పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానక తప్పదు!
3914* వ విడత సామూహిక శ్రమ!
మంగళవారం (4.8.26) వేకువ 4.20 కే ఆ ఉఉత్సాహం డజను మందితో శుభారంభమై, 29 మంది పిడికిళ్లు బిగించి, శ్రమ యజ్ఞ ప్రతిజ్ఞలతో 6.15 కు ముగిసింది. ఈ 110 నిముషాల వ్యవధిలో ఆ NH 216 లో – పెదకళ్ళేపల్లి దారికి తూర్పుగా ఏ కార్యకర్త ఎంతగా శ్రమించాడూ. ½ కిలోమీటరు బారునా ఏం లబ్ది చేకూరిందీ వివరించే ప్రయత్నంగా:
- అసలు వాళ్ల ఉత్సాహానికీ, ఉద్వేగానికీ కారణం 58 బంగారు రంగు పూల (స్వర్ణ గన్నేరు) మొక్కలు నాటడమే!
అవన్నీ గతంలో నాటి, పెంచినవే గాని - కొన్ని నేల లోపంతోనూ, కొన్ని మేకల కాహారంగానూ, ఇంకొన్ని మొక్కల దొంగల బారిన పడీ నష్టపడ్డాయి!
- దమ్ము ట్రాక్టర్ల వల్ల పొలంలో తడి మన్ను రహదారిపైకి చేరితే - బాగా అంటుకుపోతే - వాటిని గోకి, ఊడ్చి, బాట అందాన్ని కాపాడడమెంత కష్టమో తెలుసా? మరి ఆ కష్టమేమో ఐదారుగురు కార్యకర్తలకు బాగా ఇష్టమై కూర్చుంది!
- మొక్కల్ని ట్రాక్టర్ నుండి దించుతున్నప్పుడూ, వాటిని మోస్తూ వయసు మరచిన కార్యకర్తలు పరుగెత్తుతుంటేనూ, ఊరికి దూరంగా ఉన్న రహదారి హరిత సౌందర్యాల పట్ల ఈ శ్రామికుల సంతోషమూ, క్రమశిక్షణా నాకు అర్థమౌతూనే ఉన్నవి!
- పలుగు, నక్కు, పారలతో పాదులు త్రవ్వే పని వీరిలో కొందరికి ప్రీతి పాత్రమే గాని - చదువుకొని ఉద్యోగించే మహిళలు ఆ పనులు చేస్తుంటే అది ఎట్లుంటది?
- అసలీ మట్టి - మరక పనులు అంత సీనియర్ డాక్టర్ కూ, 75 ఏళ్ళు దాటిన సోకాల్డ్ వృద్ధులకూ నప్పుతాయా?
- చీకట్లో, పని తొందరలో చూసుకోలేదేమో - కొందరి బట్టలకు బురద మరకలు చూశాను 6.00 సమయంలో!
కొందరు మాలాంటి వాళ్ల దృష్టిలో మా రోజు వారీ జీవితంలో ఈ గంటన్నర కాలమూ అదొక లోకం - అదొక అనుభవం!
ఒకప్పటి నిత్య కార్యకర్త తాతినేని రమణ గారు ఒక క్రొత్త రకం గడ్డి కోత యంత్రాన్ని - అదేదో నాగలి అన్నట్లుగా బండి మీద తెచ్చారు. అతని నినాదాలతోనే నేటి తుది సభ మొదలై,
DRK గారి సమీక్షతోనూ,
రేపు కూడ ఇదే NH 216 హైవేలోని శివరామపురం అడ్డ రోడ్డు వద్దనే కలుద్దామనే నిర్ణయంతోనూ నేటి శ్రమదానం సమాప్తం!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
నల్లూరి కలం రాముడు
కన్నులారగ స్వచ్ఛత కాంచి నిత్యం
కార్యకర్తల శ్రమను కవితలు కట్టి దాంతో
చల్లపల్లికి గుర్తింపు తెచ్చిపెట్టు
రామారావు మాస్టారి కలానికి నమస్సులివే!
- నాదెళ్ళ సురేష్
USA (కనెక్టికట్)
04.08.2026