3916* వ రోజు....           06-Aug-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం?

3916* వ శ్రమదాన వార్తలు (బుధవారం – 6-7-26)

               మామూలుగా ఐతే – “12 ఏళ్లుగా చేసుకుపోతున్న పనుల గురించి, పెద్దగా విశేషాలేముంటాయిలే” అనిపిస్తుంది గాని – కాస్తంత నిలకడగా  చూసి, బుర్రకు పదునుపెడితే మాత్రం మీకు ఎన్ని  ప్రత్యేకతలైనా కనుపిస్తాయి! –

- అసలది తమ ఊరా - వీధా -ఇల్లా? వేకువ 3.30 కే లేచి, మూడేసి కిలోమీటర్ల దూరంగా NH 216 మీది ఒక బస్ షెల్టరు వద్దకు డజను మంది కార్యకర్తలు - మహిళలతో సహా 4.19 కే వెళ్లడమూ,

- అనంతరం 15 మంది సకాలంలో వాళ్లను కలుసుకొని, 6.09 దాక -  ఒక దేవాలయాన్ని పవిత్రీకరించినంత శ్రద్ధగా - 150 గజాల బారునా జాతీయ రహదారిని సేవించడమూ,

- నాగజ్యోతి అనే ఆస్పత్రి నర్సు ఒకామె - బృందావనుడితో సమానంగా ముళ్లకొమ్మలు నరకడమూ,

- ఆయనెవరో జ్ఞాన ప్రసాదట! -  LIC సంస్థలో చాలా పెద్ద ఆఫీసరుగా పనిచేశారట! ఇంకొక ప్రసాదుని గురించి చెప్పేదేముంది - ప్రొద్దున్నే లేస్తే “గ్రామ స్వచ్ఛ శుభ్రతలూ, పర్యావరణ భద్రతలూ, రహదార్ల హరిత సంపదలూ...” అని కలవరిస్తూ – రెడ్ క్రాస్ జిల్లా బాధ్యతలనూ, అనివార్యంగా వచ్చిపడుతున్న పేరు -  ప్రఖ్యాతుల బరువులను మోసుకొంటూ, తిరిగే డాక్టరూ,

- వయో భారాల్ని లెక్కచేయక మొండిగా రహదారి సౌందర్యానికి పాటుబడే ఐదారుగురూ.....

               వీళ్లెవరికీ తమ హోదాలు ఆ గంటన్నరపాటు గుర్తే లేకపోవడం మాత్రం పెద్ద వార్త కాదా?

               అసలీ మురికి పనుల కోసం వీళ్లని అనుమతిస్తున్నారే - వీళ్ల కుటుంబీకులు – వాళ్ళు మాత్రం ఈ స్వచ్చోద్యమంలో పరోక్ష పాత్రధారులు కారా?..... ఇలా వార్తావిశేషాలు ఎన్నని గుర్తు చేయను?

               6.15 సమయంలో ఏ కార్యకర్త ముఖంలోనైనా ముళ్ళ – మట్టి - చెత్త పనులు చేసినందుకు బిడియమనేదే కనిపించక – అదో రకం తృప్తి కొట్టొచ్చినట్లు కనిపించడం మాత్రం వార్త కాదా?

               నేటి పనుల సమీక్షతో బాటు, నిన్నటి జిల్లా అధికారుల సమావేశ వివరాలను తెలిపి, విస్పష్టంగా ఉద్యమ నినాదాలు ప్రకటించి,

 

               రేపటి రహదారి బాధ్యతల కోసం NH 216 మీద శారదా గ్రాండ్యూర్ వద్ద కలుద్దామని ప్రకటించినది దాసరి రామకృష్ణ ప్రసాదు గారే!

               అతికష్టం మీద రహదారి బాధ్యతలను నిర్వహిస్తూ నెలవారీ 520 చందాను ఆ డాక్టరుకు అందించినది కోడూరు మరియు అంబటి వారే! 

               తెగడడమే నాపనా?

ఎందరెందరో ప్రముఖులు - ఈ గ్రామం కానివాళ్ళు
ప్రజా జీవనపుదారుల పయనించాలని కోరుచు

ఇచ్చటికొచ్చి కష్టిస్తే - ఈ గ్రామం ఉలకనపుడు
తెగడడమే నాపనా ? పొగడడమే మంచిదా?

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   06.08.2026