3915* వ రోజు....           05-Aug-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం?

చూస్తుండగానే అలవోకగా 3915* వ శ్రమదానం!

               అది 5.8.26 - బుధవారానికి చెందినది, 4:20 కే 13 మందీ, కాస్త అటూ ఇటుగా మరో 14 మందీ – వెరశి 27 మంది చెమట చిందించిన NH216 సేవలు! కురుస్తున్నది వానో - మంచో, కాస్తున్నది ఎండో పట్టించుకోక పన్నెండేళ్ళ నుండి గ్రామం మేలు కోసం ఒక తపస్సుగా జరుగుతున్న భగీరధ ప్రయత్నమది!

ఇంటా - బైటా వేల మంది మనసుల్ని కదిలించి, ఆలోచనల్ని రగిలించి, రాష్ట్రవ్యాప్తంగా - అక్కడక్కడా మేధోమధనాలకు కారణభూతమైన - కార్యాచరణలు సైతం జరిపించిన సంచలనాత్మక శ్రమదానమిది!

               “ఆఁ.... ఏముందిలెద్దూ, ఏదో నిద్ర సరిగా పట్టని, తోచీ తోచని, 40-50 మంది కార్యకర్తలు “స్వచ్చోద్యమం” పేరు పెట్టుకొని, వేకువనే వెళ్ళడమూ, రోడ్లు ఊడ్వడమూ, చెట్లు నాటడమూ, చివరగా “స్వచ్ఛ - సుందర - అభ్యుదయ - ఆహ్లాదకర” చల్లపల్లికి జయజయధ్వానాలు చేయడమూ....” ఇంతే గదా అని తేలికగా కొట్టిపారేయదగని - కాలపరీక్షలకు నిలిచిన శ్రమదానోద్యమమని ఇప్పటికైనా గుర్తించదగినది!

               ఈ ఉదయం కూడ తగుమాత్రం గాలీ, వాన తుంపరలూ వచ్చాయి. రహదారి శుభ్రతా, కలుపుల ఏరివేతా, ప్రాత గుడ్డ మూటల సేకరణా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దరిద్రాల తొలగింపూ యధాతథంగా జరిగాయి. ఒక పోస్టాఫీస్ వీరుడు రహదారి దక్షిణాన అంటుకుపోయిన మట్టిని గోకి, ప్రోగులు చేస్తూనే ఉన్నాడు. హైవే పైన హైస్పీడుతో వాహనాల రొదలూ షరామామూలే!

               ఒక మార్పు ఏమంటే - మొక్కలు నాటడం కాక – నిన్న నాటిన – స్వర్ణ గన్నేరు పూలమొక్కల రక్షణకు ముళ్ళకంపలు కట్టడమే!

               6:10 దాక శ్రమించాకే, పనులు ముగించాకే - బస్ షెల్టరు వద్ద సమావేశమైన కార్యకర్తలు

1) DRK గారి పనుల సమీక్షతో బాటు,

2) నిన్న బందరులో DRO శ్రీధరరెడ్డి గారితో, DM&HO గారితో జరిగిన సమావేశ వివరాలూ,

3) జిల్లా పాలకులు ఈ మధాహ్నం చల్లపల్లి వచ్చి, జరిపే పర్యావరణహిత ప్రయత్నాలనూ,

4) రేపటి మన రహదారి పనుల కోసం శివరామపురం రోడ్డు ప్రక్కన బస్ షెల్టరు వద్దనే కలవాలనే సూచనా తెలుసుకొన్నారు!

      (పాఠకులు ఇది చదివే సమయానికి ముందే పైన చెప్పిన జిల్లా అధికారుల సమావేశం ముగిసింది)

               ఎవరైనా ఊహించిర?

ఎవరైనా ఊహించిర? ఈ సుదీర్ఘ శ్రమ చరితను?

నాలుగైదు లక్షల పని గంటల శ్రమదానమ్మును?

కళకళలాడే వీధుల గ్రామంలో ఈ మార్పును?

సమాజముపై ప్రభావమును? గ్రామచరితలో మలుపును?

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   05.08.2026