పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం?
80* వ స్వాతంత్య్ర దినోత్సవ – (శనివారం-15.8.26) 3925* వ శ్రమదానోత్సవం!
సదరు జంట ఉత్సవాలు జరుపుకొన్న స్వచ్చోద్యమకారులు సుమారు 80 మంది; వేదిక వక్కలగడ్డ, చల్లపల్లి గ్రామాల సరిహద్దులోని చిల్లలవాగు గట్టు వంతెన ప్రాంతం; సమయం షరామామూలే-4.20 నుండి 7.25 దాక!
అసలు శ్రమదానమంటే ఏమిటో, ఈ వేకువ సామూహిక శక్తి ఈ గ్రామంలో ఎన్ని అద్భుతాలనావిష్కరిస్తున్నదో, “నాకూ-నా చిన్న బొజ్జకూ శ్రీరామ రక్ష” అని కాక “దేశం, సమాజం, బహళ ప్రజా సంక్షేమం...” లాంటి ఏ కొంచెం స్పృహ ఉన్నవాళ్లకైనా ఈ 2-3 గంటల కార్యక్రమాలూ, వక్తల పలుకులూ ఎంతగా స్ఫూర్తినింపగలవో-ఈ ఉదయం పాల్గొన్న ఏ ఒక్కరి ముఖం చూసినా ఇట్టే తెలిసిపోతుంది!
చల్లపల్లి శ్రమదానోద్యమాన్ని చాల మంది అర్ధం చేసుకొంటున్నది-“రోడ్లూడుస్తారు, బస్టాండో-శ్మశానమో బాగుచేస్తారు, చెట్లు నాటుతుంటారు, చుట్టూ ఏడెనిమిది రహదార్లను కూడ సుందరీకరిస్తారు....” అనే! అసలు దాని పరిధి ఎంత విశాలమో-గ్రామ సమాజం పట్ల దాని నిబద్ధత ఎంత గట్టిదో-ఆ తాత్త్వికత లోతెంతటిదో... కొద్దిమందే గ్రహిస్తారు!
బెజవాడ రోడ్డులో వెళ్తూ ఆగి ఆ సమావేశాన్ని చూసి, ఆ డాక్టరమ్మ ఉపన్యాసం విని- “ఏమిటి పాపం-అన్నన్ని లక్షలు ఆ ఆరేడు సెంట్ల సుందరీకరణకు ధారపోసిందా? తనకు తోడ్పడిన వాళ్ళను పేరుపేరునా ప్రశంసిస్తూ అంతసేపు ఆ ఉపన్యాసమేమిటి....” అనుకొంటారేమో గాని-
జనాహ్లాదం కోసం ఆమె తెగింపూ, సామాజిక సేవాపరులతో తన సుదీర్ఘ అనుబంధం, ఆత్మీయతానందాలూ ఆలోచించేవారు బహుకొద్దిమందే!
త్రివర్ణ జెండా స్తంభావిష్కరణ చేసేప్పుడు 65 ఏళ్ల గోపాళం శివన్నారాయణ కుర్రాడిలాగ ఈల వేయడం చూశారా? ఇక ఆ శివుడు గారు స్వచ్ఛ చల్లపల్లి బోర్డును ఆవిష్కరించే సమయంలో మన స్వచ్చోద్యమ సారధి మన సాంప్రదాయక నినాదాలను ప్రకటించేశారు.
అక్కడున్న స్వచ్ఛ కార్యకర్తల కన్నా అతి పెద్ద పిచ్చోడు అతడే! అతడి పిచ్చికి ఫలితం దక్షిణ దేశంలో 47 సముచిత వైద్యశిబిరాలు! ఈ ఉషాగమన వేళ ఆయన మాటల్ని క్రమపద్ధతిలో పేర్చితే - స్వాతంత్ర్య దిన ఉపన్యాసాలలో అదొక ఆణిముత్యమౌతుంది!
ఆగష్టు 15 సభల్ని మనం ఎన్నిటినో చూసుంటాం. కాని ఇది వేఱు! సామాజిక సేవల్లో తలపండిన-శ్రమదాన పూనకం పట్టిన ఈ 70-80 మంది వెర్రోళ్లని ఎక్కడైనా చూశారా? సందేటి శ్రీను పాడిన స్వేచ్ఛా గీతం కూడ అన్ని చోట్ల వినిపిస్తుందా? అసలు 2 గంటలకు పైగా ఇంత రంజుగా అటు స్వాతంత్ర్యోత్సవ-ఇటు శ్రమవిభవోత్సవ సభ ఎక్కడైనా జరుగుతుందా?
గోపాళం వారి ఉత్సాహమూ, చల్లపల్లి శ్రమదానం పట్ల బాధ్యతా ఎలా ఉన్నవంటే DRK గారు వారిస్తున్నా వినక 10 రోజుల్నాడు 5,000/- ఇచ్చింది చాలదన్నట్లు మళ్ళీ ఈ పూట మరో 5 వేల చెక్కును స్వచ్చోద్యమ ఖర్చులకై అందజేశారు.
ఏ లెక్కప్రకారమో గాని చెన్నై నుండి పునరాగమించిన మరొక డాక్టర్ మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారు కూడా 8 వేల చెక్కును సమర్పించారు. (బహుశా తాను మళ్ళీ చెన్నై నుండి తిరిగివచ్చే డిసెంబర్ దాక నెల చందా అయి ఉంటుంది)
దీనికి తగ్గట్లే 7.00 కు-అల్పాహారం పేరిట అనల్పాహార విందూ జరిగింది!
రేపటి శ్రమదానం మళ్లీ NH216 రహదారి పైకి మారునని తెలిసింది!
అతిరథులను వీక్షించా!
గ్రామ కలుషితముల మీద కత్తి దూయు కార్యకర్త
లందరిని పరీక్షించా - అభిమతాలు గుర్తించా
సొంత ఊరి సమస్యలకు స్పందించుట గమనించా
అర్ధ రథులు – మహారథులు - అతిరథులను వీక్షించా!
- నల్లూరి రామారావు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
15.08.2026