3920* వ రోజు.......           10-Aug-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం?

3920* వ నాటి ముచ్చటైన శ్రమదానం!

                              అది మరొకమారు నేషనల్ హైవేలో ని శారదా గ్రాండ్యూర్  అనబడే గ్రామ ప్రతిష్టాత్మక ఫంక్షన్ హాల్ సమీపంలోనే జరిగినది. ఈ సోమవారం (10.08.2026) వేకువ స్వచ్ఛ సుందర శ్రామిక కళాకారుల సంఖ్య 22 గానే కనిపిస్తున్నా, ఆ పనుల నాణ్యత మాత్రం నేను కొలిచి చెప్పజాలనిది!

               అదేమిటో గాని స్వచ్ఛ కార్యకర్తలకు ముహూర్తాల సెంటిమెంట్లు లేవు గాని ఎందుకో మరి నిర్ణీత సమయం  వేకువ 4:30 అయినప్పటికీ వీళ్ళలో సగం మంది ఠంచనుగా 4:20 కే వచ్చి ఎందుకు వేచి ఉంటారో తెలియదు. అది ముహూర్త బలమా అంటే అదీ కాదు.

               సరే వచ్చారనుకో చేతోడుగులు దాల్చి, తలదీపాలమర్చుకొని కత్తీ కటార్లు నూరుకుని ఆడ కార్యకర్తలు – మగ కార్యకర్తలు అలా రోడ్ల మీద దొరికిన కసవునూడ్చే వాళ్ళు ఊడ్చి,

               రోడ్డు ప్రక్క పల్లంలోకి దిగి అంతకముందు నాటిన మొక్కలకు ముళ్ళ కంపతో రక్షణ కల్పించే వాళ్ళు కల్పిస్తూ,

               నేను ముందే చెప్పినట్లు అది కూడా కళాత్మకంగా నెరవేరుస్తూ,

               అదిగో ఒక షణ్ముఖుల వారు ఏ ప్లాస్టిక్ సీసా, కప్పు, ఎంగిలాకు వంటి ప్లాస్టిక్ వస్తువులు కనపడినా లటుక్కున సంచిలో వేసుకుంటూ,

               ఇక ఆ నర్సులను చూడండి అంత పెద్ద విశాలమైన రహదారిని ఎంత శ్రద్ధగా శుభ్రపరుస్తున్నారో,

               ఇద్దరు సీనియర్ కార్యకర్తలను కూడా గమనిస్తే ఆ చీకటి వేళ రహదారి లోతట్టున అంత పట్టుదలగా ఎలా పనిచేసుకుపోతున్నారో,

               అసలిదంతా స్వచ్చోద్యమ చల్లపల్లి ముఠా సామూహిక చైతన్య బలం లేండి!

               మనకెంతో ఆశ్చర్యమనిపిస్తుంది గాని ఈ  కత్తుల, దంతెల, గోకుడు పార్ల మట్టి, బురద పనులు వీళ్ళకసలు లెక్కలోనివి కాదులెండి!

               అసలామాటకొస్తే ఈ మాత్రం రోజువారీ శ్రమదానం లేనప్పుడు పాపం ఈ అమాయకులకు పిచ్చెక్కిపోతుందంటే నమ్మండి.

               ఎప్పటిలాగే 6:20 సమయంలో ఒక ఉపాధ్యాయుడైన భోగాది వాసుదేవుడు శ్రమదానోద్యమ సాంప్రదాయక నినాదాలను దంచికొట్టగా మిగిలినవాళ్ళు బదులివ్వగా ఒక స్వచ్ఛ వైద్యుడు మాటల మంత్రాలను ప్రవచించి,

               రేపటి శ్రమదానం కూడా NH 216 మీదనే జరపాలని నిర్దేశించగా నేటి కార్యక్రమం ముగిసినది.                  

               పొగడేందుకు నాకేం పని

పుష్కర కాలము నుండీ నా నివాస గ్రామములో

అనితర సాధ్య శ్రమదానము అలవోకగ జరుగునపుడు
ఆ వర్తమాన చారిత్రక వాస్తవములె వ్రాస్తున్నా
పొగడేందుకు నాకేం పని? తెగడేందుకు నేనెవరిని?

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   10.08.2026