3922* వ రోజు.......           12-Aug-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం?

బుధవారం (12-8-26) నాటి రహదారి సేవలు! -@3922*

               అవీ అంతే - ఊరికి దూరంగా, గంగులవారిపాలేనికి దగ్గరగా, శారదా గ్రాండ్యూర్ ఫంక్షన్ హాలుకు సమీపంగా 4.30 కి కాదు - 4.20 కే శుభారంభమై 6:10 దాక సందడిగానూ – సామూహికముగానూ కొనసాగినవి.

               ఈ మట్టి పనుల - చెత్త పనుల వేకువ సేవలు క్రొత్తగా చూసే వాళ్లకైతే కష్టమైనవి గానో - జుగుప్పాకరమైనవనో అనిపిస్తాయేమో గాని – ఊరి జనం పట్ల నిర్వ్యాజ అభిమానం పెంచుకొని, పన్నెండేళ్లుగా పట్టుదలగా చేస్తున్న స్వచ్ఛ సైనికులు మాత్రం ఎంతో సరదాగా, అలవోకగా 28 వేల మంది గ్రామస్తులకు ఆహ్లాద ప్రమోదకంగా భావిస్తారు.

               ప్రతి కార్యకర్త యొక్క బురద - పేడ - చెత్త - కలుపు పనుల్నీ, చేస్తున్నప్పటి వారి ముఖ కవళికల్నీ నేను దగ్గరగా పరిశీలిస్తూనే ఉంటాను, దమ్ము పట్టి బరువు పనులు చేశాక వాళ్ళ ఫీలింగ్స్ నీ కనిపెటుతూనే ఉన్నాను; ఏళ్ళ తరబడీ చేస్తున్న వీధి శుభ్రతలూ, పెంచుతున్న హరిత సంపదలూ, వివిధ సుందరీకరణలూ వాళ్ళలో విసుగును కాక - మరింత ఇష్టాన్ని పెంచడమేమిటా అని ఆలోచిస్తుంటాను!

               సామాజిక శాస్త్రజ్ఞులో, మానసిక తత్త్వవేత్తలో, విశ్వవిద్యాలయాల పరిశోధక విద్యార్థులో అధ్యయనం చేసి తేల్చవలసిన శ్రమదానమిది!

               ఈ పూటా అంతే - 30 మంది కార్యకర్తలు అరకిలోమీటరు బారునా ఎన్నిరకాల సేవలు చేశారో!

               ఆ బృందావనుడేమో ముళ్లమండలు నరకడమొక కుటీర పరిశ్రమగా మార్చేశాడు; చెత్త బండెక్కే పని లేనందున అంజయ్యేమో ముళ్ళ కంప పనికే దిగాడు; చీపుళ్ల వారికి సిమెంటు బాట మీద దుమ్ము కనిపిస్తే – మట్టి ఉంటే ఊరుకొంటారా?

               మరీ అవసరమైతే తప్ప నిశ్శబ్దంగానే పనులు చేసుకుపోయే సజ్జా - జాస్తి - ఆకుల ప్రసాదులూ, లోతట్టున దీక్షగా కలుపు చెక్కే అంబటి శంకరుడూ, ఇద్దరే 10 మంది సందడి చేసే కోడూరూ - విజయులూ ఇలా ఈ బుధవారపు రహదారి బాధ్యతలంటే – పాతిక ముప్పై మంది శ్రమల కలబోత! డాక్టర్ DRK గారి నిరంతర పర్యవేక్షణ! ఎన్ని చోట్ల ఏ పనులు జరుగుతున్నా ఏకోన్ముఖ లక్ష్య సాధన! ఏ ఇతర గ్రామస్తులకైనా ఇదొక సామాజిక బాధ్యతా పాఠశాల!

               మరి నేటి తుది సభను గ్రామ మేలిమి ప్రతిజ్ఞలతో ప్రారంభించినది శ్రీమాన్ విన్నకోట వెంకటేశ్వరుల వారు; తరిగోపుల ప్రాంగణ బాధ్యతలను గుర్తుచేసినది Dr. పద్మావతి గారు; జరిగిన ఈ వేకువ పనుల్ని వివరించి,

               రేపటి మన శ్రమదానం చిల్లలవాగు వంతెన దగ్గరి తరిగోపుల ప్రాంగణానికవసరమని చెప్పినది దాసరి రామకృష్ణ వైద్యుల వారు!

               నాకెందుకసలు?

ఆలయాలు, బడులు, వీధులందముగా కనిపించక -
ఆహ్లాదము కలిగించక కళాహీనమై పోతే
తమ శ్రమనూ, సమయమునూ ధారబోయు వారి గూర్చి
పొగడడమే నా పనా? తెగడుట నాకెందుకసలు?

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   12.08.2026