3913* వ రోజు....           03-Aug-2026

   పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!

ఈసారి కేవలం 21 మందితోనే రహదారి హరిత సుందరీకరణం - @3913*

               ఆ పనులు ఈ 3.8.26 సోమవారం కూడ NH 216 కు చెందినవే! భారీ వర్షం కాదు గాని, వరి పొలాలకు జీవధారలందించే సన్న చినుకుల మధ్యనే - నిలువునా తడుస్తూనే కార్యకర్తల 4:20 నుండి 6:00 వరకూ జరిగిన ప్రయత్నం!

               సాధారణంగా రైతులు, రైతు కూలీలు ఇలాంటి వాతావరణంలో వరి నాట్ల పనులు చేస్తుండడం చూస్తున్నాం. మరి ఈ కార్యకర్తలు చేసిందీ వ్యవసాయమే! - ప్రజలకు ఆహ్లాదం, ఆనందం అనే పంటల కోసం స్వచ్ఛ కార్యకర్తల సేద్యమన్నమాట! పన్నెండేళ్లుగా చల్లపల్లి పాంత్రానికి ఆ ఫలసాయం

 అందుతూనే ఉన్నది!

               సాగుదారులేమో వరినాట్లు వేస్తారు, స్వచ్ఛ కార్యకర్తలు కూడ ప్రతి సీజన్ లోనూ పూల – నీడ - పండ్ల మొక్కలు నాటుతూనే ఉంటారు!

-రైతులు కలుపు తీస్తారు, పురుగు మందులూ, బలం మందులూ చల్లుతుంటే –

- ఈ కార్యకర్తలు కూడ కలుపూ, పిచ్చి మొక్కలూ తొలగిస్తారు? మొక్కలకు ముళ్ళ కంచెలేస్తారు!

- పాపం - రైతులకు చీడపీడల, వర్షాభావ - వర్షాధిక, పంటలకు ధర లభించని కష్టాలు!

- మరి శ్రమదాతలకు? మొక్కల దొంగల, మేకల బెడదలు!

- రైతులకు సాలు సరి ఫలితాలు - కార్యకర్తల కృషికి తరతరాల ప్రజలు సౌకర్యంగా బ్రతికే ప్రతిదిన ఫలసాయం!

- ఎన్ని వైపరీత్యాలు వచ్చినా అన్నదాతలు సేద్యం మానరు!

- ఆటంకాలు, అవహేళనలు, ఖర్చులు ఎదురౌతున్నా స్వచ్ఛ కార్యకర్తలూ అంతే!

               అలాంటి శ్రమ త్యాగధనుల నేటి రహదారి బాధ్యతతెలా ఉన్నవి?

1) 2 గోతాల గాజు ప్లాస్టిక్ తుక్కుల్ని ఒక షణ్ముఖుడు సేకరించాడు;

2) కార్యకర్తల సంఖ్య కాస్త తగ్గినా చెత్త లోడింగు ఆగలేదు;

3) పాతిక - ముప్పై మొక్కలకు రక్షణగా ముళ్ళకంపలమర్చారు;

4) రేపు నాటబోయే పూల మొక్కల కోసం కాబోలు - కొన్ని గుంటలు త్రవ్వారు;

5) నాటబోయే మొక్కల కోసం ముళ్ల కొమ్మల గుట్టలున్నవి చూడండి!

               మొక్కల ప్రేమికుడైన ఉరిమి శాయి గారు వర్షాన్ని లెక్కచేయక, షణ్ముఖుని సహాయంతో వచ్చి, జరిగిన ప్రతి కష్టాన్నీ చూశారు!

               తన గొంతే మైకయిన కోడూరు వారు నినాదాలు అదరగొట్టారు!

               వానలో నానుతూనే అందరూ ఆ ప్రతిజ్ఞల్ని బలపరిచారు.

               రేపటి హరిత ఉద్యాన పనుల కోసం మళ్ళీ NH216 వద్దనే కలవాలనుకొని, అంతా ఇళ్లకేగారు!

            ఇది ఆగని ధారావాహిక!
మఘలొ పుట్టి, పుబ్బలోన మాయమయే పని కాదిది
హ్రస్వ దృష్టి - వక్రబుద్ధి ఆలోచన కానేకాదిది
మాతృభూమి చల్లపల్లి మహనీయత వెలుగు దాక

ఇది నిరంతర ప్రక్రియ - ఇది ఆగని ధారావాహిక!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   03.08.2026