3921* వ రోజు.......           11-Aug-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం?

3921* వ విడత (11-8-26), మంగళవారపు కృషి!

               ఆ కృషీ, ఆ పట్టుదలా, (లేదా ఆ వెర్రీ) మళ్లీ NH216 - శారదా గ్రాండ్యూర్  ప్రాంతమందే జరిగెను! 4.30 - 6.00 నడుమ శ్రమదానం జరగాలనే స్వచ్ఛ – శుభ్ర - సుందరీకరణ నియమాన్ని ఎప్పుడో ప్రక్కన పెట్టి, ఈ వేకువ మరీ 4.19 కే రహదారి మురికి పనులకు దిగిన 12 మంది స్వచ్ఛ వీరాధివీరయ్యలూ, వీరమ్మలు ఎవరనగా:

1. కోడూరు ఫ్రమ్ గూడూరు

2. మహామునీశ్వరుడు

3. అంబటి శంకరాచార్యుడు

4. తూములూరి లక్ష్మణుడు

5. పరమ మురుగు - చెత్త వీరయ్య అంజయ్య

6. పనులందు ఆల్ రౌండరుడు బృందావనుడు

7. వ్రాతగాడూ/ కూతగాడూ ఐన నందేటి శ్రీనుడు

8. పేరు కస్తూరీ – చేసేది ఊరికి నానాచాకిరీ ఐన మరో శ్రీనివాసుడు

9. ఎంతో కొంత ఉత్తమ వాంగ్మి నరసింహుడు

10, 11. ఇందిరా - మహాలక్ష్ములు

12. ఇక పేరెందుకు గాని – తొలి ఫొటో తీసిన స్వచ్చాతి స్వచ్ఛ వైద్య కార్యకర్త!

               వీళ్లు మాత్రమే అనుకోవద్దు మరో 17 మంది కార్యకర్తలో – అతిధి కార్యశూరులో నేటి కార్యక్రమంలో పాల్గొన్నారు! ఎవరి అంకితభావం వాళ్లు ప్రకటించుకొన్నారు! అట్టి వారి జాబితా ఇది :

1. ఎడమ వాటం సజ్జా నామధేయుడు (వయసు రీత్యా నా తరువాత సీనియర్ మోస్ట్ వాలంటీర్)

2. తన పేరులోనే వీరలక్షణంకల - నేటి త్రివిధ ప్రతిజ్ఞా సంచాలకుడూ - వయోభార తృతీయ స్థానీయుడు.

3) నిఖార్సైన రైతూ, ఈడులో చతుర్ధుడూ, శివరామపురీయుడూ ఐన ప్రేమానందుడున్నూ

4) వయః సీనియారిటీలో పంచమ గౌరవనీయుడూ ఐన మోతుకూరి మస్తాన్ మహాశయుడు.

5) చల్లపల్లి పోస్టాఫీసుకు ఇరుసు లాంటి మెండు శ్రీనుడు,

6) భోగాది వాసుదేవ గురువర్యుడు

7) గడ్డికోతతో 10 మంది పని ఒక్కడే చేస్తున్న ఆకుల దుర్గాప్రసాదుడు,

8) మరొక మోతుకూరి సీతారామయ్య పేరిటి వ్యవసాయదారుడు,

9) ఒక జూనియర్ కస్తూరీ, రికార్డు స్థాయిలో రక్తదాన కర్ణుణుడైన మహావిజయుడూ,

10) హైదరాబాదీయుడైన ఒక కారు చోదకుడు,

11) గంగులవారిపాలెం అంకాలు,

12) స్వచ్ఛ సుందర కళాకారిణి దేసు మాధురీ దీక్షిత,

13) 2013 లోనే స్వచ్చోద్యమ ప్రారంభకురాలు కడియాల భారతి,

14) లాస్ట్ బట్ నాట్ లీస్ట్ - సైలెంట్ గా చల్లపల్లి శ్రమదాన ప్రోత్సాహకుడూ, భాగ్యనగర వ్యాపార కడియాల సురేష్.

               మరి - ఇందరు కాకలు తీరిన యోధులతో NH 216 రహదారి స్వచ్ఛ - శుభ్ర - సౌందర్య నిర్వహణకేమిలోటు? తుది సభలో నేటి శ్రమత్యాగం పట్ల DRK గారి ఆనందానికి మాత్రం లోటేమి?

               రేపటి శ్రమ సందడి కోసం కార్యకర్తలు కలువదగింది హైవేలో గంగులవారిపాలెం రోడ్డు - శారదా గ్రాండ్యూర్  మధ్యలో!

               తెగడేందుకు నేనెవరిని?

బలవంతము, మొహమాటము ప్రసక్తులే లేకుండా
వేకువ నాల్గింటి నుండి వీధి సేవలాచరించు
స్వచ్ఛంద శ్రమదాతలు చల్లపల్లిలో ఉండగ
పొగడేందుకు నాకేం పని? తెగడేందుకు నేనెవరిని?

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   11.08.2026