3919* వ రోజు.......           09-Aug-2026

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం?

80 నాళ్ల దూరంలో 4000* పని దినమిది!

               అనగా : 9-7-26 – ఆదివారపు శ్రమ దినం గురించిలెండి. అసలొక ఊరిలో – 12 ఏళ్ల పాటు సొంతానికి కాక - 28 వేల జనాభా ఆహ్లాదం కోసం రోజూ 30-40-50 మంది రకరకాల సామాజిక నేపధ్యాల వాళ్ళు వేకువ 4:20-6.10 నడుమ పాటుబడుతున్నారనే వార్త ఎలాంటిది?

               ఒకప్పుడిది నమ్మలేనిది, ప్రస్తుతమిది రాష్ట్ర - దేశ వ్యాప్తంగా అందరూ అంగీకరించి, ఆశ్చర్యపడి, అనుసరించాలని చూస్తున్నది! రాష్ట్రంలోని 13 వేల గ్రామాల్లో, దేశంలోని 6 లక్షల ఊళ్ల నుండి ఇలాంటి వార్త వినాలని మేధావులూ, దార్శనికులూ ఎదురు చూస్తున్నది! 30-40 గ్రామాల ఔత్సాహికులు ప్రయత్నించి, పాక్షికంగా ఆ ఊళ్లలో విజయవంతమైనది!

               కార్యకర్తల నాలుగైదు లక్షల పని గంటల కష్టం సంగతి అట్లా ఉంచితే, పుచ్చలపల్లి మిత్రా, శాంతా బయోటెక్ వరప్రసాదరెడ్డీ, గురవారెడ్డీ, గోపాళం, ఇటీవల అతి భూరి ఆర్థిక సాయమందించిన విజయేంద్ర ప్రసాదూ, సంవత్సరకాలంగా ఒక్కో ట్రస్టు కార్మిక వేతనం కోసం పదేసి – పదిహేనేసి వేలుపంపుతున్న దేశీయ - విదేశీయ ఆర్థిక సహృదయులూ ఈ సందర్భంలో స్మరణీయులు!

ఇక ఈ నాటి (3919* వ) శ్రమ సంగతికొస్తే :

- స్వచ్ఛ కార్యకర్తల సంఖ్య పరిమితమయి, 22 గా ఉన్నది. అందుకు ఒక కారణం వరుణ దేవుడు గారే! శ్రమదాతలు నిద్రలేచే సుమారు 3.30 నుండి గంటకు పైగా వాన ఆగలేదు! 4.45 నుండి 6.16 దాక వీధి శ్రమ వేళ మాత్రం మారింది! పని స్థలం కూడ NH 216 కు బదులు గంగులవారిపాలెం వీధికి తరలింది!

               తీగల, పిచ్చి మొక్కల, కలుపుల, అడ్డదిడ్డంగా పెరుగుతున్న కొమ్మల పనిలో వాళ్ళుండగా – వాన కూడ సన్నగానైనా కురుస్తూనే ఉన్నది – ఎవరి డ్యూటీ వాళ్ళదన్నమాట! అన్ని వ్యర్థాలూ కలిపి, ట్రాక్టర్ నిండింది. తుక్కు సర్దినది మళ్ళీ మాలెంపాటి అంజయ్యే!

               తన వయసూ, ఆపరేషన్ల పాలైన నడుమూ, కాళ్లూ.... ఏవీ పట్టించుకోని కార్యకర్త ఈయన! ఎన్నో డ్రైన్ల మురుగు సిల్టూ, చెత్తా తోడిన ఘనుడు! అనుకోకుండా లోతైన మురుగుకాల్వలో దభీమని పడి మునగడం ఆశ్చర్యమే మరి! ఆ తర్వాతే ఆయన చెత్త బండెక్కి గంటసేపు పని చేసింది!

               సమీక్షాకాలంలో ఐతే : అంబటి శంకరయోధుడు గంభీరంగా చేసిన శ్రమదాన ప్రతిజ్ఞలు వీధంతటికీ వినిపించాయి! రిటైర్డ్ లైఫూ, భార్యాభర్తలెలా ఉండాలో ఆయన చెప్పాక -

DRK ప్రసాదు గారైతే –

1) రావెళ్ల శివరామకృష్ణయ్య గారి చివరి రోజులను గురించీ,

2) ఇంకొందరు దాతలుంటే ఎన్ని పనులు చేయవచ్చు అనేదీ వివరించి,

3) దంపతుల ఆహారం గురించిన జోకూ వదిలారు!

               రేపటి శ్రమ కోసం NH 216 శారదా గ్రాండ్యూర్ వద్ద కలవాలని ఆహ్వానించారు!

               పొగడేందుకు నేనెవరిని?

అరమరికలు లేకుండా - ఆర్భాటం చేయకుండ

అన్ని కులాల కార్యకర్త లన్నదమ్మున్నట్లుగ

చల్లపల్లి గ్రామానికి శ్రమదానము చేస్తుండగ

తెగడేందుకు నాకేం పని? పొగడేందుకు నేనెవరిని?

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   09.08.2026