3918* వ రోజు....           08-Aug-2026

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం?

  4000* వ పనిదినం దిశగా చల్లపల్లి శ్రమదాన ప్రస్థానం!

               ఒకప్పటి తెలుగు సినిమా 50-100 రోజులు  ప్రదర్శింపబడితే ప్రేక్షకులకు పండగలే! – ఇటీవల కేవలం 30  రోజులు అడితే – నిర్మాతలకు డబ్బులే డబ్బులు! మరి ఏ వ్యాపారమూ కాని- చేతిచమురు వదిలించుకొనే – శరీర కష్టం ప్రతి ఫలించే 3918* రోజుల శ్రమదానమూ, గ్రామ ప్రజలకందుమూలముగా కలిగే ఆహ్లాదమునూ  ఎందరు గ్రామస్తులు గుర్తిస్తున్నారు? 28000 మందిలో కనీసం 100 మందైనా  పాల్గొంటున్నారా?

               వచ్చి, ఒళ్ళొంచి  కష్టించక పోతేపోయిరి- టిక్కెటు ఖర్చు కూడ లేని 30 –40 –50 మంది యొక్క అనుదిన బహిరంగ శ్రమ ప్రదర్శన తిలకించరే! వీధుల ఖాళీలను ఆక్రమించే వారి, ఫ్లెక్సీలతో పర్యావరణాన్ని భగ్న పరిచేవారి, అందంగా పెరిగే పూల- పండ్ల మొక్కల్ని  ధ్వంసించే వారి ఆగడాలను ప్రశ్నించరే! 12  ఏళ్ల చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమ అంతర్యాన్ని పసి కట్టరే!

               ఈ శనివారం వేకువ NH 216 లోని శారాదా గ్రాండ్యూర్ కేంద్రంగా జరిగిన 39 +6 గురి సంగతి మాత్రం కొంత భిన్నంగా ఉన్నది – అసలు కార్యకర్తలు కాక – ఐదారుగురు కొంత సేపైనా  రహదారి శుభ్ర-హరిత- సుందరీకరణ శ్రమ రీతులను చూచి వెళ్లారు!

               1 ) ఆర  కీలోమీటరు బారునా, పూల మొక్కలు నాటే, నిన్నటి మొక్కలకు ముళ్ళ  కంపలమర్చే, పాదులు త్రవ్వే , ఒకానొక బృందావనుడు ముళ్ళ  కొమ్మల్ని  ఖండించే కష్టాలను ఇష్టాలుగా చేసుకుపోతుండడం చూసే ఉంటారు!

               2 ) ఒక పెద్ద చెట్టు ఏ కారణాననో దక్షిణంగా ఒరిగిపోతే 8 మంది దాన్ని నిలబెట్టి, తాళ్ళు  బిగించిన పనిని వాళ్ళు అర్దం చేసుకొనే ఉండవచ్చు!

               3) ఎక్కడ వాళ్ల ఇళ్లు- ఎక్కడ NH 216 రహదారీ ? ఎందుకీ మహిళలు చీపుళ్లతో ఊడ్చి, గోకుడు పారలతో మట్టిని తొలగించారో వాళ్లకు అర్దమయే ఉంటుంది.

               4) చలి గాలి వీచినా, చినుకులు పడుతున్నా ఏ కార్యకర్తా  పని విరమించని మొండితనాన్ని వాళ్లు  సానుకూలంగానే భావించి ఉంటారు. 

               చివరగా 6:20  దాటాక – ఫంక్షన్ హాలు ఎదుట నిలబడి దేసు జాహ్నవి నినాదాలు పాలకడాన్ని, మిగిలిన వంత  పలకడన్నీ, పాట  గాడు స్వచ్ఛ కార్యకర్తల శ్రమను కీర్తించడాన్నీ , N.శివ కుమారి 10000/- బ్యాంక్ చెక్కును ఉద్యమ ఖర్చుల  నిమిత్తం ఇవ్వడాన్నీ క్రొత్తవారి లో కొందరే చూశారు!

               అప్పుడిక DRK డాక్టరు  గారు గ్రామం లో జరుగుతున్న మంచి వార్తలనూ, కార్యకర్తలకు జాగ్రత్తలనూ చెప్పి,

                రేపటి శ్రమదానం సైతం శారాదా గ్రాండ్యూర్  వద్దనే జరుగునని ప్రకటించిరి!  

              పొగడకుండ మిన్నకుండి

అద్భుతములు సృష్టించే స్వచ్చోద్యమ చల్లపల్లి

నభినందన పూర్వముగా అనుసరింపజూస్తుంటే-
గోపాళం – గురవా – వరప్రసాదులండనిస్తుంటే -
పొగడకుండ మిన్నకుండి పోవుటసలు మర్యాదా?

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   08.08.2026