3926* వ రోజు.......           16-Aug-2026

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు తక్షణమే మానేద్దాం!

3926*వ విడత సాముహిక శ్రమ!

               అసలే ఆదివారము –(16-08-26), పనులు జరిగేది ఊరి వెలుపల దూరంగా నైనా- ఒక సువిశాల హరిత – సుందరీకృత రహదారి పైన, అంతకు ఒక గంట ముందేమో వానజల్లు పడి, సుమ బాలలు స్నానమాడిన చల్లని – చక్కని – ఆహ్లాదకర వాతావరణము, చేస్తున్న రహదారి పనులేమో ప్రతిఫల మాసించని సామాజిక సత్కార్యమూ!

               కార్యకర్తలు 42 మంది, వారి చేతుల్లో చీపురులూ, దంతెలూ, పారలూ, కత్తులూ, మైకు నుండి అసభ్యకరములు కాని- చైతన్య స్ఫోరకములైన పాటలు, రయ్ రయ్ మని రోడ్డు పైన వాహనాల ధ్వనులు, మరొక వంక మొక్కల పాదుల పనుల మధ్య హుషారెక్కువైన కోడూరు వారి – కస్తూరి విజయ్ గారి కేకలు!

               మరి ఇలాంటి సన్నివేశం చూస్తే మామూలు వ్యక్తులైతే సమయం తెలియకుండా పని చేసుకుపోతారు, సున్నిత కళా హృదయులైతే పాటల- పద్యాల హమ్మింగ్ లైనా చేస్తారు, కవులైతే ఈ మహత్తర శ్రమ వేడుక పైన పాటో-పద్యమో వ్రాస్తారు, గాయకులైతే గొంతెత్తి కీర్తిస్తారు!

               సజ్జా ప్రసాదు, ఆకుల ప్రసాదు వంటి వాళ్ళైతే ఇవేవీ పట్టించుకోక – వినిపించుకోక – పనుల్లో మునుగుతారు. ఇక డి.ఆర్.కె ప్రసాదైతే- అరకిలోమీటరు పని స్థలం బారునా తిరుగాడుతూ- ఈ లోకోత్తర శ్రమదాన సౌందర్యానికి  లోలోనే మురిసిపోతూ 4:20- 6:10 మధ్య  కాలాన్ని క్షణాలుగా గడిపేస్తూ – అలౌకికానుభూతికి లోనౌతారు!

               అసలీ 40 మందికి పైగా  స్వచ్ఛ కార్యకర్తలలో దీన్ని ఆత్మ సంతృప్తితో కాక- తప్పని తద్దినంగా ఎవరైనా భావిస్తున్నారా? ఎవరి బలవంతానో- మొహమాటానో ఇక్కడికి వస్తున్నారా? కార్యకర్తలు అలాంటి వాళ్ళేఐతే- ఈ శ్రమదానం ఏనాడో అటకెక్కేది! ఈ 12 ఏళ్ల శ్రమచరిత్రే ఉండేది కాదు!

               6:20 తరువాత తుది సమావేశాన్ని ముందుగా తన నినాదాలతో ప్రారంభించిన ధ్యానమండలి మిత్రుడు గోళ్ల వెంకటరత్నం గారు, క్లుప్తంగానూ, ప్రాభావికంగానూ పనికొచ్చే సూక్తుల ప్రకటన కర్త అడపా గురవయ్య గారు.

               నేటి కళాత్మక – పుష్ప నిబిడికృత- జాతీయ రహదారి అందచందాలను ప్రస్తావించి, అందుకు కారకులైన శ్రామికుల కష్టాన్ని గుర్తించిన వారు DRK గారు !

               రేపటి శ్రమదానం కూడ ఈ గంగులవారిపాలెం సమీపంలోని రహదారి వద్దనే అని ఆమోదించిన వారు 42 మంది!   

               కలవు సకల హంగులు

గలగల పారే డ్రైనులు – కళకళలాడే వీధులు

అడుగడుగున హరిత వనము - పూదోటల పరిమళాలు
జలధారల కడ ఫొటోలు - సెల్ఫీల వినోదాలు....
గంగులపాలెం వీధికి కలవు సకల హంగులు!

- నల్లూరి రామారావు

   రిటైర్డ్ ప్రిన్సిపాల్

   16.08.2026