా ముగిస్తే మళ్లీ మళ్లీ నాటి పెంచి, ఆ శుభ్ర సుందర సువిశాల రహదారిని చూసుకొంటూ మురిసి పోయే అత్యల్ప సంతోషులు! అందుకనే కొందరు వీళ్ల పన్నెండేళ్ల శ్రమను చూసి చూసి,” అదోరకం పిచ్చోళ్లు” అని ముద్దుపేరు పెట్టారు!
లేకపోతే సమాజంలో వీళ్ళ స్థాయి ఏంటీ- ప్రొద్దు ప్రొద్దుటే వచ్చి చేస్తున్న పను లేమిటి? ఊరి రోడ్లు దుమ్ము కొట్టుకుపోతే, పిచ్చిమొక్కలు పెరిగితే, గుంటలు పడితే, ప్లాస్టిక్ చెత్తలు కనిపిస్తే, ఊరంతా ఫ్లెక్సీల మయమైపోతే, డ్రైన్లు పారక పోతే... అన్నీ వీళ్ళకే కావాలా?
“అయ్యో! కళాకాంతులు తగ్గి ఊరు వికారంగా మారుతున్నదే,... ఆ ఫలానా పాగోలు రోడ్డు మలుపు గుంటలో ఎవరు పడిపోతారో...” అని రాత్రుళ్లు నిద్రపట్టక మర్నాడు వాటిని చక్కదిద్దే వాళ్లను వెర్రి వాళ్లని కాక - మహాను భావులు అంటారా?
వేకువ బ్రహ్మ కాలం 4.20 కే అదేదో ఉద్యోగానికి వెళ్తున్న వాళ్ల లాగ ఠంచనుగా ప్రత్యేక యూనిఫామ్ లో వెళ్లడమూ,
ఒక బృందావనుడు చీకటి వేళలో ముళ్ల కంపను సైజులుగా నరకడమూ, మరొక సీనియర్ డాక్టరమ్మ టీనేజి అమ్మాయంత ఉత్సాహంగా మన్ను డిప్ప మోయడమూ, చెత్త ట్రాక్టరెక్కిన అంజయ్య వయసు మరచి, శారీరక అసౌకర్యాల్ని పట్టించుకోక విజయ సూచకంగా చేతులు గాలిలోకి విసరడమూ,
ప్రస్తుత, మాజీ ఉద్యోగులు చెత్త- పెంట కుప్పలెత్తి ట్రాక్టర్ లోకి ఎగుమతి చేయడమూ, ఏ 15 వేల కిలో మీటర్ల దూరం నుంచో వచ్చిన సురేష్ నాదెళ్ల సొంత పనులు ప్రక్కన పెట్టి తగుదునమ్మా అని వీధి పారిశుద్ధ్య పనికి దిగడమూ, చల్లపల్లి సంపూర్ణ స్వచ్చ- శుభ్ర- సౌందర్యాలకు హామీ నినాదాలు చేయడమూ,
మరొక సామాజిక స్వచ్ఛ వైద్యుడు సాటి స్వచ్ఛ కార్యకర్తలనబడే పిచ్చోళ్ళ గంటన్నర వీధి బాధ్యతలను కీర్తించడమూ,
రేపటి ఇలాంటి పిచ్చి చేష్టల కోసం ఇదే 216 వ జాతీయ రహదారి మీదనే కలవాలని సూచించడమూ......
నేనేమో ½ గంట పాటు ఈ వెర్రోళ్లను “వీరాధివీర- శూరాధిశూర స్వచ్చ- సుందర- కార్యకర్తలు” అని వర్ణిస్తూ ఇలాంటి వ్రాతలు వ్రాయడమూ !
అజాత శత్రువులే గదా!
ఎవ్వరినీ నొప్పించక - బెదిరించక – బాధించక
ఎవరి వీధి - ఎవరివాడ - ఎవరి ఇంటి ముందైనా
పెంట కుప్పొ - మురుగు కంపొ - నిర్వికారముగ చేసే
స్వచ్ఛ కార్యకర్తలనగ అజాత శత్రువులే గదా!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
02.08.2026